Nela Usiri benefits:మన చుట్టూ కనిపించే ప్రకృతిలో అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు సుపరిచితం కాగా చాలా మొక్కల విలువ మన దృష్టికి రాదు. అలాంటి మొక్కలలో నేల ఉసిరి ఒకటి. ఇది మన ఇళ్ల చుట్టూ కనిపించినా చాలామంది దీని ప్రత్యేకతను గుర్తించరు. ఆయుర్వేద వైద్య విధానంలో అయితే ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించే శక్తి దీనిలో ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నేల ఉసిరి..
నేల ఉసిరి సాధారణంగా నేల మీదే పెరుగుతుంది. ఇది ఎక్కువ ఎత్తుకు ఎదగదు. సుమారు ఒక అడుగు ఎత్తు వరకు మాత్రమే పెరిగే ఈ మొక్క ఆకులు మరియు కాయలు ఉసిరికాయను పోలి ఉంటాయి. అందుకే దీనికి నేల ఉసిరి అనే పేరు వచ్చింది. సంస్కృతంలో దీనిని భూమి ఆమ్లా అని పిలుస్తారు. ఎక్కువగా ఆకులు కాయలు ఉండటం వల్ల బహుపత్ర బహుఫల అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఏడాది పొడవునా దాదాపు అన్ని ప్రాంతాల్లో సహజంగా లభిస్తుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/is-frozen-chicken-safe-for-health-facts-you-should-know/
వైరస్ కారణంగా …
ప్రపంచవ్యాప్తంగా నేల ఉసిరిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల్లో కొన్ని వ్యాధులపై ఇది మంచి ప్రభావం చూపుతుందని స్పష్టమైంది. ముఖ్యంగా వైరస్ కారణంగా వచ్చే సమస్యలను నియంత్రించడంలో నేల ఉసిరి ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హెపటైటిస్ ఎ బి సి వంటి వైరస్ వల్ల కలిగే పచ్చకామెర్లు సమస్యలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే హెర్పస్, హెచ్ ఐవి వంటి వైరల్ సమస్యలలో సహాయకంగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
పచ్చకామెర్లు అంటే..
పచ్చకామెర్లు అంటే కాలేయానికి సంబంధించిన సమస్య. రక్తంలో బిల్లురుబిన్ స్థాయి పెరగడం వల్ల కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారుతాయి. ఈ సమస్యను తగ్గించడంలో నేల ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా రక్తంలోని బిల్లురుబిన్ స్థాయిని క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో కాలేయం బలపడుతుంది మరియు శరీరం వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది.
చర్మ సమస్యల..
చర్మ సమస్యల విషయంలో కూడా నేల ఉసిరి ఉపయోగకరంగా ఉంటుంది. గజ్జి తామర దురద వంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీనిని బాహ్యంగా ఉపయోగించే విధానాలు ఉన్నాయి. సరైన విధంగా ఉపయోగించినప్పుడు చర్మంపై ఉన్న ఇన్ఫెక్షన్లు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. చర్మం శుభ్రంగా ఉండటానికి కూడా నేల ఉసిరి తోడ్పడుతుంది.
మలబద్ధకం..
మలబద్ధకం సమస్య ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతోంది. జీవనశైలి మార్పులు ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య ఎక్కువవుతోంది. నేల ఉసిరి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల కదలికలను మెరుగుపరచి మల విసర్జన సులభంగా జరిగేలా చేస్తుంది. ఖర్చు ఎక్కువ కాకుండా సహజంగా ఈ సమస్యకు ఉపశమనం పొందేందుకు ఆయుర్వేద నిపుణులు నేల ఉసిరిని సూచిస్తారు.
నేల ఉసిరిని వినియోగించడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తశుద్ధి వల్ల చర్మం మెరుగు పడుతుంది మరియు జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. పరోక్షంగా ఇది గుండెకు సంబంధించిన సమస్యలు రక్తనాళాల లోపాలు మరియు మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా సహాయపడుతుందని ఆయుర్వేదం పేర్కొంటుంది. సాధారణంగా మోషన్ సమస్యలు ఉన్నవారు కూడా రక్తశుద్ధి కోసం దీనిని ఉపయోగిస్తారు.
నేల ఉసిరిని తీసుకునే విధానాలు కూడా ఉన్నాయి. కొందరు దీనిని రసంగా తయారు చేసి తీసుకుంటారు. మరికొందరు పెరుగు లేదా బెల్లంతో కలిపి వినియోగిస్తారు. అలాగే నేల ఉసిరిని ఎండబెట్టి పొడిగా చేసి నీటితో కలిపి తాగడం కూడా ఒక విధానం. అయితే ఏ విధంగా తీసుకోవాలన్నది వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంది.
Also Read:https://teluguprabha.net/health-fitness/fiber-rich-foods-improve-gut-health-and-digestion-naturally/
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ నేల ఉసిరిని ఇష్టానుసారంగా వాడటం సరైంది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేక సాధారణ ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించాలన్నా ముందుగా వైద్య నిపుణులను లేదా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సరైన మోతాదు సరైన విధానం పాటించినప్పుడే దీనివల్ల పూర్తి ప్రయోజనం పొందగలమని చెబుతున్నారు.

