Saturday, November 15, 2025
Homeహెల్త్Mulberry : బొంత పండ్లతో బేఫికర్ ఆరోగ్యం - మార్కెట్‌లో కనిపిస్తే వదలొద్దు!

Mulberry : బొంత పండ్లతో బేఫికర్ ఆరోగ్యం – మార్కెట్‌లో కనిపిస్తే వదలొద్దు!

Health benefits of mulberry fruits : చూడటానికి నల్లగా, చిన్నగా ఉండే ఈ పండ్లను చాలామంది అంతగా పట్టించుకోరు. వీటినే బొంత పండ్లు లేదా మల్బరీలు అని అంటారు. కానీ చూడటానికి చిన్నగా ఉన్నా, ఇవి చేసే మేలు మాత్రం కొండంత. పోషకాల గనులైన ఈ పండ్లను మార్కెట్‌లో చూస్తే అస్సలు వదిలిపెట్టవద్దని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. అసలు ఈ పండ్లలో ఏముంది? వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? నిపుణులు ఏమంటున్నారు?

- Advertisement -

పులుపు, తీపి కలగలిసిన రుచితో ఉండే మల్బరీ పండ్లు కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదు, ఆరోగ్యానికి ఓ వరం లాంటివి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఉద్యాన శాస్త్రవేత్త పిడిగం సైదయ్య వివరిస్తున్నారు.

మల్బరీతో ఆరోగ్య ప్రయోజనాలివే..
డయాబెటిస్‌కు దివ్యౌషధం: ఈ పండ్లలో ఉండే డీఎన్‌జే (1-డియోక్సినోజిరిమైసిన్) అనే ప్రత్యేక సమ్మేళనం రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మధుమేహంతో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

గుండెకు రక్షణ: మల్బరీలలో ఉండే పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును (బీపీ) అదుపులో ఉంచుతుంది. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది: ఈ పండ్లలో ఆంథోసయనిన్‌లు, రెస్వరెట్రాల్ వంటి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ముఖ్యంగా పెద్దపేగు, చర్మ, ప్రొస్టేట్ క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయి.

రోగనిరోధక శక్తికి బూస్ట్: విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల మల్బరీలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడతాయి.

ఎముకల పటుత్వానికి: వీటిలో ఉండే విటమిన్-కె, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపొరోసిస్) వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.

కీళ్ల నొప్పులకు ఉపశమనం: ఈ ఫలాల్లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి.

ఒకప్పుడు పట్టుపురుగులకు.. ఇప్పుడు మన ఆరోగ్యానికి: గతంలో రైతులు కేవలం పట్టు పురుగుల పెంపకం కోసం, వాటి ఆకులను మేతగా వేయడానికే మల్బరీ చెట్లను పెంచేవారు. కానీ, ఈ పండ్లలోని అద్భుతమైన పోషక విలువల గురించి అవగాహన పెరగడంతో, ఇప్పుడు పండ్ల కోసమే ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే దాదాపు 800 ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని సైదయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా మల్బరీ తోటలు విస్తరిస్తున్నాయి. ఈ పండ్లు ఇప్పుడు దాదాపు అన్ని కాలాల్లోనూ సూపర్ మార్కెట్లు, మాల్స్‌తో పాటు ఆన్‌లైన్ ఇ-కామర్స్ వేదికల్లోనూ లభిస్తున్నాయి.

ఆరోగ్యకరమైన జీవనానికి పౌష్టికాహారమే మూలం. మన చుట్టూ దొరికే ఇలాంటి పోషకాలు పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad