మీ జుట్టు పలచబడుతోందా? దీనికి కారణాలు చాలా ఉంటాయి. వయసు మీద పడినపుడు జుట్టు పలచగా అవడం సహజం. నీ చిన్నవయసులోనే తలపై వెంట్రుకలు పలచబడుతుంటే దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే దీనికి ట్రీట్ మెంట్ తీసుకోబోయే ముందు జుట్టు పలచబడడానికి మూలకారణం ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు ఒత్తుగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి సంబంధించి టిప్స్ కొన్ని మీకోసం..
వెంట్రుకలు శుభ్రంగా ఉండాలని చాలామంది నిత్యం తలరుద్దుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టులో ఉండే సహజసిద్ధమైన ఆయిల్స్ ఆవిరయి వెంట్రుకల టెక్స్చెర్ దెబ్బతింటుంది. శిరోజాలు పలచబడతాయి. అందుకే నిత్యం కాకుండా వారానికి రెండు లేదా మూడుసార్లు తలరుద్దుకుంటే చాలని చర్మనిపుణులు సూచిస్తున్నారు. సల్ఫేట్స్ లేని మాయిశ్చరైజింగ్ షాంపులను వాడితే శిరోజాలు నిగనిగలాడుతూ ఉండడమే కాకుండా ద్రుఢంగా ఉంటాయని చర్మనిపుణులు చెప్తున్నారు.
శక్తివంతమైన షాంపులు, హెయిర్ స్ప్రేలు, జల్స్ వంటి ఉత్పత్తులు వాడడం వల్ల కూడా జుట్టు పలచబడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలంటున్నారు.
తీవ్ర ఒత్తిడికి గురయినా కూడా అది వెంట్రుకలపై ప్రభావం చూపి అవి రాలిపోవడం, జట్టు పలచబడడం జరుగుతుంది.
వెంట్రుకలకు షాంపు పెట్టుకున్న తర్వాత వెంట్రుకలు చిక్కు పడకుండా చేసే కండిషనర్ ను తలపై అప్లై చేసుకుంటే మంచిది. ఇది వెంట్రుకల్లో మాయిశ్చర్ గుణం పోగొట్టకుండా కాపాడుతుంది.
వంశపార్యంపర్య లక్షణాల వల్ల కూడా వెంట్రుకలు పలచబడుతుంటాయి. కొన్ని రకాల మెడికల్ కండిషన్ల వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకు కాన్పు అయిన తర్వాత చాలామంది మహిళల్లో జుట్టు పలచబడ్డం సంభవిస్తుంటుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ ఆపడం వల్ల కూడా జుట్టు పలచబడుతుంది. శరీరంలో హార్మోనల్ మార్పులు సంభవించినపుడు కూడా వెంట్రుకలు ఊడడం, పలచబడ్డం జరుగుతుంది. అలాగే హఠాత్తుగా శరీర బరువు తగ్గినపుడు, ఆటోఇమ్యూన్ జబ్బులకు చికిత్స తీసుకుంటున్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు తలెత్తినపుడు, చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు తలెత్తినా, డి విటమిన్ లోపం వల్ల కూడా జుట్టు పలచబడ్డం , ఊడడం జరుగుతుంది.
జుట్టును సరిగా ట్రీట్ చేయకపోయినా కూడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. పలచబడతాయి. ఉదాహరణకు శిరోజాలతో రకరకాల హెయిర్ స్టైయిల్స్ ను కొందరు చేసుకుంటుంటారు. అందులోనూ క్లిష్టంగా ఉండే హెయిర్ స్టైయిల్స్ ను చేసుకుంటే జుట్టుకు సమస్యేనంటున్నారు శిరోజాల నిపుణులు. ముఖ్యంగా మాడు నుంచి వెంట్రుకలను గట్టిగా లాగి చేసుకునే శిరోజాల అలంకరణ వల్ల వెంట్రుకలు ఊడిపోవడమే కాదు జుట్టు పలచబడే అవకాశం కూడా ఉందని వీళ్లు చెప్తున్నారు. ఉదాహరణకు కొందరు నడినెత్తిమీదకు వెంట్రుకలను గట్టిగా లాగి పోనీ టైల్ వేసుకుంటారు. లేదా వెంట్రుకలను బిగుతుగా దగ్గరకు చేర్చి పోనీటైల్ వేస్తారు. వెంట్రుకలతో గట్టిగా జడలు అల్లి వేసుకుంటారు. ఇలాంటి శిరోజాల స్టయిల్స్ ను తరచూ వేసుకోవడం వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి.
