Health News: దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి.. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యుల వద్ద చెకప్ చేయించుకోగా.. ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ విశాల్ గబాలే బాధిత వ్యక్తిని పరిశీలించి షాకయ్యారు. శరీరంలోని రక్తంతో పాటు ఇతర నమూనాలు పరిశీలించిన ఆయన.. లెడ్ పాయిజనింగ్ అయ్యిందని డాక్టర్ గుర్తించారు. అయితే అనారోగ్య బాధితుడిలో మెమోరీ లాస్, తీవ్రమైన కాళ్ల నొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లు గమనించారు. ఇదంతా లెడ్ కెమికల్ టాక్సిసిటీ కారణమని డాక్టర్ తెలిపారు.
బాధిత రోగిని డాక్టర్ పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించినపుడు అన్ని ఫలితాలు సాధారణంగానే కనిపించాయి. అయితే హెవీ మెటల్ స్క్రీనింగ్ టెస్ట్‌లో రోగి ఒంట్లో లెడ్ పాయిజనింగ్ అయినట్లు నిర్ధారణ అయ్యింది. అతడి శరీరంలో డెసీలీటర్ కు 22 మెక్రోగ్రాముల చొప్పున పేరుకొన్నట్లు వైద్యుడు స్పష్టం చేశారు. లెడ్ పాయిజనింగ్ కారణంగా శరీరంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఆ తర్వాత మెదడు, మూత్రపిండాలు దెబ్బతిని ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇదే విషయమై రోగి భార్యని వైద్యులు విచారించగా లెడ్ పాయిజనింగ్ కు గల కారణాలు బయటపడ్డాయని డాక్టర్ విశాల్ గబాలే స్పష్టం చేశారు. గత 20 ఏళ్ల నుంచి రోగి భార్య ప్రెషర్ కుక్కర్‌లోనే వంట చేస్తునట్లు ఆమె తెలిపింది. పాతవి లేదా పాడైన అల్యూమినియం కుక్కర్‌లలో సీసం, అల్యూమినియం కణాలు వండే ఆహారంలో కలిసిపోతున్నాయని.. ఆ కారణంగా లెడ్ పాయిజనింగ్ అవుతోందని డాక్టర్ వెల్లడించారు. ఇది శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి నెమ్మదిగా మెదడుని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు.
లెడ్ పాయిజనింగ్ వల్ల కలిగే లక్షణాలు ఇవే..
1. కడుపు తిమ్మిరిగా ఉండడం
2. హైపర్ యాక్టివిటీ
3. తలనొప్పి
4. వాంతులు
5. వికారంగా ఉండడం
6. అనిమీయా
7. కాళ్లు, పాదాల్లో వణుకు
8. శృంగార సామర్థ్యాన్ని కోల్పోవడం
9.వ్యంధ్యత్వ సమస్యలు
10. మూత్రపిండాల సమస్యలు


