బిర్యానీ ఈ పదం పలికితే చాలు, ఒక్కసారిగా మనసు ఉల్లాసంగా మారుతుంది. దాని వాసన, రంగు, రుచిని ఆస్వాదించే ప్రతి ఒక్కరి దృష్టిలో ఇది కేవలం ఒక ఫుడ్ ఐటమ్ కాదు… అది ఒక ఎమోషన్. పండగకు, విందుకు, సండే స్పెషల్‌కు, పార్టీకి… ఇలా ఏ సందర్భమైనా బిర్యానీ లేకుండా పూర్తవదు. హైదరాబాద్, లక్నో, కోల్‌కతా వంటి నగరాల్లో బిర్యానీ ఓ సంస్కృతిలా మారిపోయింది. ఎక్కడ మంచి బిర్యానీ దొరుకుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా చుట్టూ తిరిగే జనాల సంఖ్య చూసినా ఈ వంటకం పట్ల ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.
ఇక హైదరాబాద్ లో అయితే గల్లీ గల్లీ బిర్యానీ హోటళ్లే. ఇంట్లో అయితే ఆదివారం వచ్చినా, అతిథి వచ్చినా, ఆనందం వచ్చినా బిర్యానీ తప్పదు. రుచికి మారుపేరు అయిన ఈ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. అయితే ఇంతగా మనసులో స్థానం సంపాదించిన బిర్యానీనే… మన శరీరానికి నెమ్మదిగా హాని చేస్తోందన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బిర్యానీ తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావాలు: బిర్యానీలో ఎక్కువగా ఉండే నూనె, మసాలాలు, మాంసం, రకరకాల జంక్ అంశాలు మన శరీరానికి తాత్కాలికంగా సంతృప్తి ఇచ్చినా, దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హోటళ్లలో తయారయ్యే బిర్యానీల్లో ఎక్కువగా శుద్ధి చేయని నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తారు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.
ఇక ఎక్కువ మసాలా వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అజీర్ణం, గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు తరచూ బిర్యానీ తినే వారిలో కనిపిస్తాయి. మాంసాహార బిర్యానీలో ఉండే కొవ్వు పదార్థాలు శరీర బరువు పెరుగుదలకు కారణమవుతాయి. లీవర్‌పై బరువు పడుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ లేని జీవిత శైలిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
వెజ్ బిర్యానీ కూడా సేఫ్ కాదు: కొంతమంది శాకాహార బిర్యానీ అయితే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ అదే పద్ధతిలో ఎక్కువ నూనె, ఉప్పు, మసాలాలు ఉంటే అది కూడా ముప్పే. బిర్యానీకి వేయించే వెజ్ గ్రేవీలు కూడా సోడియం, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉండే చాన్స్ ఉంది.
బిర్యానీ తినడం తప్పు కాదు. కానీ అది ఎంత తింటున్నాం, ఎంత తరచుగా తింటున్నాం అనే విషయంలో జాగ్రత్తలు అవసరం. వీకెండ్ స్పెషల్‌గా ఒక్కసారి తినడం మామూలే. కానీ వారంలో మూడేళ్ల కంటే ఎక్కువసార్లు బిర్యానీ తింటే శరీరానికి తీరని హాని జరగవచ్చు. అందువల్ల హోమ్మేడ్ బిర్యానీను ఆరోగ్యంగా తయారు చేసి మితంగా తినడమే మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారం. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)