Saturday, November 15, 2025
Homeహెల్త్Fenugreek : చిన్న గింజ.. చేసే మేలు ఘనం! నానబెట్టిన మెంతులతో ఆరోగ్యానికి అండ!

Fenugreek : చిన్న గింజ.. చేసే మేలు ఘనం! నానబెట్టిన మెంతులతో ఆరోగ్యానికి అండ!

Health benefits of Fenugreek : మన వంటింట్లో పోపుల డబ్బాలో కనిపించే చిన్న పసుపుపచ్చ గింజలు… చూడ్డానికి చిన్నవే అయినా, రుచికి కొంచెం చేదుగా ఉన్నా, అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవే మెంతులు! ప్రాచీన ఆయుర్వేదం నుంచి ఆధునిక పరిశోధనల వరకు మెంతుల మహత్యం గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ చిన్న గింజలో దాగి ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలేంటి? శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

- Advertisement -

మధుమేహానికి కళ్లెం : నానబెట్టిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఫైబర్ ప్రభావం: వీటిలో ఉండే అధిక ఫైబర్, జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతాయి.
ఇన్సులిన్ ఉత్పత్తి: మెంతుల్లో ఉండే ‘హైడ్రాక్సిస్‌ల్యూసిన్ 4’ అనే అమైనో ఆమ్లం, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహించేలా చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

అధ్యయనం ఏం చెబుతోంది?: ప్రీడయాబెటిస్ ఉన్నవారు రోజుకు 10 గ్రాముల మెంతులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (NLM) అధ్యయనం పేర్కొంది.

జీర్ణశక్తికి జీవం : మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలోని పీచు పదార్థం, పొట్టలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తింటే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువుకు బ్రేకులు : బరువు తగ్గాలనుకునేవారికి మెంతులు మంచి మిత్రులు. వీటిలోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల అనవసరమైన తిండి తినాలనే కోరిక తగ్గి, కేలరీలు తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

కండరాలకు బలం, కొలెస్ట్రాల్‌కు చెక్..
కండబలం: మెంతుల్లోని ప్రొటీన్, మెగ్నీషియం కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యాయామం తర్వాత కండరాల నొప్పుల నుంచి త్వరగా కోలుకోవడానికి ఇవి సహకరిస్తాయని NLM అధ్యయనం వెల్లడించింది.
కొలెస్ట్రాల్: మెంతులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయని కూడా NLM అధ్యయనం పేర్కొంది.

బాలింతలకు వరం : పాలిచ్చే తల్లులకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతి టీ తాగడం వల్ల పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని, తద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

వైద్యుల సూచన : మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచివైనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే వీటిని సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. గర్భధారణ సమయంలో సాధారణ ఆహారంలో లభించే దానికంటే ఎక్కువ మొత్తంలో మెంతులు తీసుకోవడం సురక్షితం కాదని NIH (నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్) అధ్యయనం సూచిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad