Monday, November 11, 2024
Homeహెల్త్Foot Swelling: వాచిన పాదాలకు సాంత్వననిచ్చే ఇంటి చిట్కాలు

Foot Swelling: వాచిన పాదాలకు సాంత్వననిచ్చే ఇంటి చిట్కాలు

సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇవి ట్రై చేయండి అయినా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి

పాదాలు బాగా వాచి నొప్పి పెడుతున్నాయా? ఆ వాపు తగ్గి పాదాలు నాజూగ్గా ఎలా కనపడతాయని ఆలోచిస్తున్నారా? దీనికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాచిన పాదాలు బాగానొప్పులు పెడతాయి. బరువుగా అనిపిస్తాయి కూడా. శరీరంలో వాపు ఎక్కడ కనిపించినా దాన్ని ఎడిమా అంటారు. వాచిన ప్రదేశంలో శరీరంలోని ఫ్లూయిడ్స్ వచ్చి చేరతాయి. ఎక్కువ సేపు కూర్చోవడం, బాగా పనిచేయడం, పాదాలు బాగా అలసిపోవడం, హైహీల్స్ వేసుకోవడం వల్ల పాదాలు వాస్తాయి. కొన్నిసార్లు శరీరంలోని మెడికల్ కండిషన్ వల్ల కూడా పాదాలు వాస్తాయి. సాధారణంగా వాచిన పాదాలను ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ అనేది కండరాల నొప్పులు, వాపు నొప్పుల నుంచి ఉపశమనం కోసం వాడుతుంటారు. వాపు ఎంత తీవ్రంగా ఉందన్నదాన్ని బట్టి ఎప్సమ్ ఉప్పును వాడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు సాధారణంగా అరకప్పు ఎప్సమ్ ఉప్పు (లేదా సాధారణ ఉప్పును కూడా ఉపయోగించవచ్చు), ఒక టబ్, గోరువెచ్చటి నీళ్లు రెడీగా పెట్టుకోవాలి. టబ్ ను సగం మేర గోరువెచ్చటి నీటితో నింపాలి. అందులో ఎప్సమ్ సాల్ట్ వేసి కరికే వరకూ బాగా కలపాలి. ఆ సొల్యూషన్ లో పాదాలను పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ఎప్పుడు వాపు వస్తే అప్పుడు ఈ చిట్కాను ఉపయోగించవచ్చు. రాత్రి నిద్రపోయేముందు ఈ చిట్కాను అనుసరిస్తే మంచిది. అలసిన పాదాలకు, వాచిన పాదాలకు ఇది మంచి చిట్కా.

