Food For Better Brain Health: మనం రోజూవారి తినే ఆహారం మన శరీరాన్ని మాత్రమే కాకుండా మన మెదడును కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మనం తినే ఆహారంలో పోషకాలు ఉండకపోవడం వల్ల మెదడు వేగంగా మొద్దుబారుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారంలో మార్పులు చేయాలని, తద్వారా ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చని సలహా ఇస్తున్నారు. మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. విటమిన్ బీ12
మెదడు పనితీరు పెంచేందుకు విటమిన్ బి12 మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇది డీఎన్‌ఏ ఏర్పడటానికి సహాయపడుతుంది. అంతేకాదు, రక్తంలో హానికరమైన పదార్థాలను నియంత్రిస్తుంది. నరాలను రక్షిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కాపాడుతుంది. ఈ విటమిన్‌ను పొందడానికి గుడ్లు, చేపలను తినవచ్చు. మీరు శాఖాహారులైతే.. పాల ఉత్పత్తులు లేదా సప్లిమెంట్లను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2. విటమిన్ డి
విటమిన్ డి మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అలాగే వాపును నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మిలో నిల్చోవడం ద్వారా మీరు విటమిన్ డిని సహజంగా పొందచ్చు. మీ ఆహారంలో పుట్టగొడుగులు, కొవ్వు చేపలు, గుడ్లు, పాలు వంటివి ఉండేలా చూసుకోండి. వీటిలో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
3. విటమిన్ ఈ
విటమిన్ ఈ మెదడుకు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. మీరు విటమిన్ ఈని పొందడానికి పాలకూర, అవకాడో, పొద్దు తిరుగుడు విత్తనాలు, హాజెల్ నట్స్, బాదం పప్పులను మీ ఆహారంలోకి చేర్చుకోండి.
4. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
అనేక అధ్యయనాల ప్రకారం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జ్ఞాపకశక్తిని పెంచి మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతోంది. కాబట్టి మీరు వారానికి 2-3 సార్లు కొవ్వు చేపలను (సాల్మన్, హెర్రింగ్ వంటివి) తినడం ద్వారా మీకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. మీరు శాఖాహారులైతే.. మీ ఆహారంలో వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా గింజలు, ఎండిన పండ్లు ఉండేలా చూసుకోండి.
5. మెగ్నీషియం
మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంత పరిచే ఖనిజంగా పనిచేస్తుంది. ఇది నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఆకుకూరలు, విత్తనాలు, తృణధాన్యాలు, ఎండిన పండ్లు, డార్క్ చాక్లెట్ నుంచి మీరు ఈ మెగ్నిషియాన్ని పెద్ద మొత్తంలో పొందవచ్చు.


