Raisins Benefits: కిస్మిస్ లేదా ఎండుద్రాక్ష మన రోజువారీ జీవితంలో వంటకాల నుండి మిఠాయిల వరకు విస్తృతంగా ఉపయోగించే పదార్థం. చిన్నదిగా కనిపించే ఈ పండు మన ఆరోగ్యానికి అందించే లాభాలు చాలా ఎక్కువ. ఈ కిస్మిస్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రోజూ తినడం వల్ల..
నిపుణుల ప్రకారం ఎండుద్రాక్షను రోజూ తినడం వల్ల శరీరానికి కావలసిన అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొద్ది కిస్మిస్ తింటే మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఉదయం ఐదు ఎండుద్రాక్ష కంటే ఎక్కువ కాకుండా తీసుకోవడం శరీరానికి అనేక రకాలుగా సహాయం చేస్తుంది.
జీర్ణక్రియ సమస్యలతో…
జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి కిస్మిస్ మంచి మిత్రుడు. ఇందులో ఉండే అధిక ఫైబర్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గి, పేగులు ఆరోగ్యంగా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో షుగర్ స్థాయిలను సరిచేసి డయాబెటిస్ రోగులకు కూడా ఉపయోగకరంగా మారుతుంది.
రక్తపోటును..
కిస్మిస్‌లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో కిస్మిస్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
అలసటను తగ్గించి..
శక్తి అవసరమయ్యే సమయాల్లో కూడా కిస్మిస్ సహాయపడుతుంది. ఇందులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటంతో వెంటనే శక్తిని అందిస్తాయి. అలసటను తగ్గించి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు కిస్మిస్ ఉపయోగపడుతుంది.
బరువు తగ్గాలని కోరుకునే వారికి..
బరువు తగ్గాలని కోరుకునే వారికి కూడా కిస్మిస్ ప్రయోజనకరం. ఇందులోని ఫైబర్ కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో ఆకలి తగ్గి, అనవసరంగా ఎక్కువ తినే అలవాటు తగ్గుతుంది. ఫలితంగా కేలరీల నియంత్రణ జరుగుతుంది. అనేక పరిశోధనల ప్రకారం కిస్మిస్ తీసుకోవడం వలన ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుందని తేలింది.
రోగనిరోధక శక్తిని..
కిస్మిస్ రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన పండు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఇమ్యూనిటీ బలపడుతుంది. దీని వల్ల తరచుగా వచ్చే జలుబు, ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మానికి కాంతిని ఇచ్చి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నిపుణులు సూచించే మరో విధానం ఏమిటంటే, రాత్రి ఐదు ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం. ఇలా తింటే కిస్మిస్‌లోని పోషకాలు మరింతగా శరీరానికి అందుతాయి. అలాగే అవి సులభంగా జీర్ణమవుతాయి.
కాబట్టి చిన్నగా కనిపించే ఈ ఎండుద్రాక్ష మన ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే శక్తి, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి అన్నీ సమతుల్యం అవుతాయి.


