Black Chickpeas: నేటి యుగంలో ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. అందుకు తగిన వ్యాయామంతో పాటు ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. సాధారణంగా మనకు తక్కువ ఖర్చుతో.. పోషకాహారం లభించడం అంత సులువు కాదు. కానీ మన ఇంట్లోనే అలాంటి ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహం నుంచి రక్తహీనత వరకు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ దివ్యమైన ఆహారం ఏంటో తెలుసుకుందాం.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మధుమేహం నుంచి రక్తహీనత వరకు అన్నింటిని దూరం చేసే శక్తి నల్ల శనగలకు ఉంటుంది. శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని నేరుగా తినడం కంటే రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Also read-Pineapple: పైనాపిల్ జ్యూస్ అధికంగా తాగుతున్నారా?.. అయితే ముప్పు తప్పదు!
జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా: నల్ల శనగలను నానబెట్టడం వల్ల అవి మెత్తగా మారి.. సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా కండరాల బలానికి ఇవి ఎంతో దోహదపడతాయి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తాయి కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన అల్పాహారం.
మధుమేహం బాధితులకు వరం: నల్ల శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. మధుమేహ బాధితులకు ఇది ఒక వరమనే చెప్పాలి. అంతేకాకుండా వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
రక్తహీనతకు చెక్!: నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. నల్ల శనగల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల, ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా అలసట, బలహీనత తగ్గి శరీరం ఉత్సాహంగా మారుతుంది. నల్ల శనగలు కేవలం శరీరానికే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి.. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
Also read-Mangoes: కల్తీ లేని మామిడి పండ్లను ఇలా గుర్తించండి!
పరిగడపున తీసుకోవాలి: రాత్రిపూట గుప్పెడు నల్ల శనగలను శుభ్రమైన నీటిలో నానబెట్టాలి. ఉదయం వడకట్టిన శనగలను తీసుకోవాలి. అయితే రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేదా మిరియాల పొడి కలుపుకోవచ్చు. సాధారణంగా ఆరోగ్యవంతులు రోజుకు 30 నుండి 50 గ్రాముల నానబెట్టిన శనగలను తీసుకోవడం సరిపోతుంది. సహజ సిద్ధమైన ఈ పోషకాహారాన్ని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

