Saturday, November 15, 2025
Homeహెల్త్Infertility Crisis: సంతాన భాగ్యానికి సంకెళ్లు.. ఆధునిక జీవనశైలితో ముడిపడుతున్న ముప్పు!

Infertility Crisis: సంతాన భాగ్యానికి సంకెళ్లు.. ఆధునిక జీవనశైలితో ముడిపడుతున్న ముప్పు!

Modern Lifestyle and Infertility :  ఉన్నత చదువులు, ఉజ్వలమైన కెరీర్, జీవితంలో స్థిరపడాలన్న తపన.. నేటి యువతరం లక్ష్యాలివి. ఈ క్రమంలో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. ఒకవేళ వివాహం జరిగినా, ‘ఇప్పుడే పిల్లలెందుకు’ అంటూ సంతానాన్ని వాయిదా వేస్తున్నారు. తీరా, అంతా కుదురుకున్నాక పిల్లల కోసం ప్రయత్నిస్తే నిరాశే ఎదురవుతోంది. ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతోమంది దంపతులను మానసికంగా కుంగదీస్తున్న ఈ సంతానలేమి సమస్యకు అసలు కారణాలేంటి..? కేవలం జీవనశైలేనా.. లేక మరేవైనా ఆరోగ్య సమస్యలు దోహదం చేస్తున్నాయా..? ఈ చిక్కుముడిని విప్పే మార్గాలేంటి..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

వయసుతో పరుగుపందెం : కెరీర్ పరంగా ఆలస్యంగా పిల్లల్ని కనడం సరైన నిర్ణయమే అనిపించినా, ప్రకృతి గడియారం మన కోసం ఆగదు. ముఖ్యంగా మహిళల్లో సంతాన సామర్థ్యం వయసుతో పాటే తగ్గుతూ వస్తుంది.

మహిళల్లో: సాధారణంగా 32 ఏళ్ల నుంచే గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. 37 ఏళ్లు దాటిన తర్వాత ఈ సామర్థ్యం గణనీయంగా పడిపోతుంది. 40 ఏళ్ల వయసులోపు అండాశయాలు పనిచేయడం మానేసే ప్రమాదం కూడా ఉందని nhs.uk అధ్యయనం హెచ్చరిస్తోంది.

పురుషుల్లో: పురుషులకు ఏ వయసులోనైనా సంతానాన్ని కనే శక్తి ఉంటుందన్నది ఒక అపోహ మాత్రమే. 35 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లోనూ వీర్యం నాణ్యత, శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడతాయి.

మహిళల్లో ముందస్తు హెచ్చరికలు : సంతానలేమి సమస్యను ఎదుర్కొనే మహిళల్లో యుక్తవయసు నుంచే కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నెలసరి సక్రమంగా రాకపోవడం, చాలా త్వరగా లేదా మరీ ఆలస్యంగా రావడం, ఒకసారి వస్తే ఎక్కువ రోజులు రక్తస్రావం కావడం వంటివి ప్రధాన లక్షణాలు. దీనికి హార్మోన్ల అసమతుల్యతే ముఖ్య కారణం. ముఖ్యంగా పీసీఓఎస్ (అండాశయాల్లో నీటితిత్తులు) సమస్య ఇందుకు దోహదం చేస్తుంది. పీసీఓఎస్ ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలతో ముడిపడి ఉంటుందని mayoclinic అధ్యయనం పేర్కొంది.

అంతర్గత అవయవ సమస్యలు : కొన్నిసార్లు హార్మోన్లు సక్రమంగా ఉన్నప్పటికీ, అంతర్గత అవయవాల్లోని సమస్యలు గర్భధారణకు అడ్డుపడతాయి. ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం లోపలి పొర బయట పెరగడం), ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం, కటి భాగంలో ఇన్ఫెక్షన్లు, పుట్టుకతో గర్భాశయంలో లోపాలు వంటివి సంతానలేమికి కారణమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.

పురుషుల్లోనూ కారణాలు అనేకం : సంతానలేమికి కేవలం స్త్రీలే కారణం కాదు. పురుషుల్లోనూ అనేక సమస్యలు ఇందుకు దారితీయవచ్చు. క్రోమోజోమ్‌ల లోపాలు, వరిబీజం (వెరికోసిల్), వృషణాల ఇన్ఫెక్షన్లు వంటివి శుక్రకణాల ఉత్పత్తిని, నాణ్యతను దెబ్బతీస్తాయి. వీటికి తోడు మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి దురలవాట్లు వీర్యం పనితీరును నిర్వీర్యం చేస్తాయి.

ఇద్దరికీ ఉమ్మడి శత్రువులు : దంపతులిద్దరిలోనూ మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా, పురుగుమందులు, ప్లాస్టిక్స్, వాయు కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు కూడా సంతానలేమికి కారణమవుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.

శాస్త్రీయ చికిత్సతోనే విజయం : ఏడాది పాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దానిని సంతానలేమిగా పరిగణించాలి. ఈ సమస్యకు సుమారు 15% మహిళల్లో, 15% పురుషుల్లో, మరో 15% ఇద్దరిలోనూ కారణాలు ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణం ఏదైనప్పటికీ, ఒకరినొకరు నిందించుకోకుండా కలిసికట్టుగా వైద్యులను సంప్రదించాలి. ఐవీఎఫ్ వంటి ఆధునిక, శాస్త్రీయ చికిత్సా పద్ధతులతో సంతాన భాగ్యాన్ని పొందడం నేడు అసాధ్యమేమీ కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad