Coconut Water For Babies:కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, ద్రవ లోపాన్ని పూరించి శక్తిని కూడా ఇస్తుంది. కానీ ఈ సహజ పానీయం ప్రతి ఒక్కరికీ సరిగ్గా సరిపోతుందా అన్న సందేహం తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సంవత్సరం లోపు వయస్సు ఉన్న శిశువులకు కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, శిశువుల జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. పెద్దవారిలా ఏ పానీయం లేదా ఆహారం తిన్నా జీర్ణం కావు. ఈ విషయంలో అతి జాగ్రత్త అవసరం. చిన్నపిల్లలు వైద్య నిపుణులు వివరించినట్టు, కొబ్బరి నీళ్లు శరీరానికి మంచి అయినా చిన్నపిల్లలకు ఇవ్వడంలో జాగ్రత్తలు తప్పనిసరని అంటున్నారు.
తల్లి పాలే వారికి..
వారు చెప్పిన వివరాల ప్రకారం, ఆరు నెలల లోపు ఉన్న శిశువులకు కొబ్బరి నీళ్లు ఇవ్వడం పూర్తిగా తప్పు. ఈ వయస్సులో తల్లి పాలు తప్ప శిశువుకు మరే ఆహారమూ అవసరం లేదు. తల్లి పాలే వారికి కావాల్సిన పోషకాలు, ద్రవాలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లు లేదా ఇతర పానీయాలు ఈ దశలో శిశువుల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి కడుపు నొప్పి, వాంతులు లేదా విరేచనాలకు కారణమవ్వవచ్చు.
ఆరు నెలల తర్వాత..
ఆరు నెలల తర్వాత పరిస్థితి కొంచెం మారుతుంది. ఈ దశలో బిడ్డ మృదువైన ఆహారాన్ని తినడం మొదలుపెడుతుంది. అప్పుడు కొబ్బరి నీళ్లను చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఇవ్వవచ్చు. మొదట ఒకటి లేదా రెండు టీస్పూన్లు చాలు. పిల్లకు ఏమైనా అసౌకర్యం లేకపోతే, ఆ పరిమాణాన్ని క్రమంగా పెంచవచ్చు. కానీ ఈ పానీయం ప్రధాన ఆహారంగా కాకుండా, అదనపు ద్రవంగా మాత్రమే ఇవ్వాలని డాక్టర్ బాగ్రి సూచిస్తున్నారు.
ఆరు నెలల నుండి పన్నెండు నెలల మధ్య పిల్లలకు తల్లి పాలు లేదా ఫార్ములా పాలే ముఖ్యమైన పోషక వనరులు. కొబ్బరి నీళ్లు వాటికి ప్రత్యామ్నాయం కావు. రోజుకు ఒకసారి మాత్రమే కొద్దిగా ఇవ్వడం సరిపోతుంది.
ఇక తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు కొత్త ఆహారం లేదా పానీయం ఇవ్వాలంటే, అది శరీరం ఎలా స్వీకరిస్తుందో తెలుసుకోవడం అవసరం. మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన లేదా ఫ్లేవర్ కలిగిన కొబ్బరి నీళ్లు పిల్లలకు పూర్తిగా అనర్హం. ఎందుకంటే వాటిలో చక్కెర, రసాయన పదార్థాలు, సంరక్షకాలు ఉంటాయి. ఇవి శిశువుల ఆరోగ్యానికి హానికరం.
ఎల్లప్పుడూ తాజా కొబ్బరి నీళ్లు ఇవ్వాలి. ఇవ్వకముందు శిశువుకు కడుపు సమస్యలు ఉన్నాయా లేదా చూడాలి. గ్యాస్, విరేచనాలు, వాంతులు లేదా కడుపు నొప్పి ఉంటే కొబ్బరి నీళ్లు ఇవ్వకూడదు.
ఉప్పు, చక్కెర, తేనె..
తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం, ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఉప్పు, చక్కెర, తేనె వంటి పదార్థాలు అసలు ఇవ్వకూడదు. వీటి వలన శిశువుల మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.కొత్త ఆహారాలను పిల్లలకు పరిచయం చేసే సమయంలో ఒకేసారి ఎక్కువగా కాకుండా, చిన్న మొత్తంలో మొదలుపెట్టాలి. ఏదైనా ప్రతికూల లక్షణం కనపడితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.
కొబ్బరి నీళ్లు..
కొబ్బరి నీళ్లు పిల్లల శరీరానికి కొంత వరకు శీతలత, హైడ్రేషన్ అందించగలుగుతాయి. కానీ తల్లి పాల పోషక విలువలను ఇవి భర్తీ చేయవు. అందువల్ల మొదటి సంవత్సరంలో తల్లి పాలను ప్రధాన ఆహారంగా కొనసాగిస్తూ, కొబ్బరి నీళ్లు పరిమితంగా మాత్రమే ఇవ్వడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


