Health Benefits Of Green Chilies:మన వంటల్లో పచ్చిమిరపకాయలు తప్పనిసరిగా వాడతాం. వంటకాలకు మసాలా రుచి ఇవ్వడమే కాకుండా ఇవి శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. తాజా పరిశోధనలు చెబుతున్న వివరాల ప్రకారం పచ్చిమిరపకాయలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కలిగి ఉన్నాయి. ఇవి రక్తనాళాల పనితీరును సరిచేయడం, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వంటి ప్రభావాలను చూపుతాయని నిపుణులు గుర్తించారు.
బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం..
పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం మిరపకాయలకు ప్రత్యేకమైన ఘాటు రుచి ఇస్తుంది. ఈ మూలకం శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తూ వాపును తగ్గిస్తుంది. వాపు తగ్గితే గుండెపై ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన రక్తప్రసరణ జరగడంలో సహాయపడుతుంది.
పేరుకుపోయే కొవ్వు..
కొన్ని శాస్త్రీయ పరిశోధనల్లో క్యాప్సైసిన్ చెడు కొలెస్ట్రాల్‌గా పిలిచే ఎల్‌డిఎల్ స్థాయిలను తగ్గిస్తుందని తేలింది. మరోవైపు, శరీరానికి మంచిగా పనిచేసే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోకుండా కాపాడే లక్షణం కూడా ఉంది. రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వు తగ్గడం వల్ల గుండెకు సంబంధించిన రుగ్మతల ముప్పు తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ..
పచ్చిమిరపకాయల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. వీటి ప్రభావం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాప్సైసిన్ కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
రక్తపోటును..
పొటాషియం పచ్చిమిరపకాయల్లో సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తపోటును సంతులనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటు గుండె సమస్యలకు దారి తీసే అవకాశం ఉన్నందున, పొటాషియం గుండె ఆరోగ్య రక్షణలో ఉపయోగకరమని చెప్పవచ్చు. అలాగే ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కలిసి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.
ఆకలి వేయకుండా…
బరువు నియంత్రణలో కూడా పచ్చిమిరపకాయలు ఉపయోగపడతాయి. ఇవి తక్కువ కేలరీలతో పాటు అధిక ఫైబర్ కలిగి ఉండటంతో, తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన అనుభూతి ఇస్తాయి. ఇది అధికంగా తినే అలవాటును తగ్గించి బరువును నియంత్రించడంలో సహకరిస్తుంది.
కడుపులో మంట, ఎసిడిటీ..
పచ్చిమిరపకాయలను మితంగా తీసుకోవడం శరీరానికి మంచిదే కానీ, ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అధికంగా తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, పుండ్లు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సమతుల్య పరిమాణంలో మాత్రమే ఆహారంలో వాడడం ఉత్తమం.


