Health benefits of Karpooravalli leaves : మన ఇంటి పెరట్లో, పూల కుండీల్లో ఎంతో తేలికగా పెరిగే ఓ మొక్క ఉంది. దాని పేరు కర్పూరవల్లి… మనలో చాలామందికి ‘వామాకు’గా సుపరిచితం. ఘుమఘుమలాడే వామాకుతో వేడివేడి బజ్జీలు, పచ్చళ్లు చేసుకుని దాని రుచిని ఆస్వాదిస్తాం. కానీ, ఈ ఆకు కేవలం రుచికే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధాల గని అని, దీనిని నేరుగా తిన్నా, కషాయంగా చేసుకుని తాగినా ఎన్నో అనారోగ్య సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు, శాస్త్రీయ అధ్యయనాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇంతకీ, ఈ వామాకులో దాగి ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలేంటి?
కర్పూరవల్లి లేదా వామాకు, చూడటానికి చిన్న మొక్కే అయినా, అది చేసే మేలు అంతా ఇంతా కాదు.
జలుబు, దగ్గుకు దివ్యౌషధం: వానాకాలం, చలికాలంలో ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యలకు వామాకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
ఎలా వాడాలి : ఈ ఆకులను నీటిలో మరిగించి, ఆవిరి పడితే ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగిపోతుంది. ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (NLM) పేర్కొంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వామాకు ఒక మంచి మిత్రుడు. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. భోజనం తర్వాత రెండు ఆకులను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది: కర్పూరవల్లి ఆకులను తినడం లేదా కషాయంగా తాగడం వల్ల కిడ్నీలలో పేరుకుపోయిన అదనపు ఉప్పు నిల్వలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది: ఈ ఆకుల్లోని కొన్ని సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
నొప్పి, వాపు నివారిణి: కీళ్ల నొప్పులు, రుమాటిజం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి వామాకు ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపును, నొప్పిని తగ్గిస్తాయి. ఈ ఆకుల రసాన్ని నొప్పులు ఉన్నచోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
చర్మ సంరక్షణ: కీటకాలు కుట్టినప్పుడు, దద్దుర్లు, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల వల్ల కలిగే వాపు, ఎరుపు, దురదను తగ్గించడంలో దీనిలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ గుణాలు అద్భుతంగా పనిచేస్తాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మా రీసెర్చ్ అండ్ హెల్త్ సైన్సెస్ అధ్యయనం పేర్కొంది.


