Tuesday, September 17, 2024
Homeహెల్త్Hair fall after 40: 40 ఏళ్లలో జుట్టు రాలిపోతోందా?

Hair fall after 40: 40 ఏళ్లలో జుట్టు రాలిపోతోందా?

మహిళలు ముఫ్లైల్లోకి అడుగుపెట్టడం మొదలవగానే జుట్టు ఊడడం మొదలవుతుంది. మాడు మధ్యభాగంలో జుట్టు తగ్గడం ప్రారంభమవుతుంది. నలభై ఏళ్లు వచ్చేసరికి 40 నుంచి 50 శాతం దాకా జుట్టు రాలడం కనిపిస్తుంది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యను నియంత్రించే టిప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ సమస్యను అధిగమించే హెయిర్ కేర్ ట్రీట్మెంటులు కూడా ఉన్నాయి. జుట్టు ఊడడం, పెరగడం మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు జుట్టు పెరగడం, రాలిపోవడం ప్రక్రియ జరుగుతుంటుంది. మగాళ్లకు నలభై ఏళ్లు వచ్చిన తర్వాత జుట్టురాలడం మొదలయితే స్త్రీలకు ముఫ్పై ఏళ్ల నుంచే మాడు మధ్యలో జుట్టు ఊడి వెంబగా కనిపించడం మొదలవుతుంది. మెల్లగా జుట్టు పలచబడడం, శిరోజాలు పెరుగుదల తగ్గుతూ రావడం జరుగుతుంది.

- Advertisement -

ఇందుకు ఒక ప్రధాన కారణం హార్మోన్లలో తలెత్తే తేడాపాడాలు. హార్మోన్ల ప్రభావం 25 ఏళ్ల వయసు నుంచే ప్రారంభమవుతుంది. వీటిల్లో మార్పులు జన్యుసంబంధమైన అంశాలతో కూడా ముడిపడి ఉంటాయి. జన్యు సంబంధమైన కారణాలు ఉంటే మాత్రం వాటి ప్రభావం జట్టు పై తీవ్రంగానే కనిపిస్తుంది. అందువల్లే దాదాపు 40 నుంచి 50 శాతం మందిలో జుట్టు రాలడం చూస్తాం. హార్మోన్లలోని తేడాపాడాలను బట్టి జుట్టు ఊడడం తీవ్రత ఉంటుంది. హార్మోన్ల ప్రభావం వల్ల మగవాళ్లల్లో తల ముందు భాగంలో, మధ్య భాగంలో, టాప్ లో జుట్టు ఊడి బట్టతల ఏర్పడితే, ఆడవాళ్లల్లో మాడు మధ్య భాగంలో, టాప్ లో జుట్టు రాలిపోవడం జరుగుతుంటుంది.

హార్మోన్లు కాకుండా, ఒత్తిడి వల్ల, పోషకాల లోపం కారణంగా, కొన్నిరకాల మందులు వాడడం వల్ల, మాడు సంబంధిత జబ్బుల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అంతేకాదు 35 నుంచి 40 ల మధ్యలో థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుత్తుంటాయి. వీటివల్ల కూడా జుట్టు రాలిపోతుంది. లేదా వెంట్రుకల పెరుగుదలలో మార్పు వస్తుంది. ఇలా జుట్టు రాలిపోవడాన్ని వైద్య పరిభాషలో అలొపేసియా అంటారు. 50 శాతం మంది మహిళల్లో చాలామందికి పోషకాహార లోపంతోనే జుట్టు రాలడం జరగుతోంది. మెనోపాజ్ లోకి ప్రవేశించిన సమయంలో ఆడవాళ్లల్లో ఈస్ట్రోజన్ ప్రమాణాలు తగ్గడం మొదలవుతుంది. ఇది కూడా మహిళల్లో జట్టు రాలడానికి దారితీస్తుంది. ఆడవాళ్లల్లో బట్టతలకు కారణమవుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్, కిమోథెరపీ, కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా జుట్టు బాగా ఊడుతుంది.

