Saturday, July 6, 2024
Homeహెల్త్Frizzy hair solutions: చింపిరి జుట్టుకు అరటిపండు !

Frizzy hair solutions: చింపిరి జుట్టుకు అరటిపండు !

పీచులాంటి జుట్టును పట్టులా …
మీ వెంట్రుకలు నల్లగా నిగ నిగలాడడం లేదా? సిల్కీ హెయిర్ లోపించిందా? వెంట్రుకలు మ్రుదువుగా లేకుండా పీచులా ఉండి చూడడానికి అసహ్యంగా ఉన్నాయా? నిజమే.. చింపిరిగా ఉండే వెంట్రుకలను మెయిన్ టైన్ చేయడం కష్టమైన పనే. హెయిర్ కేర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వెంట్రుకలు నిలకడగా లేకుండా రేగినట్టు, పీచులా కనిపిస్తాయి. శిరోజాలు పొడిబారడం, దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

- Advertisement -


శరీరంలో తగినంత తేమ లోపించడం కూడా ఇందుకు ఒక కారణం. అలాగే వాతావరణంలో ఉంటున్న అధికతేమ వల్ల కూడా వెంట్రుకలు దెబ్బతింటాయి. ఫలితంగా జుట్టు పొడిబారుతుంది. పీచులా తయారవుతుంది. దీర్ఘకాలంపాటు డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటే కూడా వెంట్రుకలు దెబ్బతింటాయి. జుట్టు జీవం లేకుండా పీచులా కనిపిస్తుంది. రేగినట్టు ఉండే వెంట్రుకలకు తేమ, మెరుపు చాలా అవసరం. ఆరోగ్యమైన శిరోజాలు కావాలంటే సరైన డైట్ తీసుకోవడంతోపాటు నీటిని బాగా తాగాలి. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సహజమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.

బాదంనూనె, గుడ్డు మిశ్రమం రేగినట్టుండే జుట్టును పట్టులా చేస్తుంది. ఇందుకోసం పావు కప్పు బాదం నూనె, ఒక గుడ్డు తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి మెత్తగా పేస్టులా చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు పాయలకంతా అప్లై చేయాలి. ఆ తర్వాత నలభై నిమిషాలు దాన్ని అలాగే ఉంచుకుని ఆ తర్వాత తలకు స్నానం చేయాలి. సల్ఫేట్స్ లేని షాంపు, కండిషనర్లను శిరోజాలకు వాడితే మంచిది. ఈ మాస్కును వారానికి ఒకసారి తలకు పెట్టుకోవాలి. దెబ్బతిన్న జుట్టును గుడ్డులోని పోషకాలు పునరుద్ధరిస్తాయి. ముఖ్యంగా చింపిరిగా ఉన్న జుట్టుకు ఈ మాస్కు ఎంతో బాగా పనిచేస్తుంది.
అవకెడో, పెరుగు రెండూ కలిపిన మాస్కు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. బాగా పండిన అవకెడొ, ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. అవకెడో పైన ఉండే తొక్కను తీసేసి దాన్ని, పెరుగును కలిపి బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. దాన్ని జుట్టకు అప్లై చేసుకుని నలభై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. షాంపుతో తలరుద్దుకుని ఆ తర్వాత జుట్టుకు కండిషనర్ని పెట్టుకోవాలి. ఈ మాస్కును రేగినట్టుండే జుట్టుకు వారానికి రెండుసార్లు పెట్టుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అవకెడో మాస్కు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కారణం ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ లు ఉన్నాయి. ఇవి వెంట్రుకలను ఆరోగ్యంగా చేయడమే కాకుండా దెబ్బతిన్న జుట్టును బాగుచేస్తాయి. పెరుగు మీ వెంట్రుకలకు డీప్ కండిషనర్ గా పనిచేస్తుంది.

పీచులాంటి జుట్టును కొబ్బరినూనె, విటమిన్ ఇ ల మిశ్రమం మ్రదువుగా, సిల్కీగా చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఒక పాలు విటమిన్ ఇ ఆయిల్, నాలుగు పాళ్లు ఆర్గానిక్ కోల్డ్-ప్రెస్డ్ కొబ్బరి నూనె కావాలి. ఈ రెండు నూనెలను కలిపి మిశ్రమంలా చేసి గాలి చొరబడని బాటిల్ లో పోసి భద్రం చేసుకొని కావలసినపుడల్లా ఉపయోగించుకోవచ్చు. జుట్టు పొడవును బట్టి ఈ మిశ్రమన్ని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు తీసుకుని వెంట్రుకలకు పట్టించాలి. మాడుకు, జుట్టు పాయలకు ఈ మిశ్రమాన్నిబాగా పట్టించాలి. నలభైనిమిషాలు అలాగే ఉంచుకుని ఆతర్వాత తలస్నానం చేయాలి. ఈ మాస్కును వారానికి ఒకసారి లేదా రెండుసార్లు వాడొచ్చు. ఇందులోని విటమిన్ ఇ ఫ్రీరాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. జుట్టు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. కొబ్బిరినూనెలోని చర్మం లోతుకంటా వెళ్లే స్వభావం జుట్టుకు కావలసిన డీప్ కండిషనింగ్ ను అందిస్తుంది.

