ToorDal VS Health:భారతీయ వంటగదుల్లో ఎక్కువగా ఉపయోగించే పప్పులలో కందిపప్పు ఒకటి. టమాటా పప్పు, ఆకుకూర పప్పు, సాంబార్ వంటి వంటకాలలో కందిపప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అన్నం, రోటీలు, చపాతీలతో కలిపేసి ఎలా తిన్నా రుచిగా ఉంటుంది. కందిపప్పు రుచితో పాటు పోషకాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సోడియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినీ, పోషణనూ అందిస్తాయి. కానీ ఇది అందరికీ కాదు. కొందరి ఆరోగ్య పరిస్థితులలో కందిపప్పు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కందిపప్పును జాగ్రత్తగా వాడాలి. కారణం ఇందులో ఉండే పొటాషియం అధిక స్థాయిలో ఉండటం. ఆరోగ్యకరమైన కిడ్నీలు ఈ పొటాషియంను ఫిల్టర్ చేయగలిగినా, కిడ్నీ సమస్యలున్నవారిలో ఈ ప్రక్రియ సరిగా జరగదు. దీంతో కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు కూడా మితంగా మాత్రమే తీసుకోవాలి.
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు కూడా కందిపప్పును దూరంగా ఉంచాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు, కాళ్లు మరియు చేతుల్లో అసహనకరమైన నొప్పి ఉత్పన్నమవుతుంది. కందిపప్పులో ప్రోటీన్ అధికంగా ఉండటంతో, ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆర్థరైటిస్ లేదా కీళ్ల సంబంధిత సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది పెద్దగా అనుకూలం కాదు. ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ సమస్యలు ఉన్నవారు కందిపప్పు తింటే సమస్యలు పెరుగుతాయి. కందిపప్పు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇది మరింత భారమవుతుంది. తిన్న తర్వాత కడుపు నొప్పి, ఉబ్బరం, పుల్లని రసం రావడం వంటి సమస్యలు మరింత స్పష్టమవుతాయి.
Also Read: https://teluguprabha.net/lifestyle/how-to-make-temple-style-coconut-rice-at-home/
పైల్స్ ఉన్నవారికి కూడా కందిపప్పు సమస్యకారకం కావచ్చు. అధిక ప్రోటీన్ ఉండటంతో ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీని ఫలితంగా మలబద్ధకం ఏర్పడి, విసర్జన సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పైల్స్ సమస్యను మరింత కష్టతరం చేస్తుంది. వాపు, రక్తస్రావం వంటి ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి.
అలెర్జీ సమస్యలున్నవారు కందిపప్పు తినేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. రాత్రి పూట తింటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందులో ఉండే ప్రోటీన్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు కొందరికి జీర్ణం కావడంలో కష్టం కలిగిస్తాయి. అలెర్జీ ఉన్నవారిలో చర్మంపై దద్దుర్లు, మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా కందిపప్పు అధికంగా తినడం మంచిది కాదు. ఏ ఆహారమైనా మితంగా తీసుకోవడం శ్రేయస్కరం. ఎక్కువగా తీసుకుంటే శరీరానికి ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది.
కందిపప్పును వండే ముందు బాగా కడగడం, కొంతసేపు నీటిలో నానబెట్టడం చాలా ముఖ్యం. నానబెట్టిన తర్వాత వండితే పప్పు బాగా ఉడికిపోతుంది. ఈ విధానం జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానని లేదా సరిగ్గా ఉడకని పప్పు తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.