చాలామంది హెయిర్ స్ట్రైటనింగ్ చేయించుకుంటుంటారు. దీనివల్ల కూడా జుట్టు రాలుతుంది. అంతేకాదు హెయిర్ స్ట్రైటనింగ్ ఉత్పత్తుల వినియోగం వల్ల మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఇటీవల నిర్వహించిన పలు పరిశోధనల్లో వెల్లడైంది కూడా. ఏవైనా జబ్బులు ఉంటే వాటికి ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏవైనా లోపాల వల్ల జుట్టు రాలిపోతుంటే వాటికి తగిన సప్లిమెంట్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఉదాహరణకు హార్మోన్లలోని తేడాపాడాల వల్ల జుట్టు ఊడుతుంటే వెంటనే దానికి తగిన మందులను వాడాలనమాట. ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా (పిఆర్ పి) జుట్టు రాలడాన్ని, జుట్టు పలచబడడాన్ని నియంత్రిస్తుంది. పోషకాల లోపం వల్ల జుట్టు రాలిపోతుంటే పోషకాహారం తీసుకోవాలి. అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు ఉన్న న్యూట్రిషనల్ డైట్ తినాలి. సిగరెట్లు తాగడం, డ్రింకింగ్ వంటి వాటి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఆ అలవాట్ల వల్ల జుట్టు టెక్స్చెర్, పెరిగే తీరులో సైతం తీవ్ర మార్పులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మగవాళ్లల్లో జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే షార్ట్ హెయిర్ కట్ మంచిది. అలా చేయించుకుంటే జుట్టు సంరక్షణ సులభం. ఆడవాళ్ల విషయానికి వస్తే, పొడుగైన శిరోజాలు ఉన్నవాళ్లు రోజు మార్చి రోజు మాత్రమే తలస్నానం చేయాలి. నాన్ స్టికీ హెయిర్ఆయిల్ ని మాత్రమే వెంట్రుకలకు రాసుకోవాలి. చుండ్రుతో బాధపడేవాళ్లు సల్ఫేట్ బేస్డ్ షాంపులను వాడాలి. ఇవి బెస్ట్ క్లీన్సర్లుగా పనిచేస్తాయి. షాంపు పెట్టుకున్న తర్వాత నాణ్యమైన కండిషనర్ ని వాడాలి. చుండ్రు సమస్య లేని వారంతా సల్ఫేట్ ఫ్రీ షాంపులను వాడాలి. ఇది నార్మల్ క్లీన్సర్. జుట్టును పరిరక్షిస్తుంది.

సల్ఫేట్ ఫ్రీ షాంపు వాడే వారు కండిషనర్లను వాడాల్సిన అవసరం లేదు. వాడాలనుకుంటే అది వారి ఆప్షనల్. జుట్టు పాయలమీద హీట్ ను రోజూ అప్లై చేయకూడదు. అలా చేస్తే జుట్టు కుదుళ్లు బాగా దెబ్బతింటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. జుట్టు ఆరోగ్యంగా ఉంటే హీట్ లేదా కలరింగ్ వంటి ఎలాంటి ప్రభావాలనైనా తట్టుకోగలదు. జుట్టు ఒత్తుగా ఉండి, కుదుళ్లు పటిష్టంగా ఉంటే దాని దుష్ప్రభావం జుట్టు మీద ఎక్కువ పడదు. దీంతోపాటు మాడు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మాడుకు ఎక్కువ నూనె పట్టించనవసరం లేదు. అలాగే సమతులాహారం శరీరానికి ఎంత అవసరమో ఆరోగ్యకరమైన కేశసంపదకు కూడా అంతే అవసరం.

ఐరన్, విటమిన్ బి12, ప్రొటీన్, ఫోలిక్ యాసిడ్ వంటి లోపాలకు సప్లిమెంట్లు ఉన్నాయి. హార్మోన్ల వల్ల జుట్టు ఊడిపోతున్న వాళ్లు మాత్రం జుట్టు ఊడకుండా జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందుకే శిరోజాలు రాలిపోతుంటే వైద్యులను సంప్రదించి అందుకు మూల కారణమేమిటో తెలుసుకుని దానికి తగ్గట్టు శిరోజాల సంరక్షణకు పూనుకోవాలి…స్వంత వైద్యాలు, చిట్కాలు మాత్రం ప్రయోగించవద్దంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News