అరటిపండు కూడా పీచులాంటి మీ జుట్టును అందంగా మలుస్తుంది. ఈ మాస్కు తయారు చేయడానికి బాగా పండిన ఒక అరటిపండు కావాలి. అలాగే రెండు టీస్పూన్ల తేనె, కప్పులో మూడవ వంతు కొబ్బిరినూనె లేదా బాదం ఆయిల్ రెడీ పెట్టుకోవాలి. అరటిపండును మెత్తటి గుజ్జులా చేసి దాంట్లో తేనె, కొబ్బరి లేదా బాదం నూనె వేసి కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, వెంట్రుకలకు బాగా పట్టించి 25 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత షాంపు, కండిషనర్లను తలకు పెట్టుకుని శుభ్రంగా తలను రుద్దుకోవాలి. బాగా పీచులా ఉన్న జుట్టుకు వారానికి ఒకసారి దీన్ని పట్టిస్తే చాలు. అరటిపళ్లు వెంట్రుకలకు మంచి కండిషనర్ లా ఉపయోగపడుతుంది. అందులోనూ అరటిపండు గుజ్జును తేనెతో కలిపి తలకు రాసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. తేనె, నిమ్మరసం మాస్కుకూడా ఈ తరహా అయిన శిరోజాలను మ్రుదువుగా చేస్తాయి. దీని తయారీకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక కప్పు నీళ్లు కావాలి. ఈ పదార్థాలన్నింటినీ కలిపి తలస్నానం చేసిన జుట్టుపై పోయాలి. ఆతర్వాత రెండు నిమిషాల పాటు మాడును మసాజ్ చేయాలి. అనంతరం మరో పదినిమిషాలు అలాగే ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి షాంపుతో తలను రుద్దుకోవాలి. రెండు వారాలకొకసారి ఈ మాస్కును తలకు పట్టించుకోవచ్చు. జుట్టులో చేరిన మురికి, జిడ్డులను ఈ మాస్కు పోగొడుతుంది. దాంతో జుట్టు కుదుళ్లు ఎంతో ఆరోగ్యంగా తయారవుతాయి. రేగినట్టు ఉన్న వెంట్రుకల సమస్య పోయి పట్టులాంటి జుట్టుతో మీరు అందంగా కనిపిస్తారు. విటమిన్ సి కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.

తేనె కూడా పీచులా తయారయిన వెంట్రుకలను సిల్కీగా చేస్తుంది. టేబుల్ స్పూన్ తేనె , రెండు కప్పుల గోరువెచ్చని నీళ్లు రెడిగా పెట్టుకోవాలి. తేనెలో కాస్త నీళ్లు కలిపి పలచగా చేసి వెంట్రుకల అంతటా పోయాలి. ఈ మిశ్రమం వెంట్రుకల్లో ఇంకిన తర్వాత అరగంట సేపు అలాగే కూర్చోవాలి. తర్వాత షాంపు, కండిషనింగ్ లు పెట్టుకుని శుభ్రంగా తలస్నానం చేయాలి. తేనె మంచి కండిషనర్. అంతేకాదు జుట్టు తేలిగ్గా, మెరిసేలా చేస్తుంది. దీన్ని వారానికి రెండుసార్లు వెంట్రుకలకు అప్లై చేసుకోవచ్చు. ఇది మీ జుట్టును ద్రుఢంగా, మ్రదువుగా, బాగా మెరిసేలా చేస్తుంది. తేనె, పెరుగు రెండింటి మిశ్రమం కూడా పీచులా ఉన్న మీ జుట్టును పట్టులా చేస్తుంది. దీని తయారీకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె రెడీగా పెట్టుకోవాలి. పెరుగు, తేనెలను ఒక గిన్నెలో పోసి మెత్తని పేస్టులా చేయాలి. దాన్ని మీ మాడుమీద, జుట్టుకు బాగా పట్టించి అరగంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఈ మాస్క్ ని వారానికి ఒకసారి అప్లై చేస్తే చాలు మీ జుట్టుకు తగినంత మాయిశ్చరైజర్ అందడంతో పాటు జుట్టు సంరక్షణ కూడా బాగా ఉంటుంది. పెరుగు శక్తివంతమైన కండిషనర్. తేనె వెంట్రుకల్లో మాయిశ్చరైజింగ్ గుణాలను పెంపొందిస్తుంది. జుట్టును నల్లగా నిగ నిగలాడేలా, సిల్కీగా చేస్తుంది.

