వేసవి వచ్చింది. ముంజులు వచ్చాయి. ఇవి ఇష్టం ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వీటిని తినడం వల్ల వేసవి తాపం నుంచి రక్షణ మాత్రమే కాదు చర్మం, శిరోజాల సౌందర్యానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. వెంట్రుకలు బిరుసెక్కకుండా కావలసిన తేమను జుట్టుకు ముంజులు అందిస్తాయి. జుట్టును ద్రుఢంగా ఉండేలా ముంజులు సహాయపడతాయి. అంతేకాదు ఇవి జుట్టుకు నేచురల్ కండిషనర్ గా పనిచేస్తాయి. ఉష్ణతాపం వల్ల వెంట్రుకలు చిట్లిపోతాయి. జుట్టు కాంతివిహీనం అవుతాయి. వయసు మీద పడినపుడు శిరోజాలు బలహీనపడ్డట్టు ఎండవేడిమికి శిరోజాలు బలహీనపడతాయి. అంతేకాదు సూర్యరశ్మి వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి.
అతి వేడి కారణంగా తొందరగా బట్టతల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ వేడి తాపం నుంచి ముంజులు మనకు కావలసినంత సాంత్వననిస్తాయి. చర్మం, వెంట్రుకల సంరక్షణకు ఎంతో తోడ్పడతాయి. ముంజుల్లో కాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకవిలువలు ఎక్కువ. వేసవిలో శరీరానికి కావలసిన చల్లదనాన్ని అందిస్తాయి. అంతేకాదు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఇవి ఉంచుతాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. శరీర బరువు తగ్గిస్తాయి. అంతేకాదు వీటిల్లో యాంటీ ఏజింగ్ సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ముంజుల్లో యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షించి వయసు మీద పడకుండా యంగ్ లా కనిపించేలా ముంజలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిని వేవసిలో తినడం వల్ల చర్మాన్ని వేధించే దద్దుర్లు, దురద, మొటిమలు వంటి సమస్యలు తలెత్తవు.. చర్మం దెబ్బతిన్న ప్రాంతంలో వీటి గుజ్జును రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ముంజుల్లో నీరు ఎక్కువగా ఉండి వేసవిలో శరీరానికి కావలసింత హైడ్రేషన్ అందిస్తాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ఈ సీజన్ లో శరీరానికి మంచి కూలెంటుగా ఇవి పనిచేస్తాయి. శరీరానికి కావలసినంత నీటిని అందించడం ద్వారా శరీరం అలసిపోకుండా ముంజులు తోడ్పడతాయి. శరీరానికి కావలసిన నీటిని అందిస్తూ వేసవిలో వడదెబ్బ పాలబడకుండా కూడా ముంజులు రక్షిస్తాయి. శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. జీర్ణక్రియ బాగా జరిగేట్టు సహకరిస్తాయి. సో వేసవిలో ముంజులు ఆరగించండి, అవి అందించే చల్లదనంతో అందంగా, ఆరోగ్యంగా ఉండండి. మచ్చుకగా ఇక్కడ చెప్పిన ముంజుల డ్రింకు తాగండి. వేసవి వేటును తప్పించుకోండి…
వేసవిలో ముంజుల డ్రింకు ఇలా చేసుకోండి
రెండు లేదా మూడు ముంజులు తీసుకుని వాటి మీద పొట్టు తీయాలి. అలాగే ఒకటి లేదా ఒకటిన్నర ముంజులను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు పుచ్చకాయముక్కలు తీసుకోవాలి. అరగ్లాసు కొబ్బరినీళ్లు తీసిపెట్టుకోవాలి. ఒక గ్లాసు నీళ్లు కూడా తీసుకోవాలి. చక్కెర బదులు బెల్లం పొడిని ఈ డ్రింకులో కలపడానికి ఉపయోగించాలి. బ్లెండర్ జార్ తీసుకుని అందులో పొట్టుతీసిన ముంజులు, పుచ్చకాయముక్కలు రెండూ కలిపి గ్రైండ్ చేయాలి. బెల్లం పొడి, కొబ్బరినీళ్లు, గ్లాసుడు మంచినీళ్లను అందులో కలిపి ఆ మిశ్రమాన్ని మళ్లీ బ్లెండ్ చేసి వడగట్టాలి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకుని తరిగిపెట్టుకున్న ముంజుల ముక్కలను అందులో వేసి వడగట్టిన జ్యూసును అందులో పోయాలి. ముంజుల డ్రింకు రెడీ. కావాలనుకుంటే కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకొని తాగొచ్చు. వేసవి తాపానికి కావలసినంత హైడ్రేషన్ ని ఈ ముంజుల డ్రింకు మీకు ఇస్తుంది.