Kidney Damage Symptoms:శరీరంలో కిడ్నీల పనితీరు ఎంతో కీలకమైనది. ఇవి రక్తంలో పేరుకునే మలినాలను వడకట్టి బయటకు పంపిస్తాయి. అదేవిధంగా శరీరంలో నీటి స్థాయిని సమతుల్యం చేస్తూ, టాక్సిన్స్‌ను యూరిన్ రూపంలో బయటకు పంపుతాయి. సాధారణంగా ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. కానీ ఏదైనా కారణం వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతింటే, రక్తంలో మలినాలు పేరుకుపోతాయి. దాంతో శరీరంపై తీవ్ర ప్రభావం చూపే సమస్యలు వస్తాయి.
కిడ్నీలు ఒక్కసారిగా పనికిరాకుండా పోవు. క్రమంగా జీవనశైలిలోని చెడు అలవాట్లు, ఆహారపు తప్పిదాలు, అధికంగా ఉప్పు లేదా ప్రొటీన్ తీసుకోవడం, మసాలా ఆహారం ఎక్కువగా తినడం వంటి కారణాలతో ఇవి బలహీనమవుతాయి. అలాగే ధూమపానం, మద్యం అలవాటు, నిద్రలేమి, బీపీ లేదా షుగర్ కోసం ఎక్కువ కాలం మందులు వాడటం వల్ల కూడా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు కిడ్నీ రాళ్లు లేదా ఇన్ఫెక్షన్లు కూడా కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి.
Also Read: https://teluguprabha.net/gallery/health-risks-of-excess-salt-intake-explained/
తరచుగా మూత్రం …
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరం నుండి వ్యర్థాలు బయటకు వెళ్లకపోవడంతో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనించడం చాలా ముఖ్యం. తొలుత ఎక్కువగా గమనించే లక్షణం తరచుగా మూత్రం రావడం. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇదే సమయంలో మరోవైపు కొన్ని సందర్భాల్లో మూత్రం చాలా తక్కువ పరిమాణంలో రావడం కూడా జరుగుతుంది. ఈ రెండు పరిస్థితులు కిడ్నీ సమస్యలకు సంకేతంగా పరిగణించాలి.
మలబద్ధకం..
మూత్రంలో మార్పులు కూడా గమనించదగ్గవి. నురుగు ఎక్కువగా ఉండటం, రంగు పసుపు పచ్చగా మారటం లేదా రక్తం కనిపించడం వంటి లక్షణాలు కిడ్నీలు బలహీనమయ్యాయని సూచిస్తాయి. ఈ పరిస్థితిలో మలినాలు శరీరంలో పేరుకుపోతాయి. దాంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వాంతులు, ఆకలి మందగించడం, మలబద్ధకం వంటి ఇబ్బందులు కనిపిస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం దీర్ఘకాలంగా ఉంటే ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.
కంటి కింద వాపు…
కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో నీరు, సోడియం సరిగ్గా బయటకు వెళ్లకపోవడం వల్ల వాపులు వస్తాయి. ముఖ్యంగా చేతులు, కాళ్లు, కంటి కింద వాపు ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం పూట ఈ సమస్య మరింత స్పష్టంగా ఉంటుంది.
ఎర్ర రక్త కణాల తయారీలో..
కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు ఎరిత్రోపొయిటిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది ఎర్ర రక్త కణాల తయారీలో సహాయపడుతుంది. ఈ హార్మోన్ లోపం కారణంగా శరీరంలో రక్తం తగ్గి, అనీమియా వస్తుంది. దాంతో విపరీతమైన నీరసం, అలసట, బలహీనత అనుభవిస్తారు. చాలా మంది దీనిని సాధారణ అలసటగా తీసుకుంటారు కానీ ఇది కిడ్నీ సమస్యకు సూచన కావచ్చు.
వెన్నునొప్పి…
కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు వెన్నునొప్పి కూడా రావచ్చు. ముఖ్యంగా రాళ్లు, ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్ కారణంగా ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. మూత్రంలో మార్పులు కూడా ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి.
Also Read: https://teluguprabha.net/gallery/why-diabetics-should-avoid-potatoes-and-choose-healthy-vegetables/
ఇవి మాత్రమే కాదు. శరీరంలో పేరుకునే మలినాలు మెదడుపైనా ప్రభావం చూపుతాయి. దాంతో ఏకాగ్రత తగ్గడం, తరచూ తలనొప్పి రావడం, నిద్రలేమి, మానసిక ఆందోళన వంటి సమస్యలు కనిపిస్తాయి. కొంతమందిలో ఆకలి లేకపోవడం, వాంతులు రావడం వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి.
చర్మం ఆరోగ్యం కూడా ..
ఇక చర్మం ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. కిడ్నీలు సరిగా పని చేయకపోవడం వల్ల శరీరంలో పోషకాల సమతుల్యం దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొడిగా మారిపోవడం, దురద రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కిడ్నీల సమస్యలను సూచించే సంకేతాలుగా పరిగణించాలి.