యాపిల్ సిడార్ వెనిగర్ కూడా చిక్కుగా ఉండి, రేగినట్టు ఉన్న జుట్టుపై ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ మాస్కు తయారీకి రెండు టేబల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్, రెండు కప్పుల నీరు రెడీగా పెట్టుకోవాలి. చల్లని నీళ్లల్లో యాపిల్ సిడార్ వెనిగర్ ను కలిపి ఒక జగ్గులో పోసి పక్కన పెట్టండి. మీ వెంట్రుకలను షాంపుతో శుభ్రం చేసుకుని పలచగా చేసిన యాపిల్ సిడార్ వెనిగర్ తో జుట్టును కడుక్కోవాలి. తర్వాత కొన్ని నిమిషాలు అలాగే ఉండి ఆ తర్వాత వెంట్రుకలకు కండిషనర్ పెట్టుకోవాలి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు వారానికి ఒకసారి దీన్ని వెంట్రుకలకు పెట్టుకోవచ్చు. మీ జుట్టులోని పిహెచ్ ప్రమాణాలను యాపిల్ సిడార్ వెనిగర్ సమతుల్యం చేస్తుంది. వెంట్రుకలకు తేమను అందిస్తుంది. అంతేకాదు వెంట్రుకల్లో చేరిన మురికి, జిడ్డు వంటి వాటిని పోగొట్టి వెంట్రుకలను నల్లగా నిగనిగలాడుతూ కనిపించేలా చేస్తుంది. పీచులా ఉన్న మీ జుట్టును మ్రదువుగా చేసే మరో చిట్కా ఉంది. ఈ సమస్యను అలొవిరా జెల్, కారియర్ ఆయిల్ (మీరు నిత్యం వెంట్రుకలకు పెట్టుకునే నూనె) రెండింటి మిశ్రమం చక్కగా పరిష్కరిస్తుంది.

దీని తయారీకి పావుకప్పు అలొవిరా జెల్, పావుకప్పు మీరు వాడే కారియర్ ఆయిల్ రెండింటినీ బాగా కలిపి దాన్ని మాడుకు, వెంట్రుకల పాయాలకు బాగా పూసి అరగంట వరకూ అలాగే వదిలేయాలి. ఆ తర్వాత షాంపు, కండిషనర్లతో తలను బాగా రుద్దుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ మాస్కును వెంట్రుకలకు పెట్టుకుంటే మంచి ఫలితాలను చూస్తారు. అలొవిరాలో మాయిశ్చరైజింగ్ గుణం బాగా ఉంది. కారియర్ ఆయిల్ తో కలిపి దీన్ని రాసుకోవడం వల్ల మాయిశ్చర్ నష్టం పోకుండా చూస్తుంది. అంతేకాదు మీ జుట్టును మ్రదువుగా, మెత్తగా, మెరిసేలా చేస్తుంది. ఇంకొక చిట్కా ఏమిటంటే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరిపాలు ( మీ జుట్టు పొడుగు బట్టి) తీసకోవాలి. ఈ పాలను ఒక గిన్నెలో పోసి గోరువెచ్చగా చేసి దాన్ని జుట్టుకు అప్లై చేసుకుని అరగంటపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపు, కండిషనర్లతో తలస్నానం చేయాలి. ఈ మాస్కును వారానికి రెండుసార్లు వెంట్రుకలపై అప్లై చేస్తే మీ జుట్టులో పీచుదనం పోయి పట్టులాంటి మెరుపును సంతరించుకుంటాయి. కొబ్బరినూనె జుట్టు దెబ్బతినకుండా సంరక్షిస్తుంది. ఈ నూనెలో తేలికపాటి ప్రొటీన్లు ఉండి అవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. అంతేకాదు జుట్టను పెరిగేలా చేయడమే కాదు జుట్టకు కావలసిన మాయిశ్చరైజ్ కూడా ఇది అందిస్తుంది. జుట్టును మెరిసేలా చేసే ఈ మాస్కు రేగినట్టున్న జుట్టును మ్రుదువుగా చేస్తుంది.

నిమ్మరసం, గుడ్డు మిశ్రమం కూడా రేగినట్టుండే మీ జుట్టును బాగా చేస్తుంది. ఇందుకోసం ఒక గుడ్డు, అరనిమ్మ చెక్క రసం రెడీ పెట్టుకోవాలి. గుడ్డును పగలగొట్టి దానినుంచి పచ్చసొన వేరుచేయాలి. తెల్లసొన మాత్రమే తీసుకుని అందులో నిమ్మ రసం కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లనుంచి జుట్టుకు పట్టించి 45 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. తర్వాత జుట్టును షాంపుతో రుద్దుకుని కండిషనర్ ని అప్లై చేయాలి. ఈ మాస్కును వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలు. నిమ్మరసం వెంట్రుకల్లో మలినాలు, మిగులు పదార్థాలను పూర్తిగా పోగొట్టి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును మెరిసేట్టుచేస్తుంది. హాట్ ఆయిల్ మసాజ్ కూడా పీచులా ఉన్న జుట్టును పట్టులా చేయడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందుకు రకరకాల ఆయిల్స్ ను వాడొచ్చు. మీ జుట్టు స్వభావానికి తగిన ఆయిల్ ని ఎంచుకుని హాట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. ఆర్గాన్ ఆయిల్, కొబ్బరినూనె, బాదం నూనె, జొజొబా నూనె, ఆలివ్ ఆయిల్ వంటి వాటితో హాట్ ఆయిల్ మసాజ్ శిరోజాలకు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News