- Advertisement -

పాదాల వాపును తగ్గించే మరో చిట్కా ఉంది. దీనికి టోనిక్ వాటర్, ఒక టబ్ రెడీగా పెట్టుకోవాలి. టబ్ నిండా టోనిక్ వాటర్ ను నింపి మీ పాదాలను ఆ నీళ్లల్లో ఉంచాలి. టోనిక్ వాటర్ చల్లగా లేదా రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. వాచిన పాదాలను ఆ నీళ్లల్లో 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత రెగ్యులర్ వాటర్ తో పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్లు వాచినపుడు మాత్రమే ఈ వాటర్ ను వాడాలి. టోనిక్ వాటర్ కార్బొనేటెడ్ వాటర్.  దీంటో కొద్దిగా క్వినైన్ కూడా కలుపుతారు. ఇది పాదాల వాపును బాగా తగ్గిస్తుంది. వేడి, చల్లటి నీళ్లు రెండూ కలిపి పాదాల వాపు తగ్గడానికి ఉపయోగించే మరో ఇంటి చిట్కా కూడా ఉంది. దీనికి వేడినీళ్లు, చల్లటి నీళ్లతో పాటు రెండు బకెట్లు కావాలి. ఒక బకెట్లో సగానికి వేడి నీళ్లు పోయాలి. ఇంకో బకెట్లో సగానికి చల్లటి నీళ్లు పోయాలి. మొదట వేడి నీళ్లు ఉన్న బకెట్ లో మీ పాదాలను పది నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లటి నీళ్లున్న బకెట్లో పది లేదా పన్నెండు నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. చివరిగా మరోసారి వేడి నీళ్లల్లో పాదాలను ఉంచాలి. ఈసారి పాదాలను వేడి నీళ్లల్లో ఐదు నిమిషాలు ఉంచితే చాలు. వాపు నుంచి ఈ చిట్కా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. పాదాల వాపును తగ్గించే సహజ విధానం కూడా ఇది.   బేకింగ్ సోడాతో కూడా పాదాల వాపును తగ్గించుకోవచ్చు.  రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, రెండు టీస్పూన్ల బియ్యం నీళ్లు రెడీగా పెట్టుకోవాలి. నీళ్లల్లో బియ్యాన్ని పోసి ఉడికిస్తే గంజిలా వస్తుంది. ఆ గంజిలో బేకింగ్ సోడాను వేసి కలపి కాస్త పలచటి పేస్టులా చేయాలి. దాన్ని పాదాలకు అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పాదాలను సాధారణ నీళ్లతో కడిగేసుకోవాలి. ఆ తర్వాత వాటికి మాయిశ్చరైజర్ రాయాలి. అప్పుడు  పాదాలు మృదువుగా తయారవుతాయి. పాదాల వాపు వేగంగా తగ్గించడంలో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పాదాల వాపును తగ్గిస్తాయి. దీంతో పాదాల్లో రక్తప్రసరణ బాగా అవుతుంది కూడా.  ఎసెన్షియల్ ఆయిల్స్ లో పాదాలను ఉంచడం వల్ల కూడా పాదాల వాపు తగ్గుతుంది. దీనికోసం మూడు లేదా నాలుగు చుక్కల యూకలిప్టస్ ఆయిల్, మూడు లేదా నాలుగు చుక్కల పిప్పర్మెంట్ ఆయిల్, మూడు లేదా నాలుగు చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, మూడు లేదా నాలుగు చుక్కల లవెండర్ ఎసెన్షిల్ ఆయిల్, అర బకెట్ గోరువెచ్చటి నీళ్లను రెడీగా ఫెట్టుకోవాలి. ఈ వేడి నీళ్లల్లో పైన పేర్కొన్న ఎసెన్షియల్  ఆయిల్స్ అన్నింటినీ వేసి బాగా కలపాలి. ఇందులో అరకప్పు నుంచి రెండు కప్పుల వరకూ ఎప్సమ్ ఉప్పును కూడా చేర్చాలి. ఇలా చేయడం వల్ల యాంటి ఇణ్ఫ్లమేటరీ ఎఫెక్టు పాదాలపై బాగా ఉంటుంది. ఈ మిశ్రమంలో వాచిన పాదాలను పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పాదాలను సాధారణ నీళ్లతో కడిగి పొడిగా తుడుచుకోవాలి. ఈ చిట్కాను వాపు తగ్గేంతవరకూ నిత్యం చేయొచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ పాదాల వాపును పోగొట్టడమే కాకుండా నేచురల్ రిలాక్స్ టెంట్ గా ఇవి ఉపయోగపడతాయి. మంచి సువాసనలు కూడా చిందిస్తాయి.   నిమ్మ సొల్యూషన్ కూడా పాదాల వాపును తగ్గిస్తుంది. దీనికి ఒక టీస్పూను నిమ్మ రసం, అర టీస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీస్పూన్ పాలు రెడీగా పెట్టుకోవాలి. అన్ని పదార్థాలను కలిపి పేస్ట్ లా చేయాలి. వాచిన పాదాలకు దీన్ని పూసి రెండు గంటల పాటు అలాగే వదిలేయాలి. ఈ చిట్కాను రాత్రి పూట పాటిస్తే మంచిది. నిమ్మకాయలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

