Sunday, September 8, 2024
Homeహెల్త్Fungas in nails: గోళ్లల్లో ఫంగసా? ఇలా చేయండి మరి

Fungas in nails: గోళ్లల్లో ఫంగసా? ఇలా చేయండి మరి

నెయిల్ ఫంగస్ గురించి చాలామందికి తెలుసు. కానీ దాన్ని ఎవరూ పెద్ద సీరియస్ సమస్యగా పట్టించుకోవడం లేదు. ఇది ఉన్న వారు ఆదిలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అయితే చికిత్సతో పాటు కొన్ని సహజమైన పద్ధతుల ద్వారా కూడా ఈ ఫంగస్ ను నివారించొచ్చు. ఈ నెయిల్ ఫంగస్ ను వైద్యపరిభాషలో ఒనిఖోమికోసిస్ అంటారు. ఇది కాలి గోళ్లు, చేతిగోళ్లలో తలెత్తుతుంది.

- Advertisement -

ఇది తలెత్తకుండా ఫుట్ కేర్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చేతి వేళ్ల గోళ్ల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గోళ్లలోపల ఫంగస్ పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ ఫంగస్ కారణంగా గోళ్లు రంగును కోల్పోతాయి. దళసరిగా తయారవుతాయి. పగులుతాయి. పది శాతం మంది జనాభాలో ఈ సమస్య చూస్తున్నాం. దీనికి నిర్దిష్టమైన కారణమేదీ ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ పలు సమస్యల వల్ల ఇది తలెత్తుతుందని వైద్యులు చెప్తున్నారు.

ఇందుకు తేమ వాతావరణం ఒక కారణమైతే, ఫంగస్ సోకిన వారి నుంచి లేదా ఫంగస్ కారకాల నుంచి కూడా ఈ సమస్య తలెత్తే అవకాశముందంటున్నారు. ఈ ఫంగస్ వల్ల గోళ్లు రంగును కోల్పోతాయి. గోళ్ల రంగు ఆకుపచ్చగా, నల్లగా, లేదా పసుపుపచ్చగా అవుతాయి. గోరు చుట్టూతా ఉండే చర్మం ఎర్రగా, దెబ్బతిని మెత్తగా కూడా అవుతుంది. గోళ్లకు ఫంగస్ సోకితే వైద్యునికి వెంటనే చూపించుకోవాలి. ఫంగస్ రావడానికి కారణం నిర్ధారించి తగిన మెడికేషన్ లేదా చికిత్సను వైద్యులు సూచిస్తారు. వైద్యంతో పాటు నెయిల్ ఫంగస్ నుంచి సాంత్వన పొందడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి. గోళ్లను ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి లోపలికి వెళ్లేలాంటి షూస్, సాక్సు వేసుకోవాలని చెప్తున్నారు. పాదాలకు బిగుతుగా ఉండే పాదరక్షలు వేసుకోవద్దని సలహా ఇస్తున్నారు. వైట్ వెనిగర్, నీళ్లు రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని ఆ మిశ్రమంలో గోళ్లను కాసేపు నాననిస్తే నెయిల్ ఫంగస్ లక్షణాలు తగ్గుతాయంటున్నారు.

బొటనవేలి గోళ్లకు నెయిల్ ఫంగస్ సోకితే యాపిల్ సిడార్ వెనిగర్ బాగా శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. యాపిల్ సిడార్ వెనిగర్, గోరువెచ్చని నీళ్లు సమపాళ్లల్లో తీసుకుని ఆ మిశ్రమంలో పాదాలను ఉంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఇలా చేయడం వల్ల గోళ్లు మ్రుదువుగా తయారవడమే కాకుండా గోళ్లలో ఉండే ఫంగస్ తగ్గుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ ను నీటితో కలిపి ఆ సొల్యూషన్ ని ఫంగస్ ఉన్నచోట రాయొచ్చు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్టులు చూపదు.

కానీ సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు ఆ సొల్యూషన్ ని చర్మంపై కొద్దిగా రాసి స్కిన్ టెస్టు చేసుకున్న తర్వాత ఫంగస్ ఉన్నచోట నేరుగా అప్లై చేసుకుంటే మంచిది. పాదాల బొటన వేలిగోళ్లపై వచ్చిన నెయిల్ ఫంగస్ ను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ కూడా శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు. ఇందులో నేచురల్ యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి. అంతేకాదు ఇది యాంటిఫంగల్ ఏజెంటు కూడా. దీన్ని నెయిల్ ఫంగస్ వచ్చిన ప్రదేశంలో నేరుగా రాయొచ్చంటున్నారు.

స్నానం చేసిన తర్వాత లేదా ఫంగస్ సోకిన వేలి గోళ్లను శుభ్రం చేసిన తర్వాత దీన్ని రాసుకోవాలని చెప్తున్నారు. ఫంగస్ పూర్తిగా తగ్గేదాకా ఫంగస్ సోకిన ప్రదేశంలో దీన్ని రాయాలి. అలాగే పోషకాహారం, సరిపడినంత నిద్ర, వ్యాయామాలు చేయడం వంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. గోళ్ల ఆరోగ్యం శరీర ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెప్తున్నారు. వెల్లుల్లిలో యాంటిఫంగల్ సుగుణాలు బాగా ఉన్నాయి.

