Soaked Anjeer: పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ పండు ప్రత్యేకత దానిదే. దేని ప్రయోజనాలు దానివే. అయితే, అంజీర పండ్ల ప్రత్యేకత, లాభాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. మీరు ఏ పని చేయకుండానే రోజంతా అలసిపోయినట్లు, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే అంజీర్ పండ్లు తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తాయి. ఈ పండును ఎండిన రూపంలో తింటారు. అంజీర్ లో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం.
మలబద్ధకం నుండి ఉపశమనం: అంజీర్ పండ్లు దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి దివ్యౌషధం కావచ్చు. వీటిలో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో రాత్రిపూట నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ప్రేగులు క్లీన్ అవుతాయి. అంతేకాదు, జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బరువు తగ్గడం: చాలారోజుల నుంచి బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, ఆహారంలో అంజీర్‌లను చేర్చుకోవడం ఉత్తమం. అంజీర్‌లోని ఉండే ఫైబర్ కడుపు ఎక్కువ సమయం నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా పదే పదే తినే అలవాటును నివారించవచ్చు. ఇవి స్వీట్ గా ఉన్నప్పటికీ, కేలరీలు తక్కువగా ఉంటాయి.
గుండె ఆరోగ్యం: అంజీర్ పండ్లలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అయితే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
also read:Bitter gourd: కాకరకాయ చేదు తగ్గాలా..? వండే ముందు ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి!!
ఎముకలను బలోపేతం చేస్తుంది: కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా ఉంటాయి. అంజీర్ పండ్లు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలకు అద్భుతమైన మూలం. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం ఆస్టియోపోరోసిస్ (ఎముకలను బలహీనపరిచే వ్యాధి) వంటి సమస్యలను నివారించవచ్చు.
ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు: అంజూర పండ్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని లోపలి నుండి పోషిస్తాయి. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. ఇంకా అంజీర్ పండ్లు జుట్టు మూలాలను బలోపేతం చేయడమే కాకుండా, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
నానబెట్టిన అంజీర్ పండ్లను ఎలా తినాలి?
ఒక చిన్న గిన్నె నీటిలో 2-3 ఎండిన అంజూర పండ్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి, నానబెట్టిన అంజూర పండ్లను తినాలి. కావాలంటే నానబెట్టిన అంజూర పండ్లను పాలతో కూడా తినవచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


