Vitamin-D Foods: శరీరంలో విటమిన్ డి లోపం ఉండటం చాలా ప్రమాదకరం. చాలా మందిలో ఈ విటమిన్ లోపమే కనిపిస్తోంది. ఈ లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల, విటమిన్ డి అవసరాన్ని తీర్చుకోవడం ఎంతో అవసరం. శరీరంలో విటమిన్ డి స్థాయిని పెంచుకోవడం కోసం సూర్యరశ్మి ముఖ్యమైన వనరు అని అందరికి తెలిసిందే! అంతే కాదు, కొన్ని ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చడం ద్వారా కూడా ఈ లోపాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు విటమిన్ డి ఎక్కువగా కలిగిన ఐదు ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకుందాం.
చేపలు
సాల్మన్, ట్యూనా, మాకెరెల్, సార్డిన్స్ వంటి కొవ్వు చేపలు విటమిన్-డి కి గొప్ప మూలం. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్-డి ని అందిస్తాయి. అంతేకాకుండా, ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుడ్డు పచ్చసొన
గుడ్ల పచ్చసొనలో సహజంగా విటమిన్ డి ఉంటుంది. గుడ్డులో సుమారు 40-50 IU విటమిన్ డి ఉంటుంది. దీంతో గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. గుడ్లు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర పోషకాలు కూడా కలిగి ఉంటాయి.
పాలు, పాల ఉత్పత్తులు
విటమిన్ డి సహజంగా ఆవు పాలు మరియు కొన్ని పాల ఉత్పత్తులలో లభిస్తుంది. అదనంగా, కొన్ని పాల ఉత్పత్తులను విటమిన్-డి తో బలపరిచినవిగా (ఫోర్టిఫైడ్) తయారు చేస్తారు. ఉదాహరణకు..ఒక గ్లాసు ఫోర్టిఫైడ్ పాలలో సుమారు 100-120 IU విటమిన్ డి లభిస్తుంది. అలాగే పెరుగు, జున్ను, వెన్న వంటి వాటిలో కూడా ఈ విటమిన్ ఉంటుంది.
Also Read: Reverse Walking: ప్రతిరోజు 15 నిమిషాలు ఇలా నడిచి చూడండి..బోలెడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంత!
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు విటమిన్ డి కలిగిన మొక్కల ఆధారిత ఏకైక ఆహార వనరు. ముఖ్యంగా సూర్యరశ్మిలో పెరిగిన పుట్టగొడుగుల్లో విటమిన్ D2 ఉంటుంది. శాఖాహారులు వీటిని తీసుకోవడం ద్వారా తమ దినసరి విటమిన్ డి అవసరాన్ని కొంతవరకు తీర్చుకోవచ్చు.
ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, పండ్ల రసాలు
ఓట్స్, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, నారింజ రసం వంటి పానీయాలను విటమిన్-డి తో బలపరిచినవి. చేపలు లేదా పాల ఉత్పత్తులు తీసుకోని వారికీ ఇవి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఉదాహరణకు..ఒక కప్పు ఫోర్టిఫైడ్ నారింజ రసంలో సుమారు 100 IU విటమిన్ డి ఉంటుంది.
విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి సరైన ఆహారంతో పాటు సూర్యరశ్మిలో రోజూ కనీసం 15–20 నిమిషాలు గడపడం అవసరం. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సమయంలో సూర్యరశ్మి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డిని ఉత్పత్తి చేయడం సులభం. తీవ్రమైన లోపం ఉంటే తప్పకుండా వైద్యుడి సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ మార్గాలను పాటించడం ద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విటమిన్ డి లోపాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.


