Soaked Peanuts Benefits: సాధారణంగా మనం నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష లేదా అంజీరాలను తింటుంటాం. అయితే, నానబెట్టి వేరుశెనగలు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? వేరుశనగల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని సామాన్యుడి జీడిపప్పు అని అంటుంటారు. మాములు వేరుశనగలతో పోలిస్తే, నానబెట్టిన వేరుశనగల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని అనేక వంటకాలలో వాడుతారు. దీనితో టేస్ట్ మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. దాదాపు 100 గ్రాముల వేరుశనగల నుంచి దాదాపు 567 కెలొరీల శక్తి లభిస్తుంది. అయితే, రాత్రిపూట నానబెట్టిన వేరుశనగలు ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. గుండె జబ్బుల నుంచి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ వరకు ఇవి చాలా ఉపయోగపడుతాయి. ఈ క్రమంలో రాత్రిపూట నానబెట్టిన వేరుశనగలను తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: నానబెట్టిన వేరుశనగ గింజల్లోని ఫైబర్ కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణాన్ని నివారిస్తుంది.
బరువు తగ్గడం: వేరుశనగ గింజల్లోని ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారిస్తుంది. ఇది కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
గుండె ఆరోగ్యం: నానబెట్టిన వేరుశనగల్లో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే, గుండె జబ్బులను నిరోధించే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. వాటిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
కండరాలకు ప్రయోజనకరం: ఇవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదల, మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఇవి వ్యాయామం చేసేవారికి అద్భుతమైన సహజ సప్లిమెంట్ చెప్పవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో: నానబెట్టిన వేరుశెనగలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి.
చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మెరిసే చర్మం, బలమైన జుట్టుకు దోహదం చేస్తాయి. ఇవి చర్మాన్ని దృఢంగా చేయడం ద్వారా వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి: నానబెట్టిన వేరుశెనగలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, జింక్, మెగ్నీషియం వంటివి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తాయి.