Massage of woman’s foot in spa salon – Beauty treatment concept

వాపును తగ్గించడంలో దాల్చిన చెక్క, ఆలివ్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తాయి. అంతేకాదు ఆలివ్ ఆయిల్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కూడా. యాపిల్ సిడార్ వెనిగర్ కూడా పాదాల వాపును తగ్గిస్తుంది.  ఒక కప్పు యాపిల్ సిడార్ వెనిగర్, రెండు లేదా మూడు కప్పుల గోరువెచ్చటి నీళ్లు, ఒక టవల్ రెడీగా పెట్టుకోవాలి. అరకప్పు యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరువెచ్చటి నీళ్లల్లో కలపాలి. మిగతా సగం యాపిల్ సిడార్ వెనిగర్ ను చల్లటి నీళ్లల్లో కలపాలి. మొదట వేడి నీళ్లల్లో తువ్వాలును తడిపి గట్టిగా పిండి ఆ గుడ్డతో వాచిన పాదాల చుట్టూ వేసి ఆ గుడ్డ రూమ్ టెంపరేచర్ కు వచ్చేవరకూ అలాగే ఉంచాలి.

అలాగే చల్లటి నీళ్లతో కూడా చేయాలి. చల్లటి నీళ్లల్లో వెనిగర్ వేసి కలపడం మరవొద్దు. ఆ గుడ్డను వాచిన పాదాలపై ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. వాపు కనుక తగ్గకపోతే రెండు గంటల తర్వాత ఇదే ప్రొసీజర్ ను తిరిగి చేయాల్సి ఉంటుంది. యాపిల్ సిడార్ పాదాలకు వెంటనే సాంత్వననిస్తుంది. వెనిగర్ వాచిన భాగంలో చేరిన  ఫ్లూయిడ్స్ ను పోగొడుతుంది. వాచిన ప్రదేశంలో చేరిన ప్లూయిడ్ ఒకసారి పోతే పాదాలు సాధారణ స్థితిని పొందుతాయి.

బార్లీ వాటర్ కూడా పాదాల వాపును తగ్గిస్తుంది. బార్లీని నీళ్లల్లో వేసి లైట్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకూ ఆ నీళ్లను ఉడికించాలి. తర్వాత దాన్ని వడగట్టి చల్లారనివ్వాలి. ఆ నీళ్లను రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులను తాగితే మంచి ఫలితం ఉంటుంది.   బార్లీ నీళ్లు శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపేస్తాయి. పాదాల వాపును పోగొడతాయి.  ధనియాలు కూడా పాదాల వాపును పోగొడతాయి. ఇందుకు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక కప్పు నీళ్లు రెడీగా పెట్టుకోవాలి. నీళ్లల్లో ధనియాలను ఉడికించి ఆ నీళ్లు సగానికి వచ్చేవరకూ మరిగించాలి. తర్వాత ఆ నీళ్లను వడగొట్టి తాగాలి. ఈ నీళ్లను రోజుకు రెండుసార్లు తాగొచ్చు. ధనియాలను గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిసేపు నానబెట్టి తర్వాత దాన్ని మెత్తటి పేస్టులా చేసి పాదాలకు పూయొచ్చు. పాదాల వాపు వెంటనే తగ్గుతుంది. వాచిన పాదాలలో చేరిన ఫ్లూయిడ్స్ ను ఇది పోగొడుతుంది. అల్లం ఎసెన్షియల్ ఆయిల్ కూడా పాదాల వాపును తగ్గిస్తుంది. దీనికి కొన్ని చుక్కల జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ కావాలి.  అలాగే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కేరియర్ ఆయిల్ (ఆలివ్ ఆయిల్ లేదా జొజొబా ఆయిల్ లేదా కొబ్బరినూనె) రెడీగా పెట్టుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్ ను కేరియర్ ఆయిల్ తో బాగా కలిపి ఆ మిశ్రమంతో వాచిన పాదాలను సున్నితంగా ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేయాలి. రాత్రంతా పాదాలను అలాగే వదిలేయాలి. నిద్రపోయేముందు ఈ చిట్కా చేస్తే మంచి ఫలితం చూస్తారు. అల్లంలో సహజసిద్ధమైన యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది రక్త పరసరణను పెంచుతుంది. వాచిన పాదాల నొప్పులను కూడా ఇట్టే తీసేస్తుంది. గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ కూడా పాదాల వాపును తగ్గిస్తుంది. నాలుగైదు చుక్కల గ్రేప్ ఫ్రూట్ ఆయిల్, ఒకటి లేదా రెండుస్పూన్ల ఆలివ్ ఆయిల్ రెడీ పెట్టుకోవాలి. రెండింటిని బాగా కలిపి దానితో వాచిన పాదాలను మసాజ్ చేసి రాత్రంతా అలాగే వాటిని వదిలేయాలి. వాపు తగ్గేవరకూ ప్రతిరోజు రాత్రి ఇలా చేయాలి. 

