Bitter Guard Seeds Side Effects: కాకరకాయ పేరు వినగానే చాలామందికి చేదే గుర్తుకు వస్తుంది. ఈ కూరను ఇష్టపడని వారు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాల వల్ల చాలామంది దీన్ని ఆహారంలో చేర్చుకుంటారు. కాకరకాయలో ఉన్న పోషకాలు శరీరానికి ఉపయోగకరమే అయినా, దానిలోని గింజల విషయం మాత్రం వేరే జాగ్రత్తలు కూడా చాలా అవసరం. ఎందుకంటే గింజలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయ గింజల్లో..
కాకరకాయ గింజల్లో మోమోర్డిసిన్, లెక్టిన్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తక్కువ మోతాదులో హానికరం కాకపోయినా, ఎక్కువగా తీసుకున్నప్పుడు విషపూరిత ప్రభావం చూపే అవకాశం ఉంది. గింజలను అధికంగా తింటే కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలో బలహీనత, తల తిరుగుడు, అలసట కూడా వస్తాయి. తీవ్ర స్థాయిలో తీసుకుంటే కాలేయంపై ప్రభావం చూపి కళ్ళు, మూత్రం పసుపు రంగులోకి మారే పరిస్థితులు ఎదురవుతాయి.
గర్భిణీ స్త్రీలు..
ఈ గింజలు ప్రతి ఒక్కరికీ సమానంగా హాని చేయవు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం వీటిని పూర్తిగా దూరంగా పెట్టుకోవాలి. గింజల్లో ఉన్న పదార్థాలు గర్భాశయంలో సంకోచాలను పెంచి గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలకు కూడా ఈ గింజలు సురక్షితం కావు. చిన్నారుల జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండటంతో వాంతులు, కడుపు నొప్పి వంటి ఇబ్బందులు తక్షణమే రావచ్చు. అందువల్ల వీరు కాకరకాయ గింజలను తినకపోవడమే మంచిది.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-tips-for-placing-tv-and-computer-at-home/
మధుమేహంతో బాధపడేవారు..
మధుమేహంతో బాధపడేవారు కాకరకాయను తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు అనేది తెలిసిన విషయమే. కానీ దాని గింజలు ఈ ప్రభావాన్ని మరింత పెంచుతాయి. ఇప్పటికే షుగర్ మందులు వాడుతున్న వారు గింజలను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవచ్చు. దీనిని హైపోగ్లైసీమియా అంటారు. ఈ పరిస్థితి శరీరానికి ప్రమాదకరంగా మారి ప్రాణాంతక స్థాయికి చేరే అవకాశముంది. కాబట్టి మధుమేహ రోగులు గింజల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.
అయితే ప్రతి గింజ ప్రమాదకరం అని అనుకోవాల్సిన అవసరం లేదు. వంటలో కూరలో పడిపోయిన రెండు మూడు లేత గింజలు తిన్నా పెద్ద సమస్య ఉండదు. కానీ ముదిరిన గింజలు, గట్టిగా ఉండేవి లేదా పచ్చిగా ఉన్న గింజలను ఎక్కువగా తినకూడదు. అవి శరీరానికి మేలు చేయకుండా ముప్పు కలిగించే అవకాశమే ఎక్కువ.


