Friday, November 22, 2024
Homeహెల్త్Fennel is the best: సోంపులో సొంపెంతో...

Fennel is the best: సోంపులో సొంపెంతో…

భోజనం చేసిన తర్వాత చాలామంది సోంపు గింజలు తింటారు. వీటిని తింటే నోరు దుర్వాసన రాదు. అంతేనా… అందానికి, ఆరోగ్యానికి, చివరకు వంటల్లో సైతం సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిల్లో పోషకవిలువలు పుష్కలంగా ఉన్నాయి.

- Advertisement -

పీచుపదార్థంతో పాటు మెగ్నీషియం, మాంగనీసు, కాపర్, జింకు, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, పొటాషియం, రైబోఫ్లావిన్ , పరిమితంగా కాలరీలు వీటిల్లో ఉన్నాయి. రోగనిరోధకశక్తికి ఉపయోగపడే విటమిన్ సి కూడా ఈ గింజల్లో ఉంది. అంతేకాదు విటమిన్ సి మన శరీరంలో యాంటాక్సిడెంటుగా

పనిచేస్తుంది. సోంపులో ఉండే మెగ్నీషియం జీర్ణక్రియను శక్తివంతం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. సోంపు లోని పొటాషియం, మాంగనీసుల వల్ల శరీరంలోని ఎముకలు ద్రుఢంగా తయారవుతాయి. అందుకే రోజుకు ఒక చెంచా సోంపుతింటే మంచిందటున్నారు పోషకాహారనిపుణులు. డైట్ లో సైతం సోంపును చేర్చాలని సూచిస్తున్నారు. పైగా సోంపు గింజలు సహజసిద్ధమైన అందాన్ని కాపాడడంలో సైతం బాగా పనిచేస్తాయి.

ముఖ్యంగా చర్మం, వెంట్రుకల సౌందర్యాన్ని ఇవి సంరక్షిస్తాయి. సోంపు గింజల్లోని పోషకాలు చర్మ సంబంధమైన సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా సహకరిస్తాయి. మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. సోంపు గింజలు మొటిమలను కూడా తగ్గిస్తాయి. వీటిలోని యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు రావడానికి కారణమైన బాక్టీరియాను నశింపచేస్తాయి.

మొటిమల వల్ల తలెత్తే వాపు, నొప్పులను తగ్గిస్తాయి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా సోంపు గింజల పొడిలో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కడిగేసుకుంటే చాలు. మంచి ఫలితం కనిపిస్తుంది. సోంపు సహజసిద్ధమైన ఫేషియల్ టోనర్ గా కూడా పనిచేస్తుంది. కారణం సోంపు గింజల్లో సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్స్ ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లో చేరిన మలినాలను తొలగిస్తుంది. ముఖంపై ముడతలు రాకుండా, గీతలు పడకుండా కూడా సోంపు సహాయపడుతుంది. సోంపు గింజల్లోని విటమిన్ సి వల్ల చర్మం ముడతలు పడదు. చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీరాడికల్స్ ను శరీరం నుంచి ఇది బయటకు పంపిస్తుంది. రోజూ సోంపు నీటితో ముఖం కడుక్కోవడం వల్ల ముఖంపై ఏర్పడ్డ ముడతలు, గీతలు మెల్లగా పోతాయి. దీనికి చేయాల్సిందల్లా గ్లాసుడునీళ్లల్లో సోంపు గింజలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ సోంపు నీళ్లతో ముఖం కడుక్కోవడమే.

