ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో హఠాత్ మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి యువత, రాజకీయనాయకులు, క్రీడాకారులు వంటి శారీరకంగా బలంగా కనిపించే వాళ్లూ అకస్మాత్తుగా గుండె పోటుతో చనిపోతున్నారు. ఎలాంటి గుండె సంబంధిత లక్షణాలు లేకపోయినా హార్ట్ ఎటాక్, కార్డియాక్ ఫెయిల్యూర్‌లతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
చేపలు, గుడ్లు: చేపలు, గుడ్లలో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ధమనులను, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెపోటు రిస్క్ తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. వీటిని మితంగా, మేనేజ్డ్ డైట్‌లో భాగంగా తీసుకోవడం మంచిది.
శాకాహారులకు డ్రైఫ్రూట్స్: మీరు చేపలు, గుడ్లు తినని వారయితే బాదం, అక్రోట్, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవచ్చు. ఇవి కూడా ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలాలు. గుండెకు కావాల్సిన ఆరోగ్యకర కొవ్వులు ఇవి అందిస్తాయి.
పప్పుధాన్యాలు, బీన్స్: రోజుకు ఒక్కసారి అయినా పప్పులు, బీన్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. పైగా ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
సిట్రస్ పండ్లు విటమిన్లు, ఖనిజాలు: నారింజ, ముసంబి, లెమన్ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ధమనులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజూ ఒక సారి ఈ పండ్లను తీసుకోవడం మంచిది.