Health Benefits Of Dark Chocolate: చాక్లెట్ అనగానే ఎవరైనా సరే ఎగిరిగంతేస్తారు. చాక్లెట్‌లు ఎంతో రుచికరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ ఒకటి. దీని రుచి కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కోకో గింజలతో తయారు చేస్తారు. ఇందులో కోకో కంటెంట్, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం 70 శాతం కోకో కంటెంట్ ఎక్కువ ఉండే డార్క్ చాక్లెట్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ప్రతిరోజు డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలు:
డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఫ్లేవనాయిడ్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ప్రమాదం రాకుండా ఉంటుంది. ఇందులో ఉండే కోకో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గిస్తుంది. “హ్యాపీ హార్మోన్లను” విడుదల చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల రోజంతా చురుకుగా ఉంటాము.
డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, మెదడు కణాలను రక్షిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు డార్క్ చాక్లెట్ తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉంటుంది.
సాధారణ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్‌లో రాగి, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తినడం మంచిది. చర్మ సమస్యలను కూడా తగ్గించడంలో డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి ముఖంపైన మొటిమలు, నల్ల మచ్చలు రాకుండా చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ డార్క్ చాక్లెట్‌లను తినవచ్చు. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుచుతుంది. ముఖ్యంగా అజీర్ణం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
డార్క్ చాక్లెట్ ఎంత తీసుకోవాలి:
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది అయినప్పటికి మీరు దీని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు ఒక 20 గ్రాములు తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు రోజు 25 గ్రాములు తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటుంది. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.