గ్లూటెన్ తీసుకోకపోతే…
గ్లూటెన్ ఫ్రీ డైట్…ఈ మాట ఎన్నోసార్లు వినుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు అనుసరించే రకరకాల డైట్లల్లో ఇదొకటి. కానీ గ్లూటెన్ ప్రీ డైట్ అంటే ఏమిటి? అది ఎంతవరకూ శరీరానికి ఆరోగ్యకరం? బరువు తగ్గించడంలో అది ఎంత వరకూ పనిచేస్తుంది? గ్లూటెన్ ఫ్రీ డైట్ మాట వినగానే ఇలాంటి ఎన్నో
సందేహాలు చాలామందిలో తలెత్తుతాయి.
నిపుణులైతే గ్లూటెన్ ఫ్రీ డైట్ అందరికీ సరిపోయేది కాదని హెచ్చరిస్తున్నారు. అలాగనక చేస్తే మలబద్దకం, మరెన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. గ్లూటెన్ ఫ్రీ డైట్ గురించిన సరైన
సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల కూడా చాలామంది ఈ డైట్ ట్రెండు పట్ల ఆసక్తి చూపుతున్నారనే అభిప్రాయాలు కూడా పలువురు నిపుణుల నుంచి వినవస్తున్నాయి. చాలామందికి గ్లూటన్ ఫ్రీ డైట్ అంటే ఏమిటో తెలియదు. దానివల్ల పొందే లాభాలు, దుష్పరిణామాలపై సైతం స్పష్టమైన అవగాహన లేదు.
దీని గురించి వీళ్లు విన్నదంతా సోషల్ మీడియా వేదికలపైనే అంటే అతిశయోక్తికాదు. అంతేకాదు ఈ
గ్లూటెన్ ఫ్రీ డైట్ గురించి పోషకాహార నిపుణులు చెపుతున్న పలు అంశాలు సైతం ఎంతో ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. డైటీషియన్, న్యూట్రిషనిస్టు కూడా అయిన మనాలి మెహతా గ్లూటెన్ ఫ్రీ డైట్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే ఏమిటో వివరించారు. గ్లూటెన్ అనే ప్రొటీన్ ఉన్న పదార్థాలను డైట్ లో తీసుకోకుండ ఉండడమే దీని పరమార్థం.
గ్లూటెన్ అనే ఈ ప్రొటీన్ గోధుమలతో పాటు వివిధ ధాన్యాల్లో కూడా ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ డైట్ కోసం చాలామంది గోధుమలను తినడం మానేస్తున్నారు. ఇది కరక్టు కాదంటున్నారు పోషకాహార నిపుణురాలు మనాలి మెహతా. గ్లూటెన్ ఫ్రీ డైట్ అందరికీ పడదని కూడా ఆమె స్పష్టంచేశారు. గ్లూటెన్ పడని సమస్య మీకున్నప్పుడు మాత్రమే గ్లూటెన్ ఫ్రీ డైట్ జోలికి వెళ్లొచ్చు. ఆ సమస్య లేకపోతే దాని అవసరం లేనే
లేదని మనాలి అంటున్నారు.
గ్లూటెన్ ఫ్రీ డైట్ వల్ల ప్రతికూల పరిణామాలు కూడా తలెత్తుతాయని పలువురు పోషకాహార నిపుణులు
అంటున్నారు. దీని గురించి పోషకాహార నిపుణురాలు, డైటీషియన్ మనాలి ఎన్నో విషయాలు చెప్పారు. డైట్ నుంచి గ్లూటెన్ పూర్తిగా తొలగిస్తే ఆరోగ్యానికి హానికరమని చెప్పారు మనాలి. అంతేకాదు గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ఫైబర్, ఐరన్, మరెన్నో ఎసెన్షియల్ న్యూట్రియంట్లు అందకుండా ఉండే ప్రమాదం ఉందన్నారు.
సెలియాక్ అనారోగ్యంతో బాధపడేవాళ్లు గ్లూటెన్ తినడం అస్సలు మంచిది కాదు. ఎంతో హానికరం. ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు గ్లూటెన్ తినడం వల్ల పెద్ద ప్రేవులు దెబ్బతింటాయి. సాధారణ స్థితిలోంచి చూస్తే నిత్యం మీరు తీసుకునే ఆహారం నుంచి గ్లూటెన్ ని పూర్తిగా తీసేయడం మాత్రం అస్సలు మంచిది న్యూట్రిషనిస్టు మనీలా అభిప్రాయడుతున్నారు. ఇలా చేయడం వల్ల డయాబెటిస్, మలబద్దకం సమస్యల రిస్కు సైతం బాగా పొంచి ఉంది.
ఆహారంలో గ్లూటెన్ లేకపోవడం వల్ల శరీరంలో ఫైబర్ తగ్గి, పొట్ట పరిశుభ్రంగా ఉండదు. అంతేకాదు గ్లూటెన్ ఫ్రీ ఉత్పత్తుల్లో ఉప్పు, సుగర్, ఫ్యాట్ లు ఉంటాయి . కొందరు గ్లూటెన్ ఇంటాలెరెన్స్ తో బాధపడుతుంటారు. గ్లూటెన్ అధికపాళ్లల్లో ఉన్న పదార్థాలను తిన్న తర్వాత కడుపునొప్పి, అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తినంత మాత్రాన మీరు గ్లూటెన్ ఇంటాలరెంట్ అని అర్థం కాదు. అలా అవడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పోషకాహారనిపుణులు.
అంతేకాదు గ్లూటెన్ ఇంటాలరెంట్ అనేది తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక వైద్య పరీక్షలుంటాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు పోషకాహార నిపుణులను సంప్రదించి మీరెదుర్కొంటున్న లక్షణాలన్నీ సమగ్రంగా వివరించాలి. వైద్య పరీక్షల్లో మీరు గ్లూటెన్ ఇంటాలరెంట్ లేదా గ్లూటన్ సెన్సిటివ్ అనే తేలిన
తర్వాత మాత్రమే గ్లూటెన్ ఉన్న పదార్థాల జోలికి వెళ్లకూడదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. గమనించారా? మరి జాగ్రత్త..