Aluminium Utensils:ఒకప్పుడు మట్టి కుండల్లో వండుకున్న కుటుంబాల నుంచి నేటి ఆధునిక వంటగదుల వరకు వంట పాత్రల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్టీల్ మరియు అల్యూమినియం పాత్రలే ఇళ్లలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో అల్యూమినియం పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ ధరలో సులభంగా దొరకడం తక్కువ బరువు ఉండటం వేడిని త్వరగా పంచడం వంటి కారణాలతో చాలామంది ఇవే ఎంచుకుంటున్నారు.
అయితే ఇటీవలి కాలంలో అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి హానికరం అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. దీంతో చాలా మందిలో సందేహాలు మొదలయ్యాయి. నిజంగా అల్యూమినియం పాత్రల్లో వండడం ప్రమాదమా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read:https://teluguprabha.net/health-fitness/bottle-gourd-juice-benefits-for-weight-loss-and-health/
వేడి త్వరగా వ్యాపించే..
అల్యూమినియం అనేది తేలికపాటి లోహం. అందుకే దీనితో తయారైన పాత్రలు తక్కువ బరువుగా ఉంటాయి. వేడి త్వరగా వ్యాపించే గుణం కూడా దీనిలో ఉంటుంది. ఈ లక్షణాల వల్ల వంట త్వరగా పూర్తవుతుంది ఇంధనం కూడా కొంత వరకు ఆదా అవుతుంది. అయితే అదే సమయంలో వేడి ఎక్కువగా తగిలినప్పుడు అల్యూమినియం నుంచి సూక్ష్మ కణాలు విడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వంట చేసే సమయంలో ఈ కణాలు ఆహారంలో కలిసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా నిరంతరం అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అల్యూమినియం స్థాయి క్రమంగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల అభిప్రాయం.
కొన్ని ఆరోగ్య సమస్యలు..
అల్యూమినియం శరీరంలోకి ఎక్కువగా చేరితే దీర్ఘకాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. జ్ఞాపకశక్తి తగ్గడం ఆలోచనా సామర్థ్యం మందగించడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కొందరు నిపుణులు దీర్ఘకాలంలో అల్జీమర్స్ వంటి నర సంబంధిత వ్యాధుల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు రోజువారీ అలవాట్ల వల్ల క్రమంగా ఏర్పడే ప్రభావంగా భావిస్తున్నారు.
మూత్రపిండాల ఆరోగ్యంపైనా..
మెదడుతో పాటు మూత్రపిండాల ఆరోగ్యంపైనా అల్యూమినియం ప్రభావం పడే అవకాశం ఉంది. శరీరంలోకి చేరిన లోహ పదార్థాలను బయటకు పంపే బాధ్యత మూత్రపిండాలదే. అల్యూమినియం మోతాదు ఎక్కువైతే మూత్రపిండాలపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల మూత్రపిండాల పనితీరు తగ్గే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంలో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే మూత్రపిండ సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కాల్షియం శోషణను..
అల్యూమినియం శరీరంలో కాల్షియం శోషణను కూడా అడ్డుకునే గుణం కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎముకల బలం తగ్గే అవకాశం ఉంటుంది. ఎముకలు బలహీనపడటం కీళ్ల నొప్పులు పెరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. వయసు పెరిగేకొద్దీ ఎముకల ఆరోగ్యం చాలా కీలకం అవుతుంది. అలాంటి సమయంలో అల్యూమినియం ప్రభావం మరింత ఇబ్బందికరంగా మారవచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఇది ఒక కారణంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థపై కూడా..
జీర్ణవ్యవస్థపై కూడా అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచూ ఇలాంటి ఆహారం తీసుకునేవారిలో గ్యాస్ సమస్య కడుపుబ్బరం అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పుల్లటి పదార్థాలు అల్యూమినియంతో ఎక్కువగా ప్రతిచర్యకు లోనవుతాయి. టమాటా చింతపండు నిమ్మరసం వంటి పదార్థాలు అల్యూమినియం పాత్రల్లో వండినప్పుడు లోహ కణాలు ఎక్కువగా ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వంటలు ఎక్కువగా చేసే అలవాటు ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
జాగ్రత్తగా వాడటం..
అయితే అల్యూమినియం పాత్రలు పూర్తిగా వాడకూడదు అనే నిర్ణయానికి రావడం కంటే జాగ్రత్తగా వాడటం ముఖ్యం అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ఇళ్లలో ఒక్కసారిగా పాత్రలు మార్చడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అల్యూమినియం పాత్రల్లో పుల్లటి ఆహారాలు వండకుండా ఉండటం ఒక ముఖ్యమైన జాగ్రత్త. అలాగే పాత్రను ఎక్కువసేపు మంటపై ఖాళీగా ఉంచకూడదు. అధిక వేడి వల్ల లోహం త్వరగా ప్రభావితం అవుతుంది. వంట అంటినప్పుడు గరిటెతో గట్టిగా గీకి తీయకుండా నానబెట్టి శుభ్రం చేయడం మంచిది.
స్టీల్ పాత్రల్లో..
ఆరోగ్యానికి మరింత భద్రమైన ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపడం ఉత్తమం అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. స్టీల్ పాత్రలు ఈ విషయంలో మంచి ఎంపికగా భావిస్తున్నారు. ఇవి బరువుగా ఉన్నప్పటికీ ఆహారంతో ఎక్కువగా ప్రతిచర్యకు లోనవ్వవు. స్టీల్ పాత్రల్లో వండిన ఆహారంలో పోషకాలు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజువారీ వంటకు ఇవి సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.
మట్టి కుండలు కూడా..
ఇక మట్టి కుండలు కూడా ఆరోగ్యకరమైన వంటకు మంచి ఎంపికగా పరిగణిస్తారు. మట్టి కుండల్లో వండిన ఆహారం నెమ్మదిగా ఉడుకుతుంది. దీంతో పోషకాలు సహజంగా నిలుస్తాయి. ఆహారానికి ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది. అలాగే మట్టి సహజ పదార్థం కావడంతో ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే వీటిని సంరక్షించడం కొంత కష్టంగా ఉండటం బరువు ఎక్కువగా ఉండటం వంటి అంశాలు ఉన్నాయి.
Also Read: https://teluguprabha.net/health-fitness/best-time-to-drink-fruit-juice-for-better-health/
రాగి పాత్రలు కూడా..
రాగి పాత్రలు కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా భావిస్తారు. అయితే రాగి పాత్రల్లో నేరుగా వంట చేయడం కంటే నీటిని నిల్వ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏ పాత్ర అయినా సరే సరైన విధంగా వాడినప్పుడు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