చర్మంపై ఏర్పడ్డ మురికిని, చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలను పోగొట్టడంలో సోంపు క్లీన్సర్ గా పనిచేస్తుంది. వేడి నీళ్లు ఒక గిన్నెలో పోసుకుని అందులో పెద్ద చెంచాడు సోంపు గింజలు వేసి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. అది చల్లారిన తర్వాత రెండు చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోస భద్రపరచుకోవాలి. రోజూ ఈ నీటిని తీసుకుని అందులో కాటన్ పాడ్ ను ముంచి దానితో ముఖంపై నుండే చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై చేరిన మురికి, మ్రుతకణాలు పోతాయి. సోంపు గింజలు వేసిన వేడి నీటితో ఆవిరి పట్టుకుంటే చర్మం కాంతివంతమవుతుంది. ఇందుకు చేయాల్సిందల్లా వారానికి రెండుసార్లు లీటరు వేణ్ణీళ్లల్లో టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసి తువ్వాలు ముఖంపై కప్పుకుని ఐదు నిమిషాలు ఆవిరి పట్టుకుంటే చాలు. సోంపు ఫేస్ ప్యాక్ తో కూడా చర్మం కాంతివంతమవుతుంది.

అరకప్పు వేడి నీటిలో టేబుల్ స్పూను సోంపు వేయాలి. అరగంట తర్వాత ఆ నీటిని వడబోసి అందులో టేబుల్ స్పూన్ ఓట్ మీల్, టేబుల్ స్పూను తేనె కలిపి మెత్తని పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి.

చర్మంపై మ్రుతకణాలను తొలగించడానికి ఎక్స్ ఫోయిలేషన్ గా కూడా సోంపుగింజలు ఉపయోగపడతాయి. ఒక చెంచా సోంపు గింజల పొడి తీసుకుని అందులో ఒక స్పూను నీరు పోసి పేస్టులా చేసి దాన్ని స్క్రబ్ లా రాసుకుంటే చర్మంపై పేరుకుని ఉన్న మ్రుతకణాలు పోయి చర్మం శుభ్రంగా, కాంతివంతంగా ఉంటుంది.

చర్మాన్ని డిటాక్సిఫై చేసుకోవడానికి ఉదయమే సోంపు టీ తాగితే మంచిది. చర్మం పైన, లోపల కూడా ఈ టీ మలినాలను పోగొట్టి శుభ్రపరుస్తుంది. చర్మానికి హాని చేసే విషపదార్థాలను, ఫ్రీరాడికల్స్ ను సోంపు టీ బయటకు పంపుతుంది. సోంపు గింజల్లోని యాంటిసెల్యూలైట్ గుణాలు చర్మ కణాల్లో చేరిన కొవ్వును తొలగిస్తాయి. వెంట్రుకల కుదుళ్లు ద్రుఢంగా ఉండడానికే కాదు జుట్టు తెల్లబడకుండా కూడా సోంపు గింజలు ఉపయోగపడతాయి.

జట్టు రాలకుండా కాపాడతాయి..

దీనికోసం మూడు టేబుల్ స్పూన్ల సోంపు గింజలు తీసుకుని మెత్తటి పొడిగా చేసుకోవాలి. మూడు కప్పుల వేడి నీళ్లల్లో ఈ సోంపు పొడిని వేసి బాగా కలిపి అరగంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీళ్లను తలపై పోసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోకుండా పటిష్టంగా ఉంటాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే సోంపు గింజలను రోజూ కొద్దిగా తింటుండాలి. లేదా సోంపు టీ తాగినా మంచిదే. ఇలా చేస్తే జుట్టు తెల్లబడకుండా నిగ నిగలాడుతుంటుంది. సోంపు గింజల వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలైతే లెక్కే లేదు. సోంపు రక్తపోటును తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కంటిచూపును సంరక్షిస్తుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్త్రీలకు నెలసరి సమయంలో తలెత్తే నొప్పి లాంటి రకరకాల సమస్యలను కూడా సోంపు తగ్గిస్తుంది. కొత్తగా తల్లులైన వారిలో తల్లిపాలు ఎక్కువ రావడానికి తోడ్పడతాయి. ఇన్ని మంచి గుణాలున్న సోంపును మీ డైట్ లో చేర్చడం మరవొద్దు. వీటితో అందాన్ని, ఆరోగ్యాన్నిమీ సొంతం చేసుకోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News