Heart Attack Vs Women: గుండెపోటు ఒకప్పుడు ఎక్కువగా వృద్ధుల సమస్యగా పరిగణించేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, పనిలో ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల అన్ని వయసుల వారిలోనూ ఈ ప్రాణాంతక సమస్య కనిపిస్తోంది. ఇప్పుడు పెద్దవాళ్లతో పాటు యువకులు, యవతులు మాత్రమే కాకుండా స్కూలుకెళ్లే పిల్లల్లో కూడా గుండె సమస్యలు వెలుగుచూస్తున్నాయి. చిన్నారుల్లోనూ గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మహిళల్లో ఈ సమస్య..
ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య వేరే విధంగా కనిపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మ్యాక్స్ హాస్పిటల్ వైస్ చైర్మన్, కార్డియాలజీ విభాగ అధిపతి డాక్టర్ నవీన్ భమ్రి తెలిపిన వివరాల ప్రకారం మహిళల్లో గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉంటాయి. చాలాసార్లు ఇవి సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఛాతీలో తీవ్రమైన నొప్పి..
పురుషులకీ, మహిళలకీ గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉండటం ప్రధాన లక్షణం. కానీ మహిళల్లో అదనంగా కనిపించే అనేక సూచనలను గుర్తించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, చిన్న చిన్న పనులు చేసినప్పటికీ ఎక్కువగా అలసిపోవడం, ఛాతీ నొప్పితో పాటు అసౌకర్యం కలగడం, వికారం లేదా వాంతులు రావడం, శ్వాస ఆడకపోవడం, మెడ, భుజం, వెన్ను లేదా పొత్తికడుపు పైభాగంలో నొప్పి అనుభవించడం, తల తిరగడం లేదా ఒక్కసారిగా మైకం వచ్చినట్టు అనిపించడం వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా ఉంటాయి.
గుండెపోటు తీవ్రత..
ఇలాంటి లక్షణాలు ఎదురైనప్పుడు చాలా మంది మహిళలు దీన్ని అలసటగా లేదా విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల జరిగిందని భావిస్తారు. ఫలితంగా ఆసుపత్రికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతుంది. ఆ సమయాన్ని కోల్పోవడం వల్ల గుండెపోటు తీవ్రత పెరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశం అధికమవుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో అవగాహన అత్యంత అవసరం. చిన్న లక్షణం కనిపించినా వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చని వారు చెబుతున్నారు.
గుండెపోటు సమస్యను…
నిపుణులు చెబుతున్నదాని ప్రకారం గుండెపోటు సమస్యను ముందుగానే గుర్తించడంలో అవగాహన లేకపోవడమే ఎక్కువ ప్రాణనష్టానికి కారణమవుతోంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే అదనపు సూచనలను నిర్లక్ష్యం చేయకపోతే అనేక ప్రాణాలను రక్షించవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ అలసట, వాంతులు, ఛాతీ అసౌకర్యం లాంటి లక్షణాలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
జీవనశైలి మార్పులు…
ఇక గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి జీవనశైలి మార్పులు తప్పనిసరిగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం అరగంట శారీరక వ్యాయామం చేయడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించే అలవాట్లు అలవరచుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు. అలాగే పొగ త్రాగడం, మద్యపానం వంటి అలవాట్లు గుండెకు తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.
మహిళల్లో గుండెపోటు లక్షణాలను స్పష్టంగా గుర్తించడం ద్వారా సమయానికి చికిత్స అందిస్తే ప్రాణాలను రక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఈ విషయంపై అవగాహన కలిగి ఉండడం అవసరం. ఎందుకంటే మహిళలు సాధారణంగా తమ ఆరోగ్య సమస్యలను తేలికగా తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రతి చిన్న లక్షణాన్ని సీరియస్‌గా తీసుకుని డాక్టర్ని సంప్రదించడం ద్వారా ఈ ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొనవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


