Friday, September 20, 2024
Homeహెల్త్Muskmelon benefits: చర్మాన్ని మెరిపించే ఖర్బూజా

Muskmelon benefits: చర్మాన్ని మెరిపించే ఖర్బూజా

ఖర్బూజా పండులో చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంది. ఇది చర్మ కణాలను వ్రుద్ధిచేస్తుంది. దీంతో చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. ఫలితంగా మీరు ఎంతో యంగ్ గా కనిపిస్తారు. ఫోలిక్ యాసిడ్ ఫ్రీరాడికల్స్ ను దూరంపెడుతుంది. దీంతో వయసువల్ల ఏర్పడే ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి ముఖంపై తొందరగా ఏర్పడవు. ఖర్బూజా ముఖ్యంగా వేసవిలో చర్మానికి కావలసింత నీటిని, తేమను అందజేస్తుంది. ఈ పండులో నీటితో పాటు డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంది.

- Advertisement -

ఇందులోని విటమిన్ ఎ చర్మాన్ని తేజోవంతంగా చేయడంతోపాటు చర్మానికి కావలసినంత నీటిని అందజేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎల వల్ల చర్మం పునరుద్దీపం అవుతుంది. చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మెరిసేలా చేసే కొల్లాజన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు ఈ పండులో ఊబకాయం తగ్గించే గుణాలు ఉండడంతో పాటు శరీరారోగ్యానికి మేలుచేసే ఎన్నో పోషకపదార్థాలు సైతం పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి, జీవక్రియకు ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఐబిఎస్ (ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్) సమస్యపై ఈ పండు బాగా పనిచేస్తుందిట.

ఈ పండు స్కిన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది కూడా. ఇందులోని విటమిన్ ఇ వల్ల చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఖర్బూజా పండు గుజ్జును తలకు రాసుకుని కాసేపు అలాగే ఉంచుకుని తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టూ రాలడం తగ్గుతుంది. అరటిపండు, ఖర్బూజా గుజ్జు రెండింటినీ కలిపి పేస్టులా చేస్తే హోమ్ మేడ్ కండిషనర్ రెడీ. ఈ పండు తిన్నా లేదా ఖర్బూజా జ్యూసు తాగినా అది గొప్ప యాంటి ఏజింగ్ ఏజెంటుగా పనిచేస్తుంది కూడా. నల్లబడిన పెదాలకు మెత్తగా చేసిన ఖర్బూజా గుజ్జును రాసి కాసేపు అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ పెదాలు గులాబిరంగులో మెరిసిపోతాయి. ఖర్బూజాతో ఇంట్లో ఫేషియల్ చేసుకోవచ్చు.

ఇది ఫేస్ క్లీన్సర్ గా బాగా పనిచేస్తుంది. మొదట ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై చేరిన మలినాలన్నీ పోతాయి. తర్వాత ఖర్బూజా ముక్క తీసుకుని దానితో ముఖం, మెడ భాగాలపై మసాజ్ చేస్తున్నట్టు బాగా రుద్దాలి. ఇలా చేసిన తర్వాత ముఖానికి అంటిన ఖర్బూజా రసం సహజసిద్ధంగా ఆరిపోయేవరకూ ఆగాలి. అది ఆరడానికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది. ముఖంపై రసం బాగా ఆరిన తర్వాత నీళ్లతో ముఖం బాగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కాంతి విహీనంగా ఉన్న చర్మం మెరుపును సంతరించుకుంటుంది. తర్వాత ఫేస్ స్క్రబ్ ను ముఖానికి రాసుకోవాలి. ఖర్బూజా గింజలు కొన్ని తీసుకుని మెత్తటి గుజ్జులా చేయాలి. అందులో ఒక టీస్పూను కాఫీ పొడి వేసి పేస్టులా చేయాలి. ఈ స్క్రబ్ ను ముఖానికి పట్టించాలి. ఆ స్క్రబ్ ను కాసేపు అలాగే ఉంచుకుని తర్వాత నీటితో ముఖం బాగా కడిగేసుకోవాలి.

ఇక చర్మం మెరవాలంటే కొన్ని ఖర్బూజా గింజలు, రసం రెండు తీసుకుని వాటిరెండింటినీ బాగా బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె లో పోసి అందులో ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను ముల్తానీ మట్టి వేసి పేస్టులా చేయాలి. ఆ ఫేస్ ప్యాకును ముఖానికి, మెడకు రాసుకుని అది బాగా ఆరిపోయిన తర్వాత నార్మల్ నీటితో ముఖాన్ని బాగా కడిగేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు ఒక టేబుల్ స్పూన్ ఖర్బూజా గుజ్జులో ఒక టీస్పూను తేనె కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి బాగా ఆరాక నీటితో ముఖం కడిగేసుకోవాలి.

డల్ స్కిన్ ఉన్నవాళ్లు రెండు టేబుల్ స్పూన్ల ఖర్బూజా గుజ్జు, ఒక టీస్పూను ఓట్స్, అర టీస్పూను పసుపు వేసి ఆ మిశ్రమాన్ని పేస్టులా చేయాలి. తర్వాత ఆ పేస్టును ముఖానికి, మెడకు రాసుకుని బాగా ఆరిపోయేదాకా ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లయితే ఒక టేబుల్ స్పూను ఖర్బూజా గుజ్జు, ఒక టీస్పూను శెనగపిండి, అర టీస్పూను నిమ్మరసం మూడింటిని వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదినిమిషాలపాటు దాన్ని ముఖానికి అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పండు ఎలర్జీ ఉన్నవాళ్లు చర్మనిపుణులను సంప్రదించి వారి సలహాననుసరించాలని మరవొద్దు. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఖర్బూజా పండు ఫేస్ మాస్కు రాసుకుని తళ తళ లా మెరిసిపోతూ కనిపించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News