Saturday, November 15, 2025
Homeహెల్త్Cancer Daycare Centres in all Districts: అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డేకేర్ సెంటర్లు

Cancer Daycare Centres in all Districts: అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డేకేర్ సెంటర్లు

Damodara Rajanarsimha: వైద్యారోగ్య రంగంలో రాష్ర్ట ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని, క్యాన్సర్ చికిత్సను ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో నిర్ధారణకు ఆలస్యం కావడం, చికిత్స అందడంలో జాప్యం జరగడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు తావులేకుండా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో క్యాన్సర్ నిర్ములన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి సలహాదారుగా ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయును నియమించినట్లు స్పష్టం చేశారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్లలో స్క్రీనింగ్ పరీక్షలు, రేడియేషన్ పాజిటివ్ కేర్ లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలను సైతం అందుబాటులోకి తెనున్నట్లు వివరించారు. వైద్య నిపుణులు గ్రామాల్లోకి వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే వీలుంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిమ్స్, ఎంజీఎం ఆస్పత్రుల్లో 80 పడకల క్యాన్సర్ ప్రత్యేక విభాగాలు కొనసాగుతున్నాయని.., త్వరలో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రేడియేషన్ బంకర్లతో కూడిన క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణకు ఒప్పందం!
రాష్ట్రంలో ఏటా 3 వేల మంది నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మంత్రి దామోదర చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 బీఎస్సీ నర్సింగ్ కళాశాలల్లో 183 జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలు పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,76,000 మంది రిజిస్టర్డ్ నర్సులు ఉండగా, ప్రభుత్వ దవాఖానల్లో 18 వేల మందికిపైగా నర్సింగ్ అధికారులు పనిచేస్తున్నారన్నారు. ఈ ఏడాది 2,322 నర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం 16 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు స్థాపించిందని.., ఒక్కొక్కటి 60 మంది విద్యార్థులను చేర్చుకునే సామర్థ్యంతో.. మొత్తం 960 సీట్లు ఉన్నాయన్నారు. ఖమ్మం, మధిరలకు 60 సీట్లతో కొత్త నర్సింగ్ కళాశాల ప్రతిపాదనలు చేయబడ్డాయన్నారు. నర్సింగ్ సంఘం దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చడానికి, ప్రభుత్వం నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలైన జర్మన్, ఇంగ్లీష్ భాషలతో సహా విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో వైద్య, ఆరోగ్యశాఖ ఒప్పందం (ఎంఓయూ) చేసుకుందన్నారు. ఈ ఒప్పందంతో నర్సింగ్ శిక్షణతోపాటు విదేశీ భాషలపై పట్టు సాధించేలా ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అధ్యాపకులు విదేశీ భాషపై శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర కుమార్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ పి.ప్రావిణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, అదనపు కలెక్టర్, అధ్యాపకులు, జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad