సమతులాహారానికి గుడ్లు చాలా మంచివి. గుడ్డు తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు పొందుతాము. గుడ్డు తినడం వల్ల బరువు సైతం తగ్గుతామని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. గుడ్లల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాలరీలు తక్కువ ఉంటాయి. మీరు తినే డైట్ లో గుడ్డు ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. అంతేకాదు గుడ్లను ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అన్న దానివల్ల కూడా మనం పొందే లాభాలు ఎన్నో. బరువు పెరగకుండా ఉండాలంటే కాలరీలు తక్కువ తీసుకోవాలి. రోజూ డైట్ లో గుడ్డు ఉండేలా చూసుకోవాలి.
ఉదాహరణకు లంచ్ లేదా డిన్నర్ గా రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఒక బౌల్ రకరకాల కూరగాయముక్కలను తింటే అందులో 274 కాలరీలు మాత్రమే ఉంటాయి. ప్రొటీన్లు బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటివల్ల కొద్దిగా తింటే చాలు కడుపునిండినట్టు ఉంటుంది. గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక పెద్ద గుడ్డులో దగ్గర దగ్గరగా ఆరు గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల కడుపు బాగా నిండినట్టు ఉంటుందని అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. అందుకే ప్రొటీన్లు బాగా ఉన్న బ్రేక్ ఫాస్ట్ తింటే ఒక రోజులో తీసుకునే కాలరీల శాతం కూడా తగ్గుతుంది.
ఒక అధ్యయనంలో అయితే డయటరీ ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఊబకాయం పాలబడకుండ ఉంటామని తేలింది. ప్రొటీన్లు బాగా ఉండే డైట్ జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తుందిపిం. డిపదార్థాలు, ఫ్యాట్స్ వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది కానీ ప్రొటీన్ల వల్ల జరిగినంత శక్తివంతంగా మాత్రం జీర్ణ వ్యవస్థ పనిచేయదు. అందుకే పిండిపదార్థాలు, ఫ్యాట్ల కన్నా గుడ్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినడం వల్ల కాలరీలు బాగా కరుగుతాయి. ముందే చెప్పినట్టు ఏ సమయంలో గుడ్డును తింటే మంచిది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డును తింటే బరువు తగ్గుతారు.
ఒక అధ్యయనంలో కార్బోహైడ్రేట్లు బాగా ఉన్న బ్రేక్ ఫాస్ట్ తిన్నవారి కన్నా బ్రేక్ ఫాస్టుగా గుడ్డును తిన్నవాళ్లు మధ్యాహ్న భోజనాన్ని తక్కువ పరిమాణంలో తింటున్నట్టు వెల్లడైంది. గుడ్డును మీరు ఎలా తింటున్నారన్న దాన్ని బట్టి కూడా బరువు తగ్గడంలో దాని ప్రభావం ఉంటుందని మర్చిపోవద్దు. నిత్యం ఆరోగ్యకరమైన డైట్ లో గుడ్డు తప్పకుండా ఉండేట్టు చూసుకోవడం చాలా ముఖ్యం. గుడ్డును తినడం వల్ల రోజులో తీసుకునే కాలరీల పరిమాణం బాగా తగ్గుతుంది.
గుడ్లు మంచి పోషకాహారం మాత్రమే కాదు వీటితో రకరకాల ఫుడ్స్ ను ఎంతో సులభంగా తయారుచేయొచ్చు కూడా. చాలామంది గుడ్లను బేక్ చేసి తింటారు. ఉడకబెట్టి తింటారు. ఆమ్లేట్ గా వేసుకుంటారు. గుడ్డుతో కూర చేసుకుంటారు. పీచుపదార్థాలు బాగా ఉన్న కాయగూరముక్కలతో గుడ్డును బ్రేక్ ఫాస్ట్ గా తింటే ఎంతో మంచిది. లేదా లంచ్ టైములో సలాడ్ కు ఉడకబెట్టిన గుడ్డును జోడించి తింటే కూడా మంచిది. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు తక్కువవుతాయని, స్ట్రోక్ వంటివి తలెత్తవని వెల్లడైంది. రోజూ తినే సమతులాహారంలో పరిమిత ప్రమాణాల్లో గుడ్డును చేర్చడం వల్ల ఆరోగ్య లాభాలు ఎక్కువగా ఉంటాయని కూడా అధ్యయనాల్లో తేలింది.
కాలరీ కంట్రోల్ డైట్ లో గుడ్డును చేర్చితే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయంటున్నారు. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ తో పాటు పోషకాలు బాగా ఉంటాయి. పచ్చసొన, తెల్లసొనలతో కలిపి గుడ్డు తినడం వల్ల సమపాళ్లల్లో పోషకాలు, ఫ్యాట్, కాలరీలు శరీరానికి అందుతాయి. గాస్ట్రో ఇంటస్టైనల్ డిస్ట్రస్ తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థను ఇవి బలోపేతం చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. కంటిచూపు సమస్యలు తలెత్తకుండా పరిరక్షిస్తాయి. తెల్లసొనలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటే, పచ్చసొనలో ఫ్యాట్ తో పాటు ద్రవరూపంలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
గుడ్డులోని తెల్లసొన ఒక్కదాన్నేతిన్నదాని కన్నా తెల్లసొన,పచ్చసొన రెండింటినీ తినడం వల్ల పొందే ప్రయోజనాలు బాగా ఎక్కువని అధ్యయనకారులు చెప్తున్నారు. మొత్తానికి ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి గుడ్డు ఈజ్ వెరీ గుడ్ అనమాట.