ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఎలక్ట్రోలైట్స్ చాలా ముఖ్యం. చలికాలంలో వీటిని శరీరానికి అందించే పళ్లు కొన్ని ఉన్నాయి. అవి:
రకరకాల ఖనిజాలు అంటే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియంల సమ్మేళనమే ఎలక్ట్రోలైట్స్. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా పనిచేసేట్టు చేస్తాయి. శరీరంలో నీటిని సమతుల్యం చేస్తాయి. కణజాలానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. శరీరంలోని అవయవాలన్నీ సరిగా పనిచేసేలా చూస్తాయి. కణాల్లోని వ్యర్థాలను బయటకు పంపిచివేస్తాయి. అలాంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే పండ్లు కొన్ని ఉన్నాయి. శీతాకాలంలో వీటిని తింటే శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
అలా ఎలక్ట్రోలైట్లు బాగా ఉండే పళ్లలో అరటిపళ్లు ఒకటి. వీటిల్లో పొటాషియం అత్యధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది. అరటి పండ్లలో కొవ్వు లేదు. జీర్ణక్రియ బాగా పనిచేయడానికి ఈ పళ్లు ఎంతో దోహదపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసినన్ని యాంటాక్సిడెంట్లను అందిస్తుంది. ఇందులోని పొటాషియం మూత్రపిండాలు బాగా పనిచేసేలా చేస్తుంది. విటమిన్ సి, ఎ, కాల్షియంలు వీటిల్లో ఉన్నాయి. ఈ పళ్లలో ఫ్యాట్ లేదు. 15 గ్రాముల మేర పిండిపదార్థాలు ఉన్నాయి. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా అరటి పండు కాపాడుతుంది. శరీరానికి కావలసిన ఐరన్ గ్రహించి రక్తహీనతను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ పండ్లలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్త్రైటిస్, గుండెజబ్బులు వంటి జబ్బులతో బాధపడే పేషంట్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
ప్రూనే పండు కూడా శీతాకాలంలో శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇందులో పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. విటమిన్ ఎ, మాంగనీసు, విటమిన్ కె, ఐరన్, విటమిన్ బి6, కాపర్, విటమిన్ సిలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గాస్ట్రో ఇంటస్టైనల్ సమస్యలను ఈ పండు నివారిస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండడానికి సహకరిస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్లకు కొదవేలేదు.
చలికాలంలో స్ట్రాబెర్రీలు శరీరానికి కావలసినంత శక్తినిస్తాయి. ఇందులో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ కె, మాంగనీసు, ఫాస్ఫరస్లు ఉన్నాయి. ఈ పండు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలంలో తినాల్సిన మరో ముఖ్యమైన పండు దానిమ్మ. ఈ పండులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉన్నాయి. యాంటాక్సిడెంట్లు బాగా ఉన్న ఈ పండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేయడంలో కూడా ఈ పళ్లు సహాయపడతాయి. శరీరంలో రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.
శరీరానికి కావలసినన్ని ఎలక్ట్రోలైట్లను అందించే మరో పండు యాప్రికాట్. వీటిల్లో పీచుపదార్థాలతో పాటు పొటాషియం, విటమిన్ ఇ, ఎ, సిలు కూడా ఉన్నాయి. మధుమేహరోగులకు, గుండెజబ్బులతో బాధపడేవారికి యాంటాక్సిడెంట్లను అందిస్తుంది. వీటిల్లోని విటమిన్ ఎ, ఇలు కంటి ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. చర్మ ఆరోగ్యానికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడతుంది. వయసు కనిపించకుండా చేసే గుణాలు ఈ పండులో ఉన్నాయి. కొన్ని రకాల జీర్ణసంబంధ సమస్యలను తగ్గించడంలో కూడా యాప్రికాట్లు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే శీతాకాలంలో మీ డైట్ లో పైన చెప్పిన పళ్లలో ఏదో ఒకటి నిత్యం ఉండేలా చూసుకోండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.