Friday, November 22, 2024
Homeహెల్త్Holi : హోలీ-చర్మ రక్షణ

Holi : హోలీ-చర్మ రక్షణ

హోలీ …అదేనండి రంగుల పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగ రోజు పెద్దల, పిల్లల ఉత్సాహాన్ని పట్టడం చాలా కష్టం. అందరూ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఒళ్లు మరిచి హోలీ ఆడతారు. ఈ పండుగలో రకరకాల రంగు పొడులను ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు. రంగు నీళ్లు పోసుకుంటారు.

- Advertisement -

అయితే ఆర్గానిక్ రంగులు కలిపిన నీళ్లు అయితే చిన్నారుల చర్మానికి ప్రమాదం ఉండదు. రసాయనాలు కలిపిన రంగులు చిన్నారుల చర్మంపై ఎంతో దుష్ప్రభావం చూబిస్తాయి. కారణం చిన్నారుల చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది . దీంతో రసాయన రంగుల ప్రభావం వారి మీద ఇట్టే పడుతుంది. హోలీ కేళిలో ఇలాంటి అపశ్రుతులు దొర్లకుండా చిన్నారులు వాడే రంగుల విషయంలో జాగ్రత్త వహిస్తే వారి చర్మానికి ఏమీ కాదు. అదెలాగ అంటారా? హోలీ వేడుకల్లో చిన్నారుల ఉద్వేగాలను పట్టడం చాలా కష్టం. ఆ రోజున చిన్నారుల ఆనందానికి ఆటంకం కల్పించకుండానే వారి చర్మం విషయంలో తల్లిదండ్రులే కొన్ని ముందొస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

హోలీలో పిల్లలు వాడే రంగులపై తల్లిదండ్రులు ముఖ్యంగా ద్రుష్టిపెట్టాలి. ఎందుకంటే రసాయనాలు కలిపిన రంగులు వాడడం వల్ల పిల్లల సున్నితమైన చర్మంపై దద్దుర్లు, ఇరిటేషన్, రకరకాల ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రమాదరహితమైన ఆర్గానిక్, నేచురల్ రంగులనే తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలి. అవి పిల్లల చర్మాన్ని రక్షించే సురక్షితమైన రంగులై ఉండాలి. పూలు, మూలికల నుంచి తయారుచేసిన సహజరంగులను హోలీ వేడుకల్లో పిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్లు ఎలాంటి స్కిన్ ఎలర్జీల బారిన పడరు. అలాగే హోలీ సమయంలో పిల్లలకు వేసే దుస్తుల విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రంగుల పండుగ రోజు పిల్లలకు వేసుకోవడానికి పాతబట్టలు మాత్రమే ఇవ్వాలి. హోలీ వేడుకలు అయిన తర్వాత ఆ పాత దుస్తులను నేరుగా బయట పారేయొచ్చు.

హోలీ రోజున చిన్నారులకు లాంగ్ స్లీవ్డ్ షర్టులు, పొడవైన ప్యాంట్లు వేయాలి. వీటిని వేసుకోవడం వల్ల చర్మంపై రంగులు చిందే అవకాశం ఉండదు. అలాగే సూర్యుని నుంచి విడుదలయ్యే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల బారిన కూడా చిన్నారులు పడరు. రంగులతో ఆడే సమయంలో కళ్లకు సురక్షితమైన గాగుల్స్ గాని, సన్ గ్లాసెస్ గానీ పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రులు పెట్టాలి. కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల పిల్లల కళ్లల్లో రంగులు పడవు. కళ్లకు ప్రమాదం వాటిల్లదు. రంగులు కళ్లల్లో పడితే ఇరిటేషన్ తలెత్తుంది. కొన్ని సమయాల్లో కళ్లల్లోని కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే హోలీ రోజున పిల్లలు రంగులతో గంటల తరబడి ఆడుతుంటారు. దీంతో వీళ్లు బాగా అలసిపోయే అవకాశం ఉంది. అందుకే రంగుల వేడుకలు ప్రారంభించే ముందు, రంగు చల్లుకోవడాలు ముగిసిన తర్వాత పిల్లల చేత నీళ్లు బాగా తాగించాలి.

అలాగే పిల్లలు హోలీ వేడుకలను సురక్షిత ప్రదేశంలో ఆడుకునేలా చర్యలు తీసుకోవాలి. గార్డెన్, పార్కు లేదా సురక్షితమైన ఖాళీ ప్రదేశాలలో పిల్లలు హోలీ ఆడుకోవడానికి ఏర్పాట్లు చేయాలి. రోడ్ల మీద, జనాలు బాగా ఉన్న చోట పిల్లలు హోలీ ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రోడ్ల మీద హోలీ ఆడితే పిల్లల ప్రాణాలకు ప్రమాదం. అలాగే వాటర్ బెలూన్లతో ఆడేటప్పుడు కూడా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ బెలూన్లు ఎవరి ముఖానికైనా తగిలితే గాయాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే వాటర్ బెలూన్లను ముఖంపై కాకుండా వంటిపై మాత్రమే తగిలేలా విసురుకుంటూ ఆడడం సురక్షితం. రంగులు కలిపిన నీళ్లు చర్మంపై పడితే బాగా దెబ్బతినే అవకాశం ఉంది. వెంటనే ఇరిటేషన్ తలెత్తే అవకాశం ఉంది. అందుకే రంగులను మాత్రం చల్లుకుని ఆతర్వాత స్నానం చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు చిన్నారులకు చెప్పాలి. అలాగే హోలీ ఆడేటప్పుడు చిన్నారులు సున్నితంగా ఎవరికీ గాయాలు తగలకుండా ఆడాలి. రఫ్ గా ఆడితే పిల్లలకు దెబ్బలు తగులుతాయి. సో… హోలీ ఆడే వేళలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలన్నిటినీ పాటించడం అస్సలు మరవొద్దు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News