ఉబ్బరాన్నితగ్గించుకోవచ్చు..
ప్రపంచంలోని 30 శాతం మంది యువతీయువకులు ఉబ్బరంతో, గ్యాసుతో సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారని ఇటీవల వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. ఉబ్బరం అనేది జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల తలెత్తే సమస్య. ఈ ఉబ్బరం, గ్యాసు సమస్యలు తలెత్తడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. అతిగా తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే తినే ఆహారాన్ని సరిగా నమలకుండా హడావిడిగా తినడం వల్ల కూడా ఇవి తలెత్తుతాయి. గ్యాసును ఉత్పత్తి చేసే ఆహారపదార్థాలు అంటే క్యాబేజీ, బీన్స్, చిక్కుళ్లు, బ్రోకొల్లీ, ఉల్లిపాయలు, కార్బొనేటెడ్ డ్రింకుల వల్ల జీర్ణ వ్యవస్థలో గ్యాసు ఏర్పడి కడుపు ఉబ్బరం వస్తుంది. దీంతో తీవ్ర ఎసిడిటీ సమస్య మనల్ని బాధిస్తుంది.
క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు లేకపోయినా ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటాం. అలాగే కొన్ని రకాల ఆహారపదార్థాలు పడకపోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వస్తుంది. మలబద్దకం వల్ల జీర్ణక్రియ తగ్గిపోయి కూడా ఉబ్బరం వస్తుంది. ఈ సమస్యను అధికమించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైంది నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలంటారు వైద్యులు. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. అప్పుడు అన్నం మెత్తగా అయి సులభంగా జీర్ణం అవుతుంది. అందుకే ఆహారాన్ని మెల్లగా నమిలి తినడాన్ని అలవాటు చేసుకోవాలి.
ప్రోబయొటిక్ లేదా గుడ్ బాక్టీరియా కూడా ఆహారాన్ని జీర్ణమయ్యేట్టు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనిచేయడానికి గుడ్ బాక్టీరియా ఎంతగానో సహకరిస్తుంది కూడా. అందుకే ప్రోబయొటిక్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటే ఉబ్బరం తలెత్తదు. జీర్ణక్రియ బాగా అవుతుంది కూడా. పిప్పర్ మెంట్ టీ ఉబ్బరం సమస్యను నిరోధిస్తుంది. అంతేకాదు ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. గ్యాసు, ఉబ్బరం సమస్యలు రాకుండా సహకరిస్తుంది. అందుకే అన్నం తిన్న తర్వాత ఒక కప్పుడు పిప్పర్ మెంట్ టీ తాగితే మంచిది.
ఉప్పు ఎక్కువ తినకూడదు. ఉప్పును ఎక్కువ వాడితే శరీరంలోని నీళ్లు తొందరగా ఆవిరయిపోతాయి. అలా కూడా కడుపు ఉబ్బరం తలెత్తుతుంది. అందుకే ప్రోసెస్ఢ్ ఫుడ్స్ కు దూరంగా ఉండమంటారు పోషకాహార నిపుణులు. అలాగే మనం ఇంట్లో వండుకునే ఆహారపదార్థాల్లో కూడా ఉప్పును తగ్గిస్తే మంచిది.