Sunday, November 16, 2025
Homeహెల్త్Gas Pain: గ్యాస్ వల్ల వచ్చే ఛాతీ నొప్పికి బైబై చెప్పేద్దామిలా!

Gas Pain: గ్యాస్ వల్ల వచ్చే ఛాతీ నొప్పికి బైబై చెప్పేద్దామిలా!

Gas Pain Vs Health Tips:శరీరంలో గ్యాస్ ఏర్పడటం సాధారణమైన సమస్య అయినా, కొన్నిసార్లు అది ఛాతీ వరకు చేరి మంట, నొప్పి వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి చాలామందిలో ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే అది గుండెపోటు లక్షణమా లేదా కేవలం జీర్ణ సమస్య వల్లా అనే అనుమానం వస్తుంది. సాధారణంగా జీర్ణక్రియ సజావుగా జరగకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం లేదా ఒకేసారి ఎక్కువ తినడం వంటి అలవాట్లు గ్యాస్ సమస్యను పెంచుతాయి. అలాగే, గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలను తరచుగా తీసుకోవడం కూడా కారణమవుతుంది.

- Advertisement -

గ్యాస్ కారణంగా వచ్చే ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువమంది మందులు లేదా కొన్ని లిక్విడ్స్ తీసుకుంటారు. అయితే, ఆయుర్వేద నిపుణుల ఆలోచనల ప్రకారం ఇంట్లోనే కొన్ని సహజ చిట్కాల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవాళ్ళకు గ్యాస్ సమస్య ఎక్కువగా వస్తుంది.

Also Read: https://teluguprabha.net/health-fitness/which-is-better-for-diabetes-patients-mutton-or-chicken-doctor-explains/

జీర్ణ సమస్యల సమయంలో పుదీనా చాలా మేలు చేస్తుంది. పుదీనా టీ తాగితే జీర్ణవ్యవస్థ కండరాలు సడలిపోతాయి, గ్యాస్ కదలిక సులభతరం అవుతుంది. దీని వలన ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి లక్షణాలు తగ్గుతాయి. ఇంట్లో పుదీనా ఆకులు ఉంటే వాటితో తాజా టీ తయారు చేసుకుని తాగడం మంచిది.

సోంపు గింజలు..

సోంపు గింజలు కూడా గ్యాస్ తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం లేదా సోంపు నీరు తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేడి నీటిలో సోంపు నానబెట్టి వడపోసి తాగడం వలన కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

అల్లం..

మన వంటింట్లో తరచూ ఉండే అల్లం కూడా గ్యాస్ తగ్గించడంలో ప్రభావవంతం. అల్లంలో ఉండే జింజెరాల్ అనే పదార్థం జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా కడుపు వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం ముక్కను నేరుగా నమలవచ్చు లేదా వేడి నీటిలో మరిగించి తాగవచ్చు.

వాము..

వాము గింజలు కడుపు ఆరోగ్యానికి ప్రసిద్ధి. వాము తినడం వల్ల కడుపులో ఏర్పడిన గ్యాస్ సులభంగా బయటకు వస్తుంది. వామును నేరుగా నమలడం లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

గ్లాసు గోరువెచ్చని నీరు..

గ్యాస్ వల్ల ఛాతీ నొప్పి అనిపించినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం కూడా చాలా ప్రయోజనకరం. ఇది జీర్ణవ్యవస్థలో గ్యాస్ కదలికను సులభతరం చేస్తుంది మరియు మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది.

అదనంగా, నొప్పి ఉన్నప్పుడు కొద్దిసేపు నెమ్మదిగా నడవడం కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర కదలికలు జీర్ణక్రియకు సహాయం చేస్తాయి. అలాగే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగడం ద్వారా కూడా జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.

నెమ్మదిగా తినడం..

త్వరగా తినడం వల్ల గాలి ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆహారం నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తినకుండా చిన్న మోతాదులలో తరచూ తినడం మంచిది.

Also Read: https://teluguprabha.net/health-fitness/tongue-changes-that-may-signal-hidden-health-problems/

అయితే, ఛాతీ నొప్పి భుజాలు, చేతులు, మెడ, దవడ లేదా వెనుకకు వ్యాపిస్తుంటే, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. గుండె సంబంధిత సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలు కలిగించవచ్చు కాబట్టి నిర్లక్ష్యం చేయరాదు.

ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఎటువంటి చిట్కాలను అమలు చేయకముందు వైద్యుడి సూచనలు తీసుకోవడం అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad