HomeTop StoriesHealth Tips: త్వరగా నిద్రపోతే బరువు తగ్గే చాన్స్‌

Health Tips: త్వరగా నిద్రపోతే బరువు తగ్గే చాన్స్‌

ఢిల్లీ(తెలుగుప్రభ) : త్వరగా నిద్రపోతే బరువు తగ్గేందుకు దోహదపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్‌ బాధితుల్లో నిద్రించే సమయం శరీర బరువుపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎంతసేపు నిద్రపోతున్నామన్నదే కాకుండా, ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్నామన్నది కూడా బరువు నియంత్రణ, జీవక్రియ ఆరోగ్యానికి కీలకమని స్పష్టం చేశారు. ‘నర్సింగ్‌ రీసెర్చ్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో రాత్రికి 6.5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్న దాదాపు 200 మంది ప్రీ డయాబెటిస్‌ బాధితులను పరిశీలించారు. వీరిని రెండు బృందాలుగా విభజించి ఎనిమిది వారాలపాటు అధ్యయనం చేశారు. ఒక బృందానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణపై అవగాహన కల్పించగా, మరో బృందానికి వీటితోపాటు ప్రత్యేక నిద్ర శిక్షణ ఇచ్చారు. నిద్రకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం, పడకను నిద్రకు మాత్రమే అనుసంధానించేలా అలవాట్లు మార్చుకోవడం, క్రమంగా ముందుగా నిద్రపోయేలా సమయాన్ని సర్దుబాటు చేసుకోవడం వంటివి నేర్పించారు.

- Advertisement -

ప్రతి గంట ముందుగా నిద్రిస్తే..

రెండు బృందాల్లోనూ నిద్ర నాణ్యత మెరుగుపడటంతోపాటు బరువు తగ్గినట్లు గుర్తించారు. అయితే, నిద్రపై ప్రత్యేక శిక్షణ పొందినవారిలో నిద్ర నాణ్యత మెరుగుదల, పగటిపూట మగత తగ్గడం ఎక్కువగా కనిపించింది. వీరు ముందుగానే నిద్రపోయే అలవాటును కూడా పెంచుకున్నారు. మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిల్లో మాత్రం గణనీయమైన మార్పులు నమోదు కాలేదు. నిద్రించే సమయాన్ని ప్రతి గంట ముందుకు మార్చుకున్నవారిలో ఎనిమిది వారాల్లో సగటున 0.73 కిలోల బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

 

నిద్ర వ్యవధిలో మార్పుల కంటే ముందుగా నిద్రపోవడానికే బరువు తగ్గుదలతో స్వతంత్ర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారిలో అర్ధరాత్రి వేళ ఆహారం తీసుకునే అలవాటు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు వివరించారు. ఆ సమయంలో శరీరంలో ఇన్సులిన్‌ సున్నితత్వం, గ్లూకోజ్‌ను వినియోగించుకునే సామర్థ్యం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్కువసేపు మేల్కొని ఉండటం వల్ల కృత్రిమ వెలుతురుకు గురికావడం, శరీరంలోని ఒత్తిడి వ్యవస్థ చురుకుదనం పెరగడం, ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్‌ హార్మోన్‌ ప్రభావం అధికమవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని తెలిపారు. త్వరగా నిద్రపోవడం వల్ల రాత్రిపూట ఆహారం తీసుకునే అవకాశం తగ్గుతుందని, శరీర జీవక్రియకు అనుకూలమైన సమయంలో ఆహారం తీసుకోవడం సాధ్యమవుతుందని అధ్యయన ప్రధాన రచయిత, న్యూయార్క్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుసాన్‌ కోల్‌ మలోన్‌ తెలిపారు. నిద్రించే సమయం కూడా బరువు నియంత్రణ, జీవక్రియ ఆరోగ్యానికి ముఖ్యమైన అంశమని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News