Turmeric Benefits:పసుపు మన వంటింట్లో రోజూ ఉపయోగించే మసాలా దినుసు. కానీ అది కేవలం రుచికోసం మాత్రమే కాకుండా, శరీరానికి ఔషధ గుణాలు కూడా అందిస్తుంది. భారతీయ వంటకాలలో పసుపు లేకుండా వంట పూర్తి కాలేదనిపిస్తుంది. పప్పు, కూరగాయలు, ఏదైనా వండినా పసుపు తప్పనిసరిగా వేస్తారు. ఇది ఆహారానికి అందమైన రంగు ఇవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచే సహజ పదార్థం.
కర్కుమిన్ అనే పదార్థం..
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరంలో వాపు తగ్గించడంలో, ఇన్‌ఫెక్షన్‌లను అడ్డుకోవడంలో, శరీరాన్ని ఫ్రీ రాడికల్ దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడుతుంది. అందుకే పసుపును ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యానికి వరకూ అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు.
అయితే కొంతమంది పసుపును అధికంగా వాడటం వల్ల కాలేయానికి నష్టం కలుగుతుందని చెబుతున్నారు. దీనిపై వైద్య నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
వైద్యులు వివరించిన ప్రకారం, పసుపును సరైన పరిమితిలో తీసుకుంటే అది కాలేయానికి హానికరం కాదని స్పష్టం చేశారు. వివరాల ప్రకారం, రోజువారీ ఆహారంలో అర టీస్పూన్ నుంచి ఒక టీస్పూన్ వరకు పసుపు వాడడం సురక్షితంగా చెప్పుకోవచ్చు. ఈ మోతాదు వల్ల కాలేయం మీద ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని వివరించారు.
పసుపు సప్లిమెంట్లు..
కానీ, మార్కెట్‌లో లభించే పసుపు సప్లిమెంట్లు లేదా కర్కుమిన్ మాత్రలు అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం అది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. పసుపులోని కర్కుమిన్ పదార్థం సహజంగా ఉండే పరిమాణంలో లాభదాయకం అయినా, కృత్రిమంగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
పసుపు శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఆహారంలో చిన్న మోతాదు తీసుకుంటే అది శరీరానికి అనేక విధాలుగా సహాయం చేస్తుంది. కర్కుమిన్ పదార్థం ఫ్యాటీ లివర్ వంటి సమస్యల్లో వాపు తగ్గించడంలో తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చూపించాయని వైద్యులు వివరించారు.
అధిక మోతాదులో..
అయితే, అధిక మోతాదులో పసుపు సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయని తెలిపారు. కొంతమంది ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుందని భావించి ఎక్కువగా పసుపు పొడి లేదా మాత్రలు తీసుకుంటున్నారని, అది శరీరానికి హానికరమవుతుందని వివరించారు.
సహజ వంటల్లో పసుపు వాడకం పూర్తిగా సురక్షితం. కానీ, ఔషధం లేదా సప్లిమెంట్ రూపంలో ఎక్కువ మోతాదుగా తీసుకోవడం మాత్రం ప్రమాదకరం. ఈ కారణంగా ప్రతి వ్యక్తి తన శరీర పరిస్థితిని బట్టి మోతాదును నిర్ణయించుకోవాలని సూచించారు.
“సువర్ణ ఔషధం”గా…
ఆయుర్వేదంలో పసుపును “సువర్ణ ఔషధం”గా పిలుస్తారు. అది శరీరంలో ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యంలో కూడా పాత్ర వహిస్తుంది. కానీ, మితిమీరిన వినియోగం ఏ పదార్థానికైనా హానికరం అనే నిజాన్ని మరిచిపోకూడదు.
ఆహారంలో పసుపును టీ, పాలు లేదా వంటకాల్లో మితంగా కలిపి తీసుకోవడం ద్వారా దాని ప్రయోజనాలు పొందవచ్చు. కానీ సప్లిమెంట్ రూపంలో తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


