Heart procedure on preterm baby : అరచేతిలో ఇమిడిపోయేంత పసికందు.. బరువు కేవలం 600 గ్రాములు.. నెలలు నిండకుండానే పుట్టి, గుండె సమస్యతో ప్రాణాల కోసం పోరాటం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, గచ్చిబౌలి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఛాతీపై కనీసం కోత పెట్టకుండా, కేవలం కాలి నరం ద్వారా ఓ చిన్ని పరికరాన్ని పంపి, ఆ పసికందు గుండెకు చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. అసలు ఆ శిశువుకు వచ్చిన సమస్యేంటి..? ఈ అరుదైన చికిత్సను వైద్యులు ఎలా విజయవంతం చేశారు..?
హైదరాబాద్, టోలిచౌకికి చెందిన దంపతులకు, ఏడు నెలలకే (నెలలు నిండకుండా) బాబు జన్మించాడు. దీంతో, అత్యవసర పరిస్థితుల్లో శిశువును 97 రోజుల పాటు ఎన్ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో, గుండె సంబంధిత ‘పీడీఏ’ (పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్) సమస్య తలెత్తడంతో, శిశువుకు వెంటిలేటర్ అవసరమైంది.
ఏమిటీ ‘పీడీఏ’ సమస్య : తల్లి గర్భంలో ఉన్నప్పుడు, శిశువు ఊపిరితిత్తులకు, మిగతా శరీరానికి మధ్య రక్త సరఫరా కోసం ఓ గొట్టం (డక్టస్ ఆర్టెరియోసస్) ఉంటుంది. పుట్టిన 7 నుంచి 10 రోజుల్లో ఇది సహజంగా మూసుకుపోతుంది. కానీ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో ఇది మూసుకోకపోవడాన్నే ‘పీడీఏ’ అంటారు. దీనివల్ల ఊపిరితిత్తులకు అధిక రక్త ప్రవాహం జరిగి, గుండె పనితీరు దెబ్బతింటుంది. ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు.
వైద్యుల ముందు పెను సవాల్ : ఈ సమస్యకు మందులతో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో, వైద్యులు శస్త్రచికిత్స లేదా పరికరంతో రంధ్రాన్ని మూసివేయాలని నిర్ణయించారు.
శస్త్రచికిత్సకు అడ్డంకులు: చికిత్స చేసే సమయానికి బాబు బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే ఉండటం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో, ఛాతీ కోతతో చేసే శస్త్రచికిత్స అత్యంత ప్రమాదకరమని వైద్యులు భావించారు.
కాలి నరం ద్వారా అద్భుత చికిత్స : ఈ క్లిష్ట పరిస్థితుల్లో, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ భవానీ దీప్తి, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఓ సాహసోపేతమైన, అత్యాధునిక పద్ధతిని ఎంచుకుంది.
‘పికోలో’ (Piccolo) అనే, కేవలం 1.2 మిల్లీమీటర్ల చుట్టుకొలత ఉన్న అతి సూక్ష్మమైన పరికరాన్ని తీసుకున్నారు. ఆ పరికరాన్ని శిశువు కాలి నరం ద్వారా, రక్త నాళాల గుండా పంపి, గుండెలోని ఆ రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు. ఈ పరికరంతో చికిత్స పొంది, కోలుకున్న శిశువుల్లో దేశంలోనే అతి తక్కువ బరువు (600 గ్రాములు) గల చిన్నారిగా ఈ బాబు రికార్డు సృష్టించాడు.
“శస్త్రచికిత్స అవసరం లేకుండానే పీడీఏను మూయడానికి ఈ పికోలో పరికరం ఒక ‘గేమ్ ఛేంజర్’. చికిత్స తర్వాత బాబు పాలు తాగడం మొదలుపెట్టాడు. 2.45 కిలోల బరువుకు పెరిగాక, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశాం.”
– డాక్టర్ భవానీ దీప్తి, డాక్టర్ సుదీప్ వర్మ