ఐస్ ప్యాక్ కూడా పాదాల వాపును నివారిస్తుంది. వాచిన ప్రదేశంలో పది లేదా పన్నెండు నిమిషాల పాటు ఐస్ ప్యాక్ ఉంచాలి. ఐస్ ప్యాక్ ఇంట్లో లేకపోతే ఐస్ క్యూబ్స్ ను ఒక తడి టవల్ లో వేసి చుట్టి దానితో పాదం వాచిన చోట చుట్టి కాసేపు అలాగే వదిలేయాలి. కొన్ని గంటలకు కూడా వాపు తగ్గకపోతే ఐస్ ప్యాక్ ను పాదాలకు మళ్లా పెట్టాలి. వాచిన చోట నొప్పులను ఐస్ ప్యాక్ నివారిస్తుంది. 

Varicose veins and bandage. Isolated on white background

కీరకాయ కూడా పాదాల వాపును మటుమాయం చేస్తుంది.  ఇందుకు ఒక కీరకాయ, ఒక బ్యాండేజ్ ను రెడీగా పెట్టుకోవాలి. పలచటి ముక్కలుగా కీరకాయను కట్ చేయాలి. వాచిన పాదంపై ఆ ముక్కలను పెట్టి దానిపై వదులుగా బ్యాండేజిని వేయాలి. దాన్ని 20 నిమిషాల నుంచి అరగంట పాటు అలాగే ఉంచి ఆతర్వాత చూస్తే ఫలితం కనిపిస్తుంది. పాదాలు వాచినపుడల్లా ఇలా చేయొచ్చు. కీరకాయలో సాంత్వన నిచ్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పాదాల వాపును తగ్గిస్తుంది. క్యాబేజీ ఆకులు కూడా పాదాల వాపును నివారిస్తాయి. దీనికి వైట్ లేదా గ్రీన్ క్యాబేజీ ఆకులు, బ్యాండేజి రెడీగా పెట్టుకవాలి.  క్యాబేజీ ఆకులను శుభ్రంగా కడగాలి. వీటిని కాసేపు ఫ్రిజ్ లో కూడా ఉంచొచ్చు. తర్వాత వాటిని తీసుకుని వాచిన పాదాలపై ఉంచి వదులుగా బ్యాండేజి వేయాలి. దాన్ని అరగంట సేపు పాదాలకు అలాగే ఉంచాలి. వాపు తగ్గకపోతే మళ్లా మూడు లేదా నాలుగు గంటల తర్వాత ఇదే ప్రొసీజర్ ను అనుసరించాలి.  క్యాబేజి ఆకులకు నీటిని పీల్చే గుణం ఎక్కువ. పాదాల్లో చేరిన ఫ్లూయిడ్స్ ను ఈ ఆకులు పీలుస్తాయి. అంతేకాదు క్యాబేజీ ఆకుల్లో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు సాంత్వన నిచ్చే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News