స్కాల్ప్ మసాజ్ వల్ల జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ మసాజ్ ను కరక్టుగా చేయాలి. లేకపోతే శిరోజాలు దెబ్బతింటాయి.
యాంటి థిన్నింగ్ షాంపులుంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా చేస్తాయి. వెంట్రుకలు పలచగా ఉండేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పలచబడ్డ వెంట్రుకలను ఒత్తుగా చేసే విటమిన్లు, ఎమినో యాసిడ్లు ఈ షాంపులలో పుష్కలంగా ఉంటాయి.ఇవి మాడును ఆరోగ్యంగా ఉంచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా సంరక్షిస్తాయి. అయితే వైద్యుల సలహాతో వీటిని వాడాలనే విషయం మాత్రం మరవొద్దు.
ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారికి చర్మనిపుణులు మైక్రోనీడిలింగ్ అనే చికిత్సను సూచిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వెంట్రుకలు ఒత్తుగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు ఈ విధానం వెంట్రుకల కుదుళ్లను సైతం పటిష్టంగా ఉంచుతుందిట. ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునేవాళ్లు చర్మనిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
మాడుపై జుట్టు పలచగా ఉన్న చోట, బట్టతల ఉన్న చోట హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇందుకు కూడా ముందుగా చర్మనిపుణులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది.
ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా అనే చికిత్సా విధానం కూడా ఉంది. ఈ విధానంలో మాడుపై జుట్టు పలచగా ఉన్న ప్రదేశంలో ప్లాస్మా ఇంజెక్టు చేస్తారు. నెలకొకసారి వరుసగా మూడు నెలలు ఈ చికిత్సను చేస్తారు. ఆతర్వాత ప్రతి మూడు నెలల నుంచి ఆరు నెలలకు ఈ చికిత్సను కొనసాగిస్తారు. దీని గురించి కూడా చర్మనిపుణులను సంప్రదించి చేయించుకోవడం మంచిది.
పోషకాహార లోపం వల్ల కూడా మాడుపై జుట్టు పలచబడుతుంది. అందుకే నిపుణుల సలహాతో మల్టీవిటమిన్ మందులు తీసుకుంటే మంచిది. జుట్టు ఆరోగ్యంగా ఉండడమనేది మీ శరీరారోగ్యంతో ముడిపడి ఉందనే విషయం మరవొద్దు. అందుకే శరీరంలో విటమిన్లు తక్కువగా ఉంటే వైద్యుల సూచనలతో ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింకు ఉన్న విటమిన్లను వాడితే జట్టు ఒత్తుగా పెరుగుతుంది.
శిరోజాల ఆరోగ్యమైన పెరుగుదలకు పోషకాలతో కూడిన సమతులాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. డైటీషియన్ సూచనలతో డైట్ ప్లాన్ తయారుచేసుకుని ఆ ప్రకారం సమతులాహారం తీసుకోవాలి. పొగతాగినా కూడా జుట్టు పలచబడుతుంది. వెంట్రుకలు ఊడిపోతాయి. పొగతాగే అలవాటు వల్ల వెంట్రుకల పెరుగుదల వ్యవస్థ దెబ్బతింటుంది. వెంట్రుకలు రంగును కోల్పోతాయి.