Heart Attack: ఆరోగ్యంగా ఉన్న యువత కూడా ప్రస్తుతం హఠాత్తుగా గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇలాంటి సడెన్ డెత్‌ను ముందే పసిగట్టి, ప్రాణాలను కాపాడేందుకు అమెరికాకు చెందిన పరిశోధకులు ఓ విప్లవాత్మక కృత్రిమ మేధ (AI) మోడల్‌ను ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం వాడుతున్న వైద్య మార్గదర్శకాల కన్నా ఇది ఎంతో కచ్చితమైన ఫలితాలను అందిస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో వైద్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తుత్తున్నాయి.
అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించిన ఈ AI సిస్టమ్‌కు ‘మార్స్’ (MAARS -మల్టీమోడల్ AI ఫర్ వెంట్రికులర్ Arrhythmia Risk Stratification) అని పేరు పెట్టారు. ఇది కార్డియాక్ ఎంఆర్‌ఐ చిత్రాలతో పాటు రోగి ఆరోగ్య రికార్డులను సమగ్రంగా విశ్లేషించి.. గుండెకు సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలను ముందే గుర్తిస్తుంది. అతి ముఖ్యంగా వైద్యులకు సైతం గుర్తించడం కష్టతరంగా మారిన గుండె కండరాల మచ్చల (స్కారింగ్) నమూనాలను డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో విశ్లేషణ చేస్తుంది.
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలన్నీ ‘నేచర్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జన్యుపరంగా వచ్చే ‘హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అనే గుండె జబ్బు ఉన్నవాళ్లపై ఈ పరిశోధన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో అనుసరిస్తున్న వైద్య మార్గదర్శకాలతో గుండెకు సంబంధించిన ప్రమాదాన్ని అంచనా వేయడంలో కచ్చితత్వం కేవలం 50 శాతంగా ఉంది. అయితే ‘మార్స్’ (MAARS) మోడల్ ఏకంగా 89 శాతం కచ్చితత్వంతో నిరూపించింది. 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ ఫలితాల కచ్చితత్వం 93 శాతంగా ఉండటం విశేషం. ఈ మోడల్‌ను మరింత మందిపై పరీక్షించి.. ఇతర గుండె జబ్బులకు కూడా ఈ మోడల్ విస్తరించాలని పరిశోధకులు యోచిస్తున్నారు.