ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామంది హార్ట్ ఎటాక్స్‌తో చనిపోతున్నారు. లో డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) అని పిలిచే చెడు కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. LDL స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ధమనులలో పూడికలు ఏర్పడి, గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. LDL స్థాయిలను తగ్గించుకుంటే అన్ని సమస్యల ముప్పు తగ్గించుకోవచ్చు. తాజాగా సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్‌లో కార్డియాక్ సైన్సెస్, కార్డియాలజీకి ఛైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ సింగ్ చెడు కొలెస్ట్రాల్ ప్రమాదాల గురించి వివరించారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడుతూ చెడు కొలెస్ట్రాల్ ఎంత తగ్గించుకుంటే మంచిదో చెప్పారు.
చెడు కొలెస్ట్రాల్ మన రక్తనాళాల నుంచి కొవ్వును క్యారీ చేస్తుంది. ఇది అతిగా ఉంటే, రక్త నాళాల గోడలకు అంటుకుని, ఫలకం (plaque) ఏర్పడుతుంది. దీని కారణంగా రక్తనాళాలు మూసుకుపోయి, గుండెకు రక్తం సరిగ్గా అందదు. భారతీయుల విషయానికి వస్తే, మన జన్యువుల కారణంగా ఇతర దేశాల వారి కంటే త్వరగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. మన శరీరంలో ఉన్న LDL ఇతరుల కంటే చాలా త్వరగా ఆక్సీకరణం చెందుతుంది. దీంతో రక్తనాళాల గోడలు త్వరగా గట్టిపడతాయి. అలానే, మన శరీరంలో Lp(a) అనే మరో రకమైన LDL కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ Lp(a) బ్లడ్ క్లాట్స్ త్వరగా ఏర్పడడానికి దారితీస్తుంది, ఈ రకమైన కొవ్వు కారణంగా ఆల్రెడీ రక్తనాళాలలోని ఏర్పడిన ఫలకం అంత త్వరగా విచ్ఛిన్నం కాదు.
రక్తనాళాల్లో కొవ్వు కారణంగా పేరుకుపోయిన ఫలకం బ్రేక్ అయితే, అక్కడ చిన్న గాయం అవుతుంది. దీనివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరగకుండా శరీరం వెంటనే అక్కడ రక్తాన్ని గడ్డ కట్టించడం ప్రారంభిస్తుంది. అలానే ఫలకం వల్ల ఒత్తిడి ఎక్కువై రక్తనాళాలు చిట్లిపోయినా, శరీరం రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇలా ఏర్పడే బ్లడ్ క్లాట్స్ ఫలకాన్ని మరింత పెద్దది చేసి, గుండెకు రక్తం చేరకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
LDL లెవెల్ ఎంత ఉండాలి: సాధారణంగా, బ్లడ్‌లో LDL స్థాయిలు 70 mg/dL కంటే తక్కువగా ఉంటే మంచిదని అంటారు. కానీ, భారతీయుల విషయానికి వస్తే, LDL స్థాయిలు 50 mg/dL కంటే తక్కువగా ఉండటం చాలా మంచిది. దీన్ని 30 mg/dL కి తగ్గించగలిగితే మరింత మంచిది. అధ్యయనాల ప్రకారం, LDL స్థాయిలు ఇంత తక్కువగా మెయింటైన్ చేస్తే గుండెపోటు, స్ట్రోక్, మరణం వంటి ప్రమాదాలను 20-25% వరకు తగ్గించవచ్చు. మహిళల విషయానికి వస్తే, వయసు పెరిగే కొద్దీ, మెనోపాజ్ తర్వాత వారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే, మహిళలు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను నిరంతరం పరిశీలించుకోవడం మంచిది.
చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలి: గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోవడానికి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లేదా LDL స్థాయిలను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనం ముందుగా, మన శరీరంలో Lp(a) రకం కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవడానికి Lp(a) టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్ష సాధారణంగా చేసే పరీక్ష కాదు కాబట్టి, డాక్టర్‌ను అడిగి ఈ పరీక్ష చేయించుకోవాలి. అలానే మెడిసిన్స్ వాడొచ్చు. ఉదాహరణకు స్టాటిన్స్ అనే మందులు కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ తయారవడాన్ని తగ్గిస్తాయి. అలానే ఎజెటిమిబ్ (Ezetimibe) లేదా PCSK9 ఇన్హిబిటర్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించగలవు. ఇక గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం తప్పనిసరి. రక్తంలో చాలా తక్కువ చెడు కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.