Sunday, November 16, 2025
Homeహెల్త్HEALTH GUIDE: డ్రై ఫ్రూట్స్ తింటున్నారా? మోతాదు మించితే మొదటికే మోసం! నిపుణుల సూచనలివే!

HEALTH GUIDE: డ్రై ఫ్రూట్స్ తింటున్నారా? మోతాదు మించితే మొదటికే మోసం! నిపుణుల సూచనలివే!

Daily intake of dry fruits : ఆరోగ్యకరమైన ఆహారం అనగానే గుర్తొచ్చేవి డ్రై ఫ్రూట్స్, నట్స్. గుప్పెడు తింటే చాలు, బోలెడు పోషకాలు మన సొంతమవుతాయి. కానీ, అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమవుతుంది కదా! డ్రై ఫ్రూట్స్ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అసలు ఏ డ్రై ఫ్రూట్‌ను ఎలా తినాలి..? ఏ వయసు వారు రోజుకు ఎన్ని తినాలి..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

ఏది ఎలా తినాలి…? ప్రయోజనాలేంటి : ప్రతి డ్రై ఫ్రూట్‌లోనూ ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే సంపూర్ణ ప్రయోజనం.

బాదం: విటమిన్-ఇ, మెగ్నీషియం, ప్రొటీన్లకు ఇది పెట్టింది పేరు. రక్తపోటును నియంత్రించి, గుండెను కాపాడుతుంది. రోజుకు 6 నుంచి 7 పలుకులు, పచ్చివి తినడం కంటే రాత్రంతా నానబెట్టి, పొట్టు తీసి తింటే పోషకాలు సులభంగా శరీరానికి అందుతాయి.

జీడిపప్పు: ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారం. రోజుకు 3 నుంచి 4 పప్పులు తినవచ్చు.

వాల్‌నట్స్: మెదడుకు మేత ఇది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు తినడం శ్రేయస్కరం.

అంజీరా: కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి, మలబద్ధకం నివారణకు దోహదపడుతుంది. రోజుకు 1 లేదా 2, నానబెట్టి తినడం మంచిది.

ఖర్జూర, ఎండుద్రాక్ష: తక్షణ శక్తినిస్తాయి. వ్యాయామం చేసేవారికి చాలా మంచివి. రోజుకు 1 లేదా 2 తినవచ్చు. అయితే, మధుమేహం ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.

పిస్తా: మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె జబ్బులను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఎంత తినాలి? వయసును బట్టి : వయసు, శారీరక శ్రమను బట్టి డ్రై ఫ్రూట్స్ తినే పరిమాణం మారుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

3 ఏళ్ల లోపు పిల్లలకు డ్రై ఫ్రూట్స్ పొడి చేసి, పాలల్లో లేదా ఆహారంలో కలిపి ఇవ్వాలి. ఆరేళ్లు పైబడిన వారికి రోజుకు 3 నుంచి 4 (అన్నీ కలిపి) పెట్టవచ్చు. పెద్దలు, డైట్ చేసేవారు రోజుకు 30 గ్రాములు (సుమారు ఓ గుప్పెడు) తింటే సరిపోతుంది. అన్నింటినీ కలిపి సలాడ్‌లా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.”
– కస్తూరి కృష్ణవేణి, న్యూట్రిషనిస్ట్

ముఖ్య గమనిక : డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా, వాటిలో క్యాలరీలు, కొవ్వులు కూడా అధికంగానే ఉంటాయి. అందుకే, మోతాదుకు మించి తినకపోవడమే మంచిది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు డ్రై ఫ్రూట్స్‌ను తమ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad