Immunity Foods In Winter: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తి అనేది వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారకాల నుండి రక్షించే శరీర సహజ కవచం. ఇలా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి మెండుగా ఉంటడం అవసరం. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే కొన్ని ఆహారాలను డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
బెల్లం: ఇందులో ఉండే ఐరన్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి అలసట నుండి ఉపశమనం కలిగిస్తాయి. రోజూ కొద్ది మొత్తంలో బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
నువ్వులు: వీటిలో ఉండే కాల్షియం, జింక్ ఎముకలను బలపరుస్తాయి. అంతేకాదు, ఇవి చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి. నువ్వులతో తయారు చేసిన లడ్డూలు లేదా చిక్కీలు చలికాలంలో తినడానికి ఒక రుచికరమైన మార్గం.
తేనె: తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఉదయం ఒక టీస్పూన్ తేనె, నిమ్మకాయను గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి చురుకుగా ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3లు, ప్రోటీన్‌లను కలిగి ఉంటాయి. వీటిని క్రమంగా తింటే కండరాలను బలోపేతం చేస్తాయి. మెదడును చురుగ్గా ఉంచుతాయి.
క్యారెట్: క్యారెట్లలో బీటా-కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
ఆమ్లా: ఉసిరి విటమిన్ సి గొప్ప మూలం. ఇది రోగనిరోధక శక్తిని గణనీయంగా బలపరుస్తుంది. ప్రతిరోజూ ఆమ్లా రసం లేదా జామ్ తీసుకోవడం వల్ల జలుబు, చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటి సమస్యలను నివారించవచ్చు.
ముల్లంగి: ముల్లంగిలోని ఎంజైమ్‌లు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది చర్మానికి సహజమైన మెరుపును కూడా ఇస్తుంది. చలికాలంలో వీటిని ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది.
ఆకుకూరలు: ఆకుకూరలు చలికాలంలో పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు ఎ, సి, కె ఫైబర్ శరీరం నిర్విషీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


