Late Breakfast Raises Premature Death Risk: రోజును ఆరోగ్యంగా ప్రారంభించడానికి మొదటి భోజనం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అల్పాహారం శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. కానీ చాలామంది బిజీ షెడ్యూల్ కారణంగా లేదా సమయం దొరకకపోవడంతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తారు లేదా ఆలస్యంగా చేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో జరిగిన ఒక విశ్లేషణలో తేలింది.
ఆరోగ్య స్థితి, ఆహార అలవాట్లు..
ఈ పరిశోధనలో భాగంగా ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్, న్యూకాజిల్ ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు మూడు వేల మంది డేటాను సేకరించారు. వీరి ఆరోగ్య స్థితి, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి అంశాలపై సర్వేలు నిర్వహించి, సుదీర్ఘకాలం డేటాను విశ్లేషించారు. దాదాపు రెండు దశాబ్దాల గణాంకాలు పరిశీలించిన తర్వాత పరిశోధకులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించారు. ఉదయం తొలి భోజనం చేసే సమయం మారిపోతున్నదని, ముఖ్యంగా అల్పాహారం ఆలస్యంగా తీసుకునే వారిలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనిపించాయని గుర్తించారు.
అధ్యయనం ప్రకారం, అల్పాహారం చేసే సమయం కేవలం ఆకలిని తీరుస్తుందనే విషయం మాత్రమే కాదు, ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందనే నిజం వెలుగులోకి వచ్చింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ఎక్కువగా ఆలస్యం చేయడం వృద్ధుల శారీరక, మానసిక స్థితిని దెబ్బతీయగలదని నిపుణులు తెలిపారు. ఏ ఆహారం తీసుకుంటామన్నది ఎంత ముఖ్యమో, దాన్ని ఏ సమయంలో తీసుకుంటామన్నది కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమైతే..
ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రతి గంట బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమైతే, మరణ అవకాశాలు 8 నుండి 11 శాతం వరకూ పెరుగుతాయని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అంటే, ఉదయం భోజనం ఒక గంట ఆలస్యమైతే, అకాల మరణం సంభవించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వలన వృద్ధుల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం పడుతుంది.
జీర్ణక్రియ సరిగా..
అల్పాహారం ఆలస్యంగా చేయడం వలన జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, అలసట ఎక్కువ కావడం, శరీర శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు, ఈ అలవాటు గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు కూడా దారితీసే అవకాశముందని హెచ్చరించారు. వృద్ధులలో ఆరోగ్య సమస్యలు వేగంగా పెరగడానికి ఇది ఒక కారణంగా మారవచ్చని వారు సూచించారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ పోషకాహార నిపుణుడు డాక్టర్ హసన్ దష్టి ఈ విషయంపై మాట్లాడుతూ, ఉదయం భోజనం చేసే సమయం ఆరోగ్యానికి అత్యంత కీలకమని అన్నారు. ఉదయం ఆలస్యంగా అల్పాహారం తినడం వల్ల శరీర పనితీరు మందగించడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని ఆయన వివరించారు. నిద్ర నాణ్యత తగ్గిపోవడం, అలసట ఎక్కువగా ఉండటం, ఒకే చోట కూర్చుని ఉండే అలవాటు పెరగడం వలన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుందని కూడా ఆయన గుర్తు చేశారు.
మానసిక ఆరోగ్యం కూడా..
పరిశోధకులు ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. భోజనం చేసే సమయాలు మారడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుందని వారు తెలిపారు. నిర్దిష్ట సమయానికి తినకపోవడం వలన మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసట వంటి సమస్యలు ఎక్కువ అవుతాయని ఈ అధ్యయనం పేర్కొంది. దీని వలన జీవన ప్రమాణాలు పడిపోతాయని హెచ్చరికలు వినిపించాయి.
ఈ అధ్యయనంలో స్పష్టమైన సందేశం ఏమిటంటే, వయసు పెరిగేకొద్దీ ఆహార అలవాట్లలో సమయపాలన చాలా అవసరమని. ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన సమయానికి తినడం కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉంటుందని ఇది తెలియజేస్తోంది.


