వరంగల్ ప్రతినిధి (తెలుగుప్రభ): మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లే. కొన్ని ఏండ్ల క్రితం వరకు గుండె సమస్యలు ఎక్కువగా వృద్ధుల్లోనే కనిపించేవి. కానీ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు, కార్డియాక్ అరెస్టులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధిక మరణాలు గుండె సంబంధిత వ్యాధులతో జరుగుతూ ఉండటం గమనర్హం. ఈ నేపథ్యంలో హృదయ సమస్యలు, కార్డియాక్ అరెస్టులపై ముందస్తు అవగాహన కలిగి ఉంటే గుండెకు ఎదురయ్యే గండాలను దాటొచ్చని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా, యుక్తవయసు వారిలోనూ హార్ట్ఎటాక్లు వస్తున్నాయి. మరికొందరిలో వారసత్వంగా కార్దియాక్ అరెస్ట్‌లు సంభవిస్తున్నాయి.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా హృద్రోగ సమస్యలకు కారణం అవుతుందటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ హార్ట్ డే’ (ప్రపంచ గుండె దినోత్సవం)ను జరుపుపుతుండటం విశేషం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కార్డియాక్ అరెస్ట్ లు, హృద్రోగ సమస్యలు, సీపీఆర్(గుండె పోటుకు గురైనప్పుడు చేపట్టాల్సిన ప్రథమ చికిత్స) పై అవగాహన కల్పిస్తుండటం విశేషం. నెవర్ మిస్ ఏ బీట్(గుండె చప్పుడును కోల్పోవద్దు) అనే థీమ్‌తో ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డేను నిర్వహిస్తుండటం గమనార్హం.
అవగాహన లోపం.. ఒత్తిడి..
గతంలో 18 నుంచి 20ఏండ్ల మధ్య వయసు వారిలో గుండె జబ్బులు అరుదుగా కనిపిస్తుండేవి. కానీ ఇటీవల కాలంలో 18 ఏళ్ల వ్యక్తుల్లోను గుండె జబ్బులు కనిపిస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. మహిళల్లోనూ ఎక్కువగా హృద్రోగ సమస్యలు బయటపడుతుండటం గమనార్హం. ఫాస్ట్ ఫుడ్, ఆహారపు అలవాట్ల కారణంగా వారు ఎక్కువగా గుండెజబ్బుల బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడిలో ప్రభావం వార్షికంగా వచ్చేటువంటి సమస్యల పట్ల అవగాహన లేకపోవడం కారణంగా కార్డియాక్ సమస్యలు పెరుగుతున్నాయి ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం యువతలో ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో డాక్టర్లు సలహా లేకుండా మందులు వాడటం లాంటివి కూడా లాంటివి కూడా గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి. ఆరోగ్యంగానే ఉన్నాం.. తమకేమీ కాలేదు ఆరోగ్యంగానే ఉన్నామనుకునే వారిలోనూ గుండె సమస్యలు ముదిరాక బయటపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ముందస్తుగా హార్ట్ చెకప్ చేయించుకుంటే..
వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాంటివారు సంక్రమిత జబ్బుల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ముందస్తుగా హార్ట్ చెక్ అప్ చేయించుకోవాలని చెబుతున్నారు. వయసుకు తగ్గట్టుగా బిపి, ఎత్తు, బరువు, లాంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. షుగర్, బీపీలు ఉన్నవారు వాటిని నార్మల్ పరిస్థితులకు తెచ్చుకోవాలని పేర్కొంటున్నారు. రెగ్యులర్‌గా చెక్ అప్ చేసుకోకపోతే నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులైన వైద్యులను సంప్రదించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. షుగర్, బీపీ లాంటి సమస్యలు ఉన్నవారు అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ, వైద్యుల సూచనల మేరకు మందులను జాగ్రత్తగా రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలని చెబుతున్నారు.
శాస్త్రీయత లేని సొంత చికిత్సలు చేసుకోవద్దు..
గుండెకు సంబంధించిన విషయంలో ఎటువంటి పరిశోధనలు లేనటువంటి సొంత చిట్కాలను పాటించటం మంచిది కాదు. శాస్త్రీయత లేని సొంత చికిత్సలు చేసుకోవద్దు. గుండె సమస్యలు ఉన్నప్పటికీ అది బయటపడకపోవడంతో చాలామంది దాన్ని గ్యాస్ట్రిక్ సమస్యగానే భావిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే జబ్బు ముదిరే అవకాశం ఉంటుంది. వంశపారంపరంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు ముందస్తుగా చికిత్సలు చేసుకుంటే మంచిది.
డాక్టర్ ఎండీ. షఫీ, కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, వరంగల్.

క్వాలిటీ సీపీఆర్‌పై అవగాహన అవసరం..
వయసుతో సంబంధం లేకుండానే అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టులు అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అందుకోసం అందరూ క్వాలిటీ సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి. 2001 నుంచి సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కాకతీయ మెడికల్ కాలేజీలో క్వాలిటీ సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
డాక్టర్ శ్రీనివాస్ రామక, కార్డియాలజిస్ట్, శ్రీనివాస హార్ట్ క్లినిక్. హనుమకొండ.

