Vegetables VS Health: మన వంటలో రుచి, ఆరోగ్యం రెండూ సమంగా ఉండాలంటే కూరగాయల వాడకంలో తీసుకునే జాగ్రత్తలు కీలకం. సాధారణంగా మనం ఆయిల్ తక్కువగా వేయడం, మసాలాలు తగ్గించడం లాంటి విషయాలపైనే దృష్టి పెడతాం. కానీ వాస్తవానికి కూరగాయలను వండటానికి ముందు ఎలా సిద్ధం చేస్తామన్నదే చివరికి వంట రుచిని, ఆకర్షణను నిర్ధారిస్తుంది.
ప్రతి కూరగాయకు ప్రత్యేకత ఉంటుంది. కొన్ని కూరగాయలు కోసిన వెంటనే వండాల్సి వస్తుంది. మరికొన్నిటిని ఓ కొంత సమయం ఉంచితేనే వాటి అసలైన టేస్ట్ బయటపడుతుంది. ఈ నేపథ్యంలో, వంటలో ఎక్కువగా వాడే కొన్ని కూరగాయల విషయాన్ని పరిశీలిద్దాం.
బెండకాయ:
బెండకాయతో తయారయ్యే వంటల సంఖ్యే ఎక్కువ. పులుసు, పచ్చడి, వేపుడు లాంటి ఎన్నో వంటల్లో దీనికి స్థానం ఉంటుంది. అయితే చాలామందికి బెండకాయ వేపుడు జిగురుగా మారుతుంటుంది. దీని ప్రధాన కారణం – కోసిన వెంటనే వండడం. ఇలా చేయడం వల్ల బెండకాయలో ఉండే న్యాచురల్ టేస్ట్ పోతుంది. దీన్ని నివారించాలంటే ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ముక్కలుగా కోసి కనీసం పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ గాలిలో ఉంచితే వాటిలోని అదనపు తేమ పోతుంది. దీంతో వేపుడు కరకరలాడుతూ, మంచి రుచితో తయారవుతుంది.
కాలీఫ్లవర్, క్యాబేజీ:
ఈ రెండు కూరగాయల వాడకం ఇంటిలో అధికంగా ఉంటుంది. అయితే వీటిలో, ముఖ్యంగా కాలీఫ్లవర్ లో సీజన్ కాని సమయంలో చిన్న పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాలీఫ్లవర్ ముక్కలుగా కోసి వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచడం ఉత్తమం. ఇది పువ్వులో దాగి ఉండే పురుగులను పూర్తిగా తొలగిస్తుంది. వాసన కూడా పోతుంది. ఇక క్యాబేజీ విషయానికి వస్తే, దానిని సన్నగా తరిగి ఉప్పు, వెనిగర్ కలిపిన నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టడం వల్ల దీంట్లో ఉండే మానవ కంటికి కనిపించని సూక్ష్మ పురుగులు కూడా తొలగిపోతాయి. ఇలా శుభ్రపరిచిన తర్వాత వండితే ఆరోగ్యానికి హాని ఉండదు.
వంకాయ:
తెలుగు ఇంటి వంటల్లో వంకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది సరిగా వండితే టేస్ట్ పరంగా నాన్ వెజ్ వంటలకు కూడా పోటీ పడుతుంది. అయితే ఈ కూరగాయను కోసిన వెంటనే వండకపోతే మాత్రం నల్లగా మారిపోతుంది. ఇది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) అనే ప్రక్రియ వల్ల జరుగుతుంది. నల్లబడిన వంకాయను వాడితే కూరకు ఆకర్షణీయమైన రంగు ఉండదు. కొంతమంది ఇది చేదుగా కూడా అనిపిస్తుందని భావిస్తారు. దీన్ని నివారించాలంటే కోసిన వెంటనే వంకాయ ముక్కలను ఉప్పు కలిపిన నీటిలో వేసి ఉంచాలి. వండే వరకు ఆ నీటిలోనే ఉంచడం వల్ల వంకాయ రంగు మారదు, రుచి మారదు, పోషకాలు కూడా నిలిచి ఉంటాయి.
Disclaimer
ఈ కథనంలో ఇచ్చిన సమాచారం విద్యా, సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా గానీ, చికిత్స గానీ కాదు. ఆరోగ్య సమస్యలపై స్పష్టత కోసం నిపుణుల సలహా తప్పనిసరి.

