మేక పాలను తాగుతున్న వాళ్లు ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నారు. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? మేక పాలు పోషకాలనిధిట. ఈ పాలలోని ప్రొటీన్లకు యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. మేక పాలను తాగడం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ల నుంచి సాంత్వన పొందుతారంటున్నారు పోషకాహారనిపుణులు సైతం. అంటే ఆస్తమా, ఆర్త్రైటిస్, రకరకాల ఎలర్జీ సమస్యల నుంచి మేక పాలు మనకు ఉపశమనం ఇస్తాయంటున్నారు. అంతేకాదు మేక పాలల్లో కెసైన్స్, వే ప్రొటీన్లు, ఇమ్యునోగ్లోబలిన్స్ వంటి ఎన్నో ప్రొటీన్లు ఉన్నాయి. అంతేకాదు మేకపాలు యాంటాక్సిడెంట్ గా కూడా పనిచేస్తాయి. అలాగే ఈ పాలల్లో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు యాంటిమ్యూకోసల్ గా కూడా మేకపాలు పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా యాంటి కాన్సర్ ఏజెంటుగా కూడా మేకపాల గురించి పోషకాహారనిపుణులు చెపుతున్నారు. మేకపాలు యాంటిమైక్రోబియల్ మాత్రమే కాదు ప్రొబయొటిక్ అని కూడా వీళ్లంటున్నారు. ముందరే చెప్పుకున్నట్టు మేకపాలల్లో పోషక విలువలు మెండుగా ఉండడంతో శరీరారోగ్యం కూడా ద్రుఢంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా మేకపాలు గుండెకు అందించే లాభాలు ఎన్నో. మేకపాలలో మీడియం చెయిన్ ట్రైగ్లిజరైడ్స్
(ఎంసిటి), మొనో శారేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎంయుఎఫ్ఎ), పోలీఅన్శాచ్యురేటెడ్ వంటివి ఉన్నాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి జబ్బులను రాకుండా అడ్డుకుంటాయి. ఆవు పాల కన్నా మేక పాలల్లో కొలెస్ట్రాల్ కొద్దిగా తక్కువ. ఫ్యాటీ యాసిడ్స్ ప్రొఫైల్ ను ఇవి సమతుల్యం చేస్తాయి కూడా. అలాగే రోగనిరోధక శక్తిని బాగా పెంచే పోషకాల్లో సెలీనియం ఒకటి. ఇది రోగనిరోధకవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది. సెలీనియం ఆవు పాలల్లో తక్కువ ఉంటే, మేక పాలల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే మేకపాలను ఇమ్యూనిటీ బూస్టర్ గా భావించవచ్చు. మనుషులు తొందరగా జబ్బుల పాలబడకుండా కూడా ఇది సంరక్షిస్తుంది. అంతేకాదు మేకపాలల్లోని ఒలిగోశాచరైడ్స్ (కార్బోహైడ్రేట్లు)మంచి ప్రొబయొటిక్స్ కూడా. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చిన్నప్రేవులో గుడ్ బాక్టీరియాను బాగా పెంచుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. ఈ పాలు కాన్సర్ల పాలబడకుండా కాపాడుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
మేకపాల్లోని కంజ్యుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సిఎల్ ఎ)లో కాన్సర్ ను తగ్గించే గుణాలుండే అవకాశం ఉందని స్టడీల్లో వెల్లడైంది. మేకపాలు ఎముకలకు ఎంతో బలాన్నిస్తాయి. మేకల్లోని బయొఆర్గానిక్ సోడియం వల్ల కీళ్ల కదలికలు బాగా ఉంటాయి. కప్పుడు మేకపాలల్లో నిత్యం సరిపడేంత అంటే 35 శాతం కాల్షియంతో పాటు ఒక రోజుకు సరిపడా 20 శాతం వరకూ బి12 విటమిన్ ఉంటుంది. ఇవే కాకుండా మేకపాలలో ఫాస్ఫరస్, పొటాషియం, అధికపాళ్లల్లో విటమిన్ బి12 ఉన్నాయి. మేకపాలు రక్తంలో చక్కెర ప్రమాణాలను తగ్గిస్తాయి కూడా. విటమిన్లు, పోషకాలు కూడా ఈ పాలలో బాగా ఎక్కువ. మేక పాలను
పచ్చిగానే తాగేయొచ్చు. అంతేకాదు మేకపాలతో టీ, కాఫీలను కూడా తయారు చేసుకోవచ్చు. కేకులను కూడా మేకపాలతో చేసుకోవచ్చు. అయితే మేకపాలను పాశ్చరైజ్డ్ చేసిన తర్వాత తాగాలి. పాశ్చరైజ్డ్
చేయని మేక పాలను తాగడం వల్ల తీవ్ర అనారోగ్యాలు తలెత్తుతాయి. మేకపాలు ఎలర్జీ ఉన్నవారు, మేకపాలతో చేసిన పదార్థాలు పడని వారు వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. ఆవుపాలను జీర్ణం
చేసుకోలేని వారికి మేక పాలు మంచి ప్రత్యామ్నాయం. మేకపాలు తాగాలనుకుంటున్న వారు ముందుగా వైద్యుని సంప్రదించి తదనుగుణంగా వాటిని తగిన పరిమాణంలో తీసుకుంటే మంచిదని మరవొద్దు.