ఇది కూడా నెయిల్ ఫంగస్, ఇతర ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది. అంతేకాదు రకరకాల ఫంగస్ ల నివారణకు వెల్లుల్లిని ఉపయోగించడం ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. దీన్ని డైట్ లో భాగంగా గాని, సప్లిమెంటుగా గాని తీసుకోవచ్చు. లేదా వెల్లుల్లిని కట్ చేసి దాన్ని నేరుగా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్న చోట అప్లై చేయొచ్చు. ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గుతుందంటున్నారు.

వెల్లుల్లిలో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి పడని వారు దానికి దూరంగా ఉండమని కూడా సూచిస్తున్నారు. నిమ్మరసం కూడా బొటనవేలి గోళ్లకు సోకిన ఫంగస్ ను తగ్గిస్తుంది. యాపిల్ సిడార్ వెనిగర్, టీట్రీ ఆయిల్స్ లాగే నిమ్మరసంలో కూడా యాంటిఫంగల్ సుగుణాలు ఉన్నాయి. ఇది బోటనవేలి గోళ్లకు సోకిన ఫంగస్ ను తగ్గిస్తుంది. ఒక వంతు నిమ్మరసం, రెండు వంతుల గోరువెచ్చటి నీళ్లు రెండూ కలిపి అందులో పాదాలను పదిహేను నిమిషాల సేపు ఉంచాలి. ఇలా ప్రతి రోజూ కొన్ని వారాలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. నిమ్మకాయలోని ఎసిడిటీ ఫంగస్ ను చంపేస్తుంది.

ఫంగస్ మరింత పెరగకుండా నిరోధిస్తుంది. దాంతోపాటు నిమ్మరసంలోని విటమిన్ సి గోళ్లను ద్రుఢంగా ఉండేలా చేస్తుంది. బలిష్టమైన గోళ్ల వల్ల భవిష్యత్తులో ఫంగస్ ఇన్ఫెక్షన్ల బారిన పడము. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి కూడా ఫంగస్ ఉన్నప్రాంతంలో రాసుకోవచ్చు. కొబ్బరినూనెలో కూడా యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఒక పాలు నిమ్మరసం రెండు పాళ్లు కొబ్బరినూనె రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని పంగస్ సోకిన బొటనవేలిగోళ్లకు రోజుకు రెండుసార్లు రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని కడిగేయాలి.

నిమ్మరసం అందుబాటులో లేకపోతే నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోసి వాటిని ఫంగస్ సోకిన వేలిగోళ్లపై పెట్టాలి. అలా వాటిని పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు కొన్ని వారాలపాటు మానకుండా చేయాలి. నిమ్మకాయలోని ఎసిడిటీ ఫంగస్ ను చంపేస్తుంది. విటమిన్ సి వల్ల గోళ్లు పటిష్టంగా ఉంటాయి. అయితే ఈ ఫంగస్ మెల్లగా తగ్గుతుంది. దీనితో ఎంతో ఓర్పుగా వ్యవహరించాలని మరవొద్దు. బొటనవేలి ఫంగస్ తగ్గించడంలో విక్స్ వెపొరబ్ కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో మెంథాల్, కర్పూరం, యూకలిప్టస్ ఆయిల్ ఉంటాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ల మీద ఎంతో బాగా పనిచేస్తాయి. ఫంగస్ ఉన్న ప్రదేశంలో దీన్ని రాసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున ఫంగస్ పూర్తిగా పోయేదాకా ఫంగస్ ఉన్న ప్రదేశంలో దాన్ని రాయాలి. విక్స్ వెపొరబ్ ను కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ లో కలిపి కూడా ఫంగస్ సోకిన ప్రదేశంలో రాయొచ్చు. ఒక టీస్పూను విక్స్ వెపరొబ్ లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె వేసి కలిపి ఫంగస్ సోకిన గోళ్ల మీద, గోరు చుట్టూరా రాయాలి. తర్వాత ఆ ప్రాంతంలో కట్టు కట్టాలి.

ఫంగస్ తగ్గే వరకూ రోజూ ఇలా చేయాలి. బేకింగ్ సోడాను ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో రాస్తే కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ ప్రాంతంలో అధిక తేమదనం ఉంటే పోగొడుతుంది. మూడు పాళ్లు బేకింగ్ సోడాలో ఒక పాలునీళ్లు పోసి పేస్టులా చేసి ఫంగల్ ఉన్న గోళ్ల మీద రాయాలి. పదిహేను ఇరవై నిమిషాలు దాన్ని అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో పాదాలను కడుక్కోవాలి.

రోజుకు రెండుసార్ల చొప్పున ఇది తగ్గే వరకూ కొన్ని వారాల పాటు ఇలా చేయాలి. ఫంగస్ వల్ల తలెత్తే మంట, ఇరిటేషన్లను బేకింగ్ సోడా తగ్గిస్తుంది. బేకింగ్ సోడాతో ఇలా కూడా చేయొచ్చు. ఒక టేబుల్ స్పును బేకింగ్ సోడా, చిన్న గిన్నెడు గోరువెచ్చటి నీళ్లను తీసుకుని రెండింటిని కలిపి అందులో పాదాలను పది పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పాదాలను బాగా పొడిగా ఉండేలా తుడిచి యాంటిఫంగల్ క్రీమును ఫంగస్ ఉన్న గోళ్లపై రాయాలి. ఇలా వారానికి మూడుసార్లు చొప్పున ఫంగస్ పోయేదాకా కొన్ని వారాలు రాయాలి. ఈ సమస్యను ఎదుర్కొటున్న వారు వైద్యుని సలహాను తీసుకోవడం మరొవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News