Tea Vs Health: ఏయ్ ఛాయ్ ఛమక్కులే చూడారా భాయి..ఏయ్ ఛాయ్ చటుక్కున తాగురా భాయ్ ..అంటూ సినీ హీరోలు సైతం ఛాయ్ గురించే పొగిడిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా మంది లేవడంతోనే టీ తోనే మొదలు పెడతారు.నిద్రలేవగానే ఒక కప్పు టీ తాగకపోతే రోజు సరిగా మొదలవదని అనుకునే వారు చాలా మందే ఉన్నారు. ఉదయం పనుల ముందు, ఆఫీసు విరామాల్లో, సాయంత్రం స్నాక్స్‌తో పాటు లేదా స్నేహితులతో కూర్చుని మాట్లాడుకునే సమయంలో కూడా టీ తాగే అలవాటు విస్తారంగా ఉంది. ఇలా రోజుకు మూడు నాలుగు కప్పుల టీ తాగడం చాలామందికి దినచర్యగా మారింది. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, టీని పూర్తిగా మానేస్తే శరీరంలో గణనీయమైన మార్పులు జరుగుతాయి.
నెల పాటు టీని మానేస్తే…
పాలలో విటమిన్ D, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నప్పటికీ, టీ ఆకులు నీటితో కలిపి వాటికి పాలను జోడిస్తే కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయి. ఇందులో ఉండే టానిన్, కెఫిన్ కలయిక శరీరానికి అనుకూలం కాకపోవచ్చు. అదనంగా, టీకి ఎక్కువగా చక్కెర కలపడం శరీరానికి మరింత భారం అవుతుంది. అందుకే, ఒక నెల పాటు టీని మానేస్తే శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించడం అవసరం.
తలనొప్పి, అలసట, చిరాకు..
టీ ద్వారా కెఫిన్ శరీరానికి చేరుతుంది. ఇది సహజ ఉద్దీపక పదార్థం. కాఫీ, టీ వంటి పానీయాల ద్వారా ఇది ఎక్కువగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే ఆందోళన, కడుపు అసౌకర్యం, చిరాకు వంటి సమస్యలు తలెత్తవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీ తాగడం ఆపిన మొదటి రోజుల్లోనే శరీరం మార్పులు చూపిస్తుంది. మొదట తలనొప్పి, అలసట, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. దృష్టి కేంద్రీకరించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ కొంత కాలం గడిచాక శరీరం కొత్త శైలికి అలవాటు పడుతుంది.
నిద్ర నాణ్యత…
కెఫిన్ అధికంగా తీసుకోవడం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. టీని ఒక నెల పాటు మానేస్తే రాత్రిపూట మంచి నిద్ర పడటం మొదలవుతుంది. ఉదయం లేవగానే శరీరం చురుకుగా అనిపిస్తుంది. కెఫిన్ తాత్కాలికంగా బద్ధకాన్ని తొలగించినట్టు అనిపించినా, దీని అధిక వాడకం శరీరాన్ని డీహైడ్రేట్ చేసి అలసటకు కారణమవుతుంది.
జీర్ణక్రియ…
టీని ఎక్కువగా తాగే అలవాటు జీర్ణక్రియపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా శోషించబడకపోవడం వల్ల ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. ఒక నెల పాటు టీని మానేస్తే జీర్ణక్రియలో తేలిక అనిపించి కడుపు సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడంలో…
బరువు తగ్గడంలో కూడా టీ మానడం సహాయపడుతుంది. పాలు, చక్కెర కలయికలో అధిక కేలరీలు ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. రోజుకు అనేక కప్పులు టీ తాగడం ద్వారా అధిక చక్కెర శరీరంలో చేరి కొవ్వు పేరుకుపోతుంది. టీ మానడం వల్ల ఈ అదనపు కేలరీలు తగ్గిపోతాయి.
Also Read: https://teluguprabha.net/lifestyle/monsoon-health-tips-with-herbal-teas-and-diet-precautions/
కెఫిన్‌ను పూర్తిగా మానేస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. రక్తపోటు స్థిరంగా ఉండడం, హార్మోన్ల సమతుల్యత మెరుగుపడడం, దంత ఆరోగ్యం బాగుపడడం, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సులభంగా గ్రహించబడడం వంటి ప్రయోజనాలు అందుతాయి. ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తలనొప్పులు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా మారుతుంది.


