Saturday, November 15, 2025
Homeహెల్త్Segmented Sleep: రెండు విడతల నిద్ర.. మన పూర్వీకుల వింత అలవాటు మాయం వెనుక అసలు...

Segmented Sleep: రెండు విడతల నిద్ర.. మన పూర్వీకుల వింత అలవాటు మాయం వెనుక అసలు కథ!

History of human sleep patterns : రాత్రి 8 గంటల నిరంతరాయ నిద్ర.. ఆధునిక ఆరోగ్య సూత్రాల్లో ఇదొక ముఖ్యమైన భాగం. కానీ, అర్ధరాత్రి మెలకువ వచ్చి, మళ్లీ నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా? అయితే అందులో వింతేమీ లేదంటున్నారు చరిత్రకారులు. ఎందుకంటే, కొన్ని శతాబ్దాల క్రితం వరకు మన పూర్వీకులు మనలా ఒకేసారి నిద్రపోయేవారు కాదు. వారి నిద్రకు రెండు దశలు ఉండేవి. మరి వందల ఏళ్లుగా మానవ సహజమైన ఈ నిద్రా విధానం, కేవలం గత 200 ఏళ్లలో ఎందుకు కనుమరుగైంది? మనల్ని నిరంతరాయంగా నిద్రపోవాలని ఒత్తిడి చేస్తున్న శక్తులేవి?

- Advertisement -

పూర్వీకుల ‘రెండు నిద్రల’ విధానం : చరిత్రకారుడు రోజర్ ఎకిర్చ్ పరిశోధన ప్రకారం, పారిశ్రామిక విప్లవానికి ముందు మానవులు ‘రెండు విడతల నిద్ర’ (Biphasic Sleep)ను అనుసరించేవారు. సూర్యాస్తమయం అయిన కొద్ది గంటలకే వారు ‘తొలి నిద్ర’లోకి జారుకునేవారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఒకటి లేదా రెండు గంటల పాటు మెలకువగా ఉండేవారు. ఈ సమయంలో వారు ప్రార్థనలు చేసుకోవడం, పుస్తకాలు చదవడం, కుటుంబసభ్యులతో ముచ్చటించడం, లేదా ఇంటి పనులు చక్కబెట్టుకోవడం వంటివి చేసేవారు. ఆ తర్వాత మళ్లీ ‘రెండో నిద్ర’లోకి వెళ్లి, సూర్యోదయం వరకు నిద్రించేవారు. ఈ విధానం చాలా సహజమైనదిగా అప్పటి సమాజం భావించేది.

వెలుగుల విప్లవం.. నిద్రకు శాపం : ఈ సహజమైన నిద్రా చక్రం కనుమరుగు అవడానికి ప్రధాన కారణం ‘కృత్రిమ వెలుగు’. 18వ శతాబ్దం చివరలో నూనె దీపాలు, గ్యాస్ లైట్లు, ఆ తర్వాత విద్యుత్ బల్బుల ఆవిష్కరణతో రాత్రిపూట కూడా పగటి వెలుగులు సాధ్యమయ్యాయి. ఈ కృత్రిమ కాంతి, మానవ శరీరంలోని జీవ గడియారాన్ని (Circadian Rhythm) దెబ్బతీసింది. రాత్రివేళ వెలుగులకు కళ్లు అలవాటుపడటంతో, నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆలస్యమైంది. దీంతో నిద్రపోయే సమయం క్రమంగా వెనక్కి జరుగుతూ వచ్చింది.

పారిశ్రామిక ఒత్తిడి, మారిన జీవనశైలి : పారిశ్రామిక విప్లవం ఈ మార్పును మరింత వేగవంతం చేసింది. ఫ్యాక్టరీలలో పనివేళలు నిర్దిష్టంగా ఉండటంతో, కార్మికులందరూ ఒకేసారి మేల్కొని, ఒకేసారి పనికి హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో, రెండు విడతల నిద్ర అనే భావన అసమర్థమైనదిగా, సమయం వృధా చేసేదిగా మారింది. రాత్రిపూట ఒకేసారి, సుదీర్ఘంగా నిద్రపోవడం అనేది ఒక సామాజిక అవసరంగా, క్రమశిక్షణకు చిహ్నంగా స్థిరపడిపోయింది. ఆధునిక పని ఒత్తిడి, సామాజిక అంచనాలు ఈ ఏకధాటి నిద్రా విధానాన్ని మన జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మార